ఒక్కసారి దిగువన ఉన్న ఈనాడు వార్త క్లిప్పింగ్ చదవండి… ఎవరో బెంగాలీ నటి నీలాంజన నగరంలో ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిందట… దుర్గామాత విశిష్టతను తెలుసుకుని దర్శనానికి వచ్చిందట… దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయమర్యాదలతో దర్శనం చేయించారట… నవ్వు, జాలి, కోపం వంటి రకరకాల భావాలు ఒక్కసారిగా ముప్పిరిగొంటాయి మనల్ని… ఫాఫం, తెలుగు జర్నలిజం చివరకు ఈ రేంజ్‌కు దిగిపోయిందా అనే జాలి… ఇది ఈనాడు పైత్యమే కాదు… ఆ ఒక్క పత్రికను తప్పుపట్టే పనేలేదు… అన్ని పత్రికలకూ ఈ రోగం వ్యాపించింది… గుళ్లను ఎవరైనా ప్రముఖులు సందర్శిస్తే ఓ ఫోటో, ఓ వార్త… వీలయితే మీడియాతో మాట్లాడుతూ సదరు వీవీఐపీ భక్తులు ఏం మాట్లాడారో రాయడం… ఈ వార్తలు చదువుతూ ఉంటే రాను రాను ఇలాంటి ప్రముఖులకు దర్శనమిచ్చే ఆ దేవుళ్లదే భాగ్యం అన్నట్టుగా… సో వాట్..? ఎవరో ఓ జడ్జి, ఎవరో ఓ లీడర్, ఎవరో ఓ సెలెబ్రిటీ, ఎవరో ఓ ధనిక వ్యాపారి… దర్శనం చేసుకుంటే వార్త అవుతుందా..? ఎందుకు కావాలి..? దర్శనం చేసుకుని వెళ్లిపోవడం ప్యూర్లీ పర్సనల్… అసలు అక్కడ మీడియా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎందుకు ఉండాలి..? ఎవరో ఓ లీడర్ గుడి ముందు సొల్లు రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తే, దాన్ని కళ్లకద్దుకుని ప్రసారం చేయడం దేనికి..? ప్రచురించడం దేనికి..? చివరకు గుడి దగ్గర కూడా ఇదే కాలుష్యమా..? ఒక కోణంలో ఆలోచిస్తే గుళ్ల దగ్గర పవిత్రతను భంగపరచడమే ఇది… ఆయా దేవుళ్లకు కూడా అవమానమే… ఎలాగంటే..?
ఈ వార్తే తీసుకుందాం… బెంగాలీ నటి నీలాంజన ఎవరబ్బా అని ఓసారి గూగుల్‌లో సెర్చండి… రెండు కేరక్టర్లు కనిపిస్తాయి… ఒకరు మళయాళ, తమిళ సినిమాలు, టీవీల్లో చిన్నాచితకా పాత్రలు చేసుకునే కేరక్టర్ ఆర్టిస్టు… పాపులర్ కూడా కాదు… మరొకరు బెంగాలీ నటి… కానీ ఆమె కూడా అంతే… సేమ్, రెండుమూడు సినిమాలు, టీవీల్లో యాక్ట్ చేసి ఉంటుంది… అసలు ఆమె పేరే మనం ఇంతకుముందు విని ఉండలేదు… మరి అలాంటి ఓ అనామక భక్తురాలు వస్తే… రోజూ దర్శించుకునే వేలమందిలో ఆమె ఒకరు అయినప్పుడు… సదరు దేవస్థానం సిబ్బంది ఆమెకు ఆలయమర్యాదలతో దర్శనం చేయించడం దేనికి..? ఆమె వీవీఐపీ భక్తురాలు ఎలా అయ్యింది..? అసలు ప్రొటోకాల్ ఏమిటి..? ఆలయ మర్యాదలతో దర్శనం చేయించడానికి అర్హతలు ఏమిటి..? అంటే… అక్కడికొచ్చిన ఇతర భక్తులు అనామకులు, ఈమె విశిష్ట భక్తురాలా..? పైగా దీనికి ఓ వార్త..? రాసేవాళ్ల తప్పు లేదు… ఇంకెవరో రాస్తే నువ్వెందుకు రాయలేదని తిడతారు కాబట్టి రాసేవాళ్లను తప్పుపట్టలేం… ఎటొచ్చీ ఇలాంటి వార్తలు పబ్లిష్ చేయడం వల్ల ఈనాడు ఏం చెప్పదలుచుకుంది పాఠకులకు..? నేనెప్పుడో పాత్రికేయ ప్రమాణాల్లో వందల మెట్లు దిగిపోయాను, నన్ను చూసి మిగతావాళ్లూ దిగిపోతున్నారు… చూడండహో అని చెబుతోందా..? ఆప్టరాల్ చిన్న వార్తలే… కానీ చదువరిని చివుక్కుమనిపిస్తయ్… గుళ్లకొచ్చే సెలబ్రిటీల వార్తల కవరేజీకి కాస్త లిమిటేషన్స్, స్టాండర్డ్స్ పెట్టుకొండర్రా… అసలు వాటిని మానేస్తే మహా మహా ప్రసాదం..!
Ads
Share this Article