ట్రాఫిక్ సిగ్నల్ పడింది… వేగంగా ఓ కారు వచ్చి ఆగింది… దానికన్నా ముందు ఓ స్కూటరుంది… కారులో కూర్చున్న వ్యక్తి అదేపనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు… ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ చూపించాడు… నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీసాఫీసర్ కొడుకుని అన్నాడు కారతను… అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్టు చిన్నగా నవ్వుతూ…. ఆ స్కూటరిస్టు పేరు పారీకర్… పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారీకర్…
ఇలాంటి ఉదాహరణలు గోవాలో చాలామంది చెబుతుంటారు… నిరాడంబరంగా, నిస్వార్థంగా, నిజాయితీగా ఉండే నాయకుల పేర్లు ఇండియాలో లెక్కతీస్తే చాలా తక్కువ మంది తేలతారు… అలాంటివాళ్లలో పారీకర్ తప్పకుండా టాప్ లిస్టులోనే ఉంటాడు…‘‘ముల్లుతోనే ముల్లును తీయాలి… ఆ నొప్పేంటో శతృవులకూ తెలియాలి’’ వంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దేశం దృష్టి ఆయనపై పడింది… ఉగ్రవాదులు ఓ సైనిక క్యాంపు మీద దాడి చేసి, బర్మా సరిహద్దులు దాటిపోయారు… భారతదేశ చరిత్రలో మొదటిసారి సైన్యం సరిహద్దులు దాటి, బర్మాలోపలికి వెళ్లి దాగున్న ఉగ్రవాదులను ఖతం చేసొచ్చింది… అప్పుడు ప్రపంచం దృష్టి పారీకర్ మీద పడింది… ఇది జరుగుతున్నప్పుడు గోవా వెళ్లాం ముగ్గురం మిత్రులం… స్వతహాగా ఎక్కడికి వెళ్లినా స్థానిక రాజకీయాల గురించి తెలుసుకోవడం ఓ పిచ్చి… అందుకే ఆ మూడు రోజులూ ఎక్కడికి వెళ్లినా రకరకాల వ్యక్తులను మీ మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు అనడిగేవాళ్లం…
Ads
ఏవోవో పార్టీలు ఉండొచ్చు, రకరకాల మతాలు, కులాలు ఉండొచ్చు అక్కడ… కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పారీకర్ పై వ్యతిరేక వ్యాఖ్య చేయగా మేం వినలేదు… అదీ ఆశ్యర్యం అనిపించింది… ముందుగా దేశంలో జరగాల్సింది ‘వ్యక్తి నిర్మాణం’ అనీ, అప్పుడు రాజకీయాలు, వ్యవస్థ తప్పకుండా బాగుపడతాయనీ అనిపించింది…ఇది జరిగిన నాలుగు రోజులకే సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ ఆసక్తికరంగా అనిపించింది… ఓ అబ్బాయి పూణెలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్ లో కూర్చుని పేపర్ చదువుతుంటాడు… ఈలోపు ఒకాయన మెల్లిగా లోపలికి వచ్చి ఓ వడపావ్ ఆర్డరిస్తాడు… ఈ అబ్బాయికి ఎదురుగా కూర్చుని అది తినేసి వెళ్లిపోతాడు… ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ రహస్యంగా ఫోటో తీస్తాడు… తర్వాత ఫ్రెండ్స్ కు చూపిస్తే అతడు దేశ రక్షణ మంత్రి పారీకర్ అని చెబుతారు… ఏదో ప్రైవేటు పనిపై పూణె వెళ్తే అక్కడ అంత సాదాసీదాగా వ్యవహరించాడు ఆయన… అది ఆయన నైజం… ఆ అబ్బాయి ఆశ్చర్యంతో ఇది నమ్మశక్యమేనా అంటూ పోస్టింగ్ పెడతాడు…
గోవాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూటర్ పై అసెంబ్లీకి వెళ్లిన రోజులు అనేకం… ప్రొటోకాల్ ఏమీ పట్టించుకోడు… పోలీస్ కేసుల్లో జోక్యం చేసుకోడు… ఆయన్ని రక్షణ మంత్రిగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే గోవా బాగా బాధపడింది… రాజకీయనాయకులంటే జుగుప్స వ్యక్తమయ్యే నేటికాలంలో అలాంటివాళ్లు అరుదు… (రాజకీయ ధోరణులను వ్యతిరేకించే వ్యక్తులు ఉండవచ్చు గాక, కానీ వ్యక్తిత్వం పరంగా రాజకీయనాయకులు ఎలా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్న) ట్రాఫిక్ జామ్ అయిందనుకొండి… కారు దిగేస్తాడు… పక్కనే ఉన్న స్కూటరిస్టును లిఫ్ట్ అడిగి వెళ్లిపోతాడు… మధ్యలో ఆగేసి బడ్డీ కొట్టులో టీ తాగుతాడు… కొన్నిసార్లు ఫుట్ పాత్ పై అమ్మే బజ్జీలు తింటూ వాళ్లనూ వీళ్లనూ ఏం జరుగుతున్నదంటూ ఆరాలు తీస్తాడు…
గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కు ఇలాగే వెళ్లాడు… సింపుల్ గా తన కారు దిగేసి ఫైళ్లు తీసుకుని లోపలకు వెళ్లాడు.., ఈలోపు సీఎం సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది, నిర్వాహకులు ఏడీ మీ ముఖ్యమంత్రి అనడిగితే… అదుగో వెళ్తున్నాడు కదా ఆయనే మా సీఎం అన్నారుట సెక్యూరిటీ సిబ్బంది… ఓ పేద కుటుంబం నుంచి ఎదిగి, ఐఐటీ చదివి, రాజకీయాల్లో ఓ స్థాయికి చేరినా ఆయనేమీ మారలేదు అంటారు ఆయన్ని తెలిసినవాళ్లు… అందుకే మళ్లీ చెబుతున్నాం… ఆయన రాజకీయ ధోరణులను వ్యతిరేకించడం వేరు… ఒక వ్యక్తిగా ఆయన్ని పరిశీలించి, మంచి లక్షణాలను మెచ్చుకోవడం వేరు… వార్డు మెంబర్ అయితే చాలు, డాంబికాలు పోతూ, దర్జాలు వెలగబెడుతూ, టెక్కులనిక్కుడు వేషాలేస్తూ…. ఎక్కడ ఎంత సంపాదించాలంటూ నానా అవలక్షణాలకు దిగే నాయకులను చూస్తున్న ఈ కాలంలో పారీకర్ వంటి నాయకుల అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంటుంది చాలాసార్లు!!
Share this Article