.
నెలకు మూడు వేల రూపాయలతో అద్భుతమైన జీవితం అట…
గూగుల్ లో చూస్తుంటే… EPFO గురించి ఓ అద్భుత మైన వార్తా వ్యాసం కనిపించింది … EPFO పెన్షన్ అనేది రిటర్మెంట్ తరువాత ఉద్యోగికి రెగ్యులర్ ఆదాయం … గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా బతికే సౌకర్యం … ఇలా సాగుతుంది సదరు వ్యాసం …
Ads
రాసిన వాడికి రాయడానికి ఈ రోజు ఏ వార్తా దొరక లేదని, EPF వెబ్ సైట్ లో ఉన్నది మక్కికి మక్కీ దించేశాడు అనిపించింది … దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యోగం చేస్తే … కొంత ఉద్యోగి నుంచి మరికొంత యజమాని వాటా వసూలు చేసి EPFO పెన్షన్ ఇస్తున్నది మూడు వేలు … మరోవైపు పొరుగు రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు …
EPFO పెన్షన్ వదిలేసుకుంటే వృద్ధాప్య పెన్షన్ ఇంకో వెయ్యి ఎక్కువే వస్తుంది …. ఈ మూడు వేలతో అద్భుతమైన భరోసా జీవితం ఎలా గడపవచ్చో రాసిన వాడికి తెలియదు … మూడున్నర దశాబ్దాలు కోత విధించి మూడు వేలు పెన్షన్ ఇస్తున్న వాడికీ తెలియదు …
పైగా డీసెంట్ స్టాండర్డ్ అఫ్ లివింగ్ అట …. అంటే ఏమిటో మూడు వేలతో అలా ఎలా బతకవచ్చో అది కూడా రాస్తే బాగుండు ..
మూడున్నర దశాబ్దాల ఉద్యోగ జీవితం తరువాత రిటైర్మెంట్ జీవితం గౌరవప్రదంగా, ఆర్థిక చిక్కులు లేకుండా సాఫీగా ఉండాలని ఏ ఉద్యోగి అయినా కోరుకుంటాడు … మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యోగి నుంచి, యజమాని నుంచి ఎంతో కొంత జీతంలో కోత విధించి, 58 ఏళ్ళ వయసులో ప్రభుత్వం ముష్టి పారేసే ఆ మూడు వేల రూపాయల పెన్షన్ ఏమేరకు ఉపయోగకరమో, ఇదేం సంక్షేమమో ఏలినవారికే తెలియాలి..
జీతంలో కోత విధించడం మానేసి, ఆ మేరకు ఉద్యోగి వాటా , యజమాని వాటా ఏ మ్యూచువల్ ఫండ్ లో వేసినా, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న దాని కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ పెన్షన్ వస్తుంది … ఇది రియాలిటీ…
కనీస పెన్షన్ రెట్టింపు అని గత ఆరేడేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి .. మూడేళ్ళ నుంచి దీపావళి రోజు మోడీ శుభ వార్త చెబుతారు అని వార్తలు … దీపావళి పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ప్రకటన రావడం లేదు .. నిజానికి EPFO పెన్షన్ అనేది ఉద్యోగే ప్రభుత్వానికి పెన్షన్ ఇస్తున్నాడు కానీ ప్రభుత్వం ఉద్యోగికి ఇవ్వడం లేదు … ఇది వాస్తవం. (బుద్ధా మురళి)
ఇది మొత్తం చదివాక ఓ జర్నలిస్టు విరక్తితో నవ్వుతూ అన్నాడు… ‘ఆ పెన్షన్ నెలవారీ బీపీ, సుగర్ మందులకు కూడా సరిపోవు… దాదాపుగా కేంద్ర పథకాలన్నీ ఇంతే సార్… ఒక్కడికీ వర్తమాన స్థితిగతులను బట్టి సమీక్షలు చేయాలని ఉండదు, ఎవడికీ జనం పట్టరు… EPF Pension విషయంలో ప్రభుత్వం ఇచ్చేదేముంది సార్… మన డబ్బు ప్లస్ మన యజమాని ఇచ్చిన డబ్బును ప్రభుత్వం వాడేసుకుని, మనకు అరకొర ధర్మ వడ్డీ పారేస్తుంటుంది…’
Share this Article