ఎనుకటి రోజుల్లో ఈ రోజు.., రేపటి కోసం ఎంతో ఎదురుచూసేది… ఇప్పుడంటే సేమ్యా పొట్లాలు బయట అమ్ముతున్నారు కానీ ఒకప్పుడు వీటిని ఇండ్లలోనే చేసేవారు… మంచిగా కాలిన మట్టి కుండ తెప్పించి రోజూ మధ్యాహ్నం తీరిక చేసుకొని వీటిని చేసేవారు…
పిండిని పాలతో బాగా ముద్ద చేసి. ఇంట్లో నెయ్యి. అంటే ఇంటి బర్రె పాలు దాలిలో బాగా కాగబెట్టి, అట్టు వోతే మీగడ కట్టాక, రాత్రి తొడేసి, ఉట్టికి బట్టకట్టే వారు… మర్నాడు చల్ల కవ్వంతో చిలికి తీసిన వెన్న ఎచ్చబెట్టి మంచి నెయ్యి చేసేవారు…
కుండ బోర్లా పెట్టీ, పిండి ముద్ద కుండ మీద పెట్టీ, నెయ్యి రాసి, ఒడుపుగా సన్నటి దారాల్ మాదిరిగా సేమ్యా లేదా సావంగాలు చేసేవారు. ఇప్పటివరకే వాటిని ఎండబెట్టి మంగళ హారతులు అయ్యాక దాలిలోని పాల పటువ నుంచి వేడి పాలు పోసుకొని చక్కర వేసుకొని తింటుంటే.. స్వర్గానికి ఒక్కటే మెట్టు తక్కువ దూరంలో వుందనిపించేది…
Ads
ఇప్పుడు దాలి లేదు.. అట్టులా మీగడ కట్టే పాలూ లేవు.. దాలి అంటే మీకు తెలువదని కాదు కానీ.. నేలకు కనీసం ఒక అడుగు అంతకు తక్కువ లోతుకు రెండు మూడు జానల నిడివితో తవ్వి, దుబ్బ మట్టితో మెత్తేది. రోజూ దాంట్లో కొద్దిగా ఉనుక పోసి, బర్రె పెండతో చేసిన పిడకలు పొందికగా పేర్చేది.
పాలు పిండగానే మట్టి కుండ శుభ్రంగా కడిగి పాలు పోసి దానిలో పెట్టేది. చుట్టూ ఉన్న పిడకల నుంచి వేడి, కుండ అన్నివైపులా సమానంగా చేరి పాలు చక్కదనంగా మరిగేవి. మర్నాడు పొద్దున దాలి గిన్నె కడిగేటప్పుడు వాగులోంచి తెచ్చిన కౌచిప్పతో అడుగున పేరిన మిగులు తీస్తుంటే ఆ గోకు కోసం మొహాలు కడుక్కొని కుడి చేయి జాపి నాకంటే నాకని పోటీ పడే వాళ్ళం. అమ్మ అందరికీ సమన్యాయం చేసేది… అమ్మ కదా… (వుప్పల రమేశ్ శర్మ)…
Share this Article