గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి , వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది . కెరీర్ ప్రారంభంలో జ్యోతి కావచ్చు , తర్వాత కొద్ది కాలంలో ఈ శివరంజని కావచ్చు , పేరొచ్చాక నటించిన ప్రేమాభిషేకం , మేఘ సందేశం కావచ్చు , నేను పేర్కొనని మరి కొన్ని సినిమాలు కావచ్చు నా మాటను కన్ఫర్మ్ చేస్తాయి . 1978 సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను మూట కట్టుకుంది జయసుధ .
అసలీ సినిమాకు శివరంజని అనే టైటిల్ని ఎంపిక చేసుకున్నందుకు దాసరిని మెచ్చుకోవాలి . సంగీతంలో ఒక రాగమయిన శివరంజనిని ఈ మ్యూజికల్ హిట్ సినిమాకు ఎంచుకోవటం గొప్ప విషయం . ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేసిన పాటల్లో ఒకటి అభినవ తారవో నా అభిమాన తారవో అభినయ రసమయ కాంతి ధారవో . నవ రసాలతో శివరంజని నటనా కౌశల్యాన్ని ఆమె ఆరాధకుడు అభివర్ణించే పాట . సి నారాయణరెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం . సాహిత్య పిపాసులు ఒకటికి రెండు సార్లు చదివి, విని ఆస్వాదించవచ్చు .
సాహిత్యానికి మెరుగులు దిద్దింది రమేష్ నాయుడు సంగీతం , బాలసుబ్రమణ్యం గాత్రం . వీటికి జత కలిసింది దాసరి చిత్రీకరణ . ఈ పాట శివరంజని రాగంతోనే ఉంటుందని చదివాను . పండితులు కన్ఫర్మ్ చేయాలి .
ఎంతటి గట్టి గుండెనయినా కదిపేది జోరు మీదున్నావు తుమ్మెదా ఈ జోరెవరి కోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా పాట .
Ads
సినిమాలో శివరంజనికి జరగబోయేది ముందే హింటిచ్చిన పాట . ఈ పాటను వింటుంటుంటే గుండె భారంతో నిండిపోతుంది . ఈ పాటలోని సంగీత సాహిత్యాలు అంతటివి . నాకెంతో ఇష్టమైన పాట . ఈ పాటను కూడా నారాయణరెడ్డి గారే వ్రాసారు .
ఇంకో గొప్ప పాట వేటూరి వారు వ్రాసిన నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు కలుసుకున్న ప్రతి రేయీ కార్తీక పున్నమి రేయి . సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం పాడారు . మెత్త మెత్తగా మనసును తాకుతుంది ఈ పాట . ఈ సినిమాలో ఈ మూడు పాటలు కాకుండా ఉన్న మరో నాలుగు పాటల్నీ దాసం గోపాలకృష్ణే వ్రాసారు .
వాటిల్లో చాలా బాగుండేది మా పల్లె వాడలకు కృష్ణమూర్తి నువ్వు కొంటె పనులకొచ్చావా కృష్ణమూర్తి పాట . యస్ పి శైలజ , బాలసుబ్రమణ్యం పాడారు . మరో పాట కె వి చలం పాత్ర పాడే పాట . బాగానే పాపులర్ అయింది .
మీ అమ్మవాడు నాకోసం ఈని ఉంటాడు మా బాంబువాడు నీకోసం కనీ ఉంటాడు పాట . ఈ పాటలో కాంతారావు తళుక్కుమంటారు . పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ , చందమామ వచ్చాడమ్మ తొంగి తొంగి నిను చూసాడమ్మ పాటలు కూడా బాగుంటాయి .
సంగీత సాహిత్యాల తర్వాత మళ్ళా నటనకు వస్తే మోహన్ బాబుని అభినందించాలి . ఈ పాత్రను మోహన్ బాబు కన్నా మరెవరూ బాగా నటించలేరు అన్నంత గొప్పగా నటించారు మోహన్ బాబు . లేచి తన్నాలని అనిపిస్తుంది అతని నటన . అంత సాఫ్ట్ క్రౌర్యంతో నటించారు . ఇతర పాత్రల్లో గోకిన రామారావు , మాడా , నిర్మలమ్మలు నటించారు .
ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన హరిప్రసాద్ , జయసుధ చెల్లెలు సుభాషిణి . మొదటి సినిమా అయినా బాగా చేసారు . సినిమా తారలకు పిచ్చాభిమానులు ఎలా ఉంటారో దాసరి ఈ సినిమాలో బాగా చూపించారు . చాలామంది తారల్ని చూపించారు దాసరి .
శివరంజనికి సన్మాన సభ పేరుతో సావిత్రి , జయంతి , జానకి , ఫటాఫట్ జయలక్ష్మి , ప్రభలను చూపించారు . వాళ్ళతో పాటు ANR , నగేష్ , ప్రభాకరరెడ్డి , శరత్ బాబు , రమాప్రభ , సి యస్ రావులు కూడా తళుక్కుమంటారు .
ఈ సినిమాకు కధ , మాటలు , స్క్రీన్ ప్లే , నిర్మాణం , దర్శకత్వం అన్నీ దాసరే . ఎన్నయినా భరించగల పర్సనాలిటీ కదా ! తూర్పుగోదావరి జిల్లాలోని కట్టమూరు గ్రామంలో ఔట్ డోర్ షూటింగ్ చేసారు . మూడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . బెంగుళూరు కావేరి థియేటర్లో 52 వారాలు ఆడింది .
తమిళంలోకి నచ్ఛిత్రం అనే టైటిలుతో రీమేక్ అయింది . జయసుధ పాత్రను శ్రీప్రియ నటించగా , హరిప్రసాద్ , మోహన్ బాబులు తమ పాత్రలను రిపీట్ చేసారు . దాసరే దర్శకత్వం వహించారు . తమిళంలో కూడా హిట్టయింది . ప్రధాన పాత్ర శివరంజని చనిపోయినా సినిమా హిట్టయిందంటే ఎంత గొప్ప సినిమాయో చెప్పాల్సిన అవసరం లేదు .
బహుశా ఈ సినిమాను చూడనివారు ఉండరు . నేనయితే ఎన్ని సార్లు చూసి ఉంటానో ! టివిలో వస్తే కాసేపయినా చూడాల్సిందే . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చూడనివారు అర్జెంటుగా చూసేయండి . An unmissable , emotion-filled , musical movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article