నాగవంశీయే కదా ఈమధ్య విచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నది… కథలో లోపాలు చెబితే బహుమతి అంటాడు, తనే కథ అవసరం లేదంటాడు… రివ్యూలతో ఇంపాక్ట్ ఉండదు అంటాడు, ఫస్ట్ షో తరువాత ట్వీట్లతో ప్రభావం అంటాడు…
ఈమధ్యకాలంలో నోటికొచ్చింది ఏదో చెప్పేస్తూ వార్తల్లో ఉండటం ఎలా అనే ఓ ప్రయోగం నిర్వహిస్తున్నట్టున్నాడు… తీసేవాడికి చూసేవాడు అలుసు అన్నట్టుగా… రాసేవాళ్లు దొరికారు కదాని ఏదో ఒకటి తిక్క తిక్క వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు…
ఆయనదే ఇప్పుడొచ్చిన లక్కీ భాస్కర్ సినిమా… సినిమాకు మంచి కథ ఎంత అవసరమో తనకు తెలియదేమో గానీ ఈ సినిమా దర్శకుడు అట్లూరి వెంకీకి తెలుసు… కథ లేకుండా సగటు తెలుగు హీరో సినిమాల్లాగే ఉత్త ఎలివేషన్లు, డొల్ల ఇమేజీ షోలు ఓ పరభాష హీరోతో చేస్తే అది వృథా అవుతుందనీ తెలుసు… అందుకే సంక్లిష్టమైన స్టాక్ మార్కెట్, బ్యాంకుల మోసాల కథను ఎంచుకున్నాడు…
Ads
కారణం… నైన్టీస్‌లో దేశాన్ని కుదిపేసిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం… దానిపై వచ్చిన వెబ్ సీరీస్ కూడా కాస్త పాపులర్ అయ్యింది కూడా… ఆ భిన్నమైన కథను ఎంచుకోవడం ఈ దర్శకుడి సాహసమే… ఆ కథ చెప్పి మెప్పిస్తాననే టెంపర్‌మెంట్ కూడా..! నవతరం నటుల్లో మంచి మెరిట్ ఉన్న దుల్కర్ సల్మాన్ కూడా భిన్నమైన కథ విని, అట్లూరి వెంకీ గత సార్ సినిమా గురించి విని, సినిమాకు వోకే చెప్పి ఉంటాడు…
ఐతే ఇక్కడ కథతో రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి… సగటు ప్రేక్షకుడికి సంక్లిష్టమైన బ్యాంకులు, స్టాక్ మోసాలు అర్థం కావు… ఎంత వివరంగా చెప్పినా బుర్రకు ఎక్కవు… పైగా ఇదంతా నైన్టీస్ నాటి స్టాక్ మార్కెట్ స్థితిగతులు… అదే హర్షద్ మెహతా మాత్రమే కాదు, ఇంకొన్ని స్కాములూ బయటపడి, ఇప్పుడు బాగా మార్పులు చోటుచేసుకున్నాయి కూడా…
సో, స్టాక్, బ్యాంకు మోసాలు తెలిసినవాడికేమో ఓ పాత కథ చూస్తున్నట్టు ఉంటుంది… అవి తెలియని వాడికి సినిమా కథే అర్థం కాదు… అందుకని వెంకీ తెలివిగా తను చెప్పాలనుకున్న కంటెంట్‌కు ఓ మధ్యతరగతి జీవితాన్ని, ఆశల్ని, అనివార్యంగా మోసాల వైపు వేసే అడుగుల్ని యాడ్ చేశాడు… ఎమోషన్స్ టచ్ చేశాడు… సగటు తెలుగు సినిమా వాసనలు లేకుండా చూసుకున్నాడు…
ఐనాసరే… కథ వివరంగా చెప్పాలనుకునే ప్రయాసలో ల్యాగ్ తప్పనిసరి అయిపోయింది… సెకండాఫ్ బోర్ కొట్టడానికి కారణం అదే… వెబ్ సీరీస్‌కు అర్హమైన కథను రెండు మూడు గంటల్లోకి కుదించి, గ్రిప్పింగ్ నెరేషన్‌తో చెప్పడం కష్టమే సుమీ… అదే తడబాటు… (డ్రాగ్, ల్యాగ్ అనే పదాలు వాడితే ఆ తిక్క వ్యాఖ్యల శ్రీకాంత్ అయ్యంగార్ మళ్లీ తెర మీదకు వచ్చి తన సంస్కారానికి తగిన బూతులు అందుకుంటాడేమో… ఐనా సరే సెకండాఫ్ ల్యాగే…)
దుల్కర్ నటనకు వంక పెట్టలేం, ఆ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా న్యాయం చేశాడు… మీనాక్షికి మంచి పాత్రలు పడితే బాగా రాణిస్తుంది… చివరగా… ఒక కొత్త కథ… తెలుగు హీరోల మూస కథలకు భిన్నమైన కథ… ప్రజెంటేషన్ కూడా అంతే… తెలివిగా రాయబడిన కథ… నిజానికి తెలుగు సినిమాలకు ఇదే అవసరం… (తన కథ హర్షద్ మెహతా కాలం నాటిదే అని చెప్పడానికి దాదాపు అదే పేరుతో ఓ స్టాక్ బ్రోకర్ పాత్ర కూడా ఉంటుంది సినిమాలో…)
ఐతే సంక్లిష్టమైన ఆర్థిక మోసాల కథను థియేటర్ దాకా చూడాలా..? థియేటర్ల దోపిడీకి మన పర్సులు సమర్పించుకోవాలా..? ఓటీటీలో వచ్చాక తాపీగా, వెనక్కి, ముందుకు సినిమాను కదిలిస్తూ… కథను అర్థం చేసుకుంటూ చూడటం బెటర్ కదా అంటారా..? మీ నిర్ణయం మీ ఇష్టం..! మీరూ ఈ హీరో, ఈ దర్శకుడిలాగే తెలివైనవారు..!!
Share this Article