.
లెక్కలు, సైన్స్ లో నూటికి ఇరవయ్యే పాస్ మార్కులు!
ఎగతాళిగా అన్నా; ఆడుకుంటూ అన్నా, పొరపాటున అన్నా, పిల్లల పేర్లుగా పిలిచినా, చివరికి తిట్టుగా అన్నా…దేవుడి పేరు పలికితే చాలు ఆయన శాశ్వత వైకుంఠ స్థానం ఇస్తాడని చెప్పడానికి పరమ భాగవతోత్తముడు శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవతం కథ- అజామీళోపాఖ్యానం.
Ads
అప్పటినుండి ఇప్పటివరకు అజామీళుడిలా నోటితో చెప్పడానికి వీల్లేని నానా పాపాలు చేసి…చనిపోవడానికి ఒక్క సెకను ముందు “నారాయణ” అని నేరుగా వైకుంఠం చేరి విష్ణువు పక్కన ఎంత మంది కూర్చున్నారో మనకు శుకుడు మళ్ళీ కనిపించి చెబితే తప్ప లెక్కలు తేలవు. లేదా అలాంటివారి నోట విన్న పరీక్షిత్తులైనా చెబితే తప్ప మనకు తెలియదు.
పురాణకథల్లో పాత్రలన్నీ ప్రతీకలుగా ఉంటాయి. అందులోనుండి తత్వాన్ని మనం గ్రహించాలి. సారాన్ని పట్టుకోవాలి. నీతిని పిండుకోవాలి. ఎప్పటికప్పుడు మన రోజువారీ వ్యవహారాలకు వాటిని అన్వయించుకోవాలి.
అలా ఏడు పగళ్లు, ఏడు రాత్రుళ్ళు భాగవతం విని తరించిన పరీక్షిత్తు పాతకథను- ఆధునిక మహారాష్ట్రలో పది పరీక్షలకు అన్వయించుకుంటే పది సెకన్లలోనే మనకు అనంతమైన జ్ఞానం, మోక్షం సిద్ధిస్తాయి.
మహారాష్ట్రలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇకపై సైన్స్, లెక్కల్లో నూటికి ఇరవై మార్కులే వచ్చినా పాస్ అయినట్లే పరిగణించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముంగిట మహారాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి- ఎస్‌సిఈఆర్‌టి సిఫారసు చేసింది. బహుశా ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ సిఫారసును ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అజామీళుడి విషయంలో విష్ణువు అన్నదే మహారాష్ట్ర ఎస్‌సిఈఆర్‌టీ కూడా అంటున్నట్లుగా ఇక్కడ మనం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అలౌకిక, పారమార్థిక, తాత్విక, ప్రతీకాత్మక కోణంలో అన్వయించుకోవాలి.
పిల్లలు చదివితే ఏమి? చదవకపోతే ఏమి? లెక్కలు, సైన్స్ పుస్తకాలు తెరిస్తే ఏమి? తెరవకపోతే ఏమి? ఒక్క ముక్క వస్తే ఏమి? రాకపోతే ఏమి? ఎన్నో వ్యయప్రయాసలకోర్చి… లోకాన్ని క్షమించి వారొచ్చి పరీక్ష హాల్లో కూర్చున్నందుకైనా పాస్ చేయాలి కదా? ప్రశ్నపత్రం తీసుకున్నందుకైనా పాస్ చేయాలి కదా? ఆన్సర్ షీట్లో ఏదో ఒకటి రాసినందుకైనా పాస్ చేయాలి కదా?
నూటికి ముప్పయ్ అయిదు మార్కులొస్తేనే పాస్ ఏమిటి? ప్రజాస్వామిక దేశంలో ఇదెంత తలదించుకునే విషయం? ఏం? లెక్కలు, సైన్సులో నూటికి ఇరవై వస్తే చాలదా? కుదరదంటే చెప్పండి పదికి తగ్గిస్తాం. ఇంకా కష్టమంటారా? అయిదు? ఓకేనా! అది కూడా కష్టమా? సరే… పరీక్ష హాల్ కు వచ్చి వెళ్ళమనండి. పాస్ చేస్తాము. ఇప్పుడు ఓకేనా?
ఆ గట్టెక్కిన మహాభాగవత పురాణ అజామీళుడు నవ్వుకుంటున్నాడు… ఈ ఆధునిక మహారాష్ట్ర పది గట్టెక్కించే బాగోతాన్ని చూసి!
భరత వాక్యం:-
పది వైతరణి గట్టెక్కే ఈ గ్రేస్ మార్కుల విద్యా పరిశోధన మండలి సిఫారసు కరుణ ఆధునిక పరీక్షల ప్రహసన నాటకంలో కేవలం నాందీవాచకమే. పరీక్షలకే తెరపడే భరతవాక్యం ఎంతో దూరంలో లేదు.
చదివినవారిని శిక్షించి… చదవనివారిని రక్షించాల్సిన ఎనిమిదికాళ్ళ కలిధర్మంలో రాయని పరీక్షలన్నీ పాసయి… రాసిన పరీక్షలే ఫెయిలవుతాయి!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
35, చిన్న కథ కాదు అని మొన్నామధ్య ఓ సినిమా… కొడుక్కి లెక్కల్లో 35 మార్కులు సంపాదించి పెట్టడానికి తల్లే గురువు అవుతుంది… అమ్మలూ, మీకు అంత ప్రయాస, వేదన అక్కర్లేదమ్మా ఇకపై… సినిమా శీర్షిక కూడా 20, జస్ట్, చిన్న కథే అని పెట్టేసుకుంటే సరిపోతుంది రాబోయే రోజుల్లో ఎవరైనా…
Share this Article