అన్నాచెల్లెలు సెంటిమెంట్ సినిమా . టైటిల్ని బట్టే అర్థం అవుతుంది . మనదేశంలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంటుతో వచ్చిన సినిమాలు సాధారణంగా ఫెయిల్ కావు . అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి , ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం , ఇలా ఎన్ని పాటలు ఉన్నాయో , ఎన్ని సినిమాలు వచ్చాయో !
1979 లో వచ్చిన ఈ బంగారు చెల్లెలు సినిమా కూడా బాగుంటుంది . షిఫ్టింగులతో విజయవాడలో వంద రోజులు ఆడింది . శోభన్ బాబు బంగారు చెల్లెలుగా శ్రీదేవి నటించింది . ప్రియురాలిగా భార్యగా జయసుధ నటించింది .
1975 లో కన్నడంలో వచ్చిన దేవర కన్ను అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడంలో ఆరతి , అనంత నాగ్ , అంబరీష్ ప్రభృతులు నటించారు . బెంగాలీ భాషలో నిహార్ రంజన్ గుప్త వ్రాసిన ఒక నవల ఈ సినిమాకు మూలం .
Ads
తన చెల్లెల్ని మానభంగం చేసినవాడిని హత్య చేసాడనే ఆరోపణతో ఓ డాక్టర్ని పోలీసులు తరుముతుంటారు . తన చెల్లెలి బాగోగులను చూడమని మరో డాక్టర్ మిత్రుడికి అప్పచెపుతాడు హీరో . క్లైమాక్సులో కోర్టులో చెల్లెలు జరిగినది అంతా చెపుతుంది . మొత్తం మీద కేసు నుండి హీరో బయటపడతాడు . టూకీగా ఇదీ కధ . కధ కూడా కొత్తగానే ఉంటుంది .
బోయిన సుబ్బారావు దర్శకత్వం బాగానే వహించారు . సత్యానంద్ డైలాగులు కూడా బాగుంటాయి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ఆత్రేయ వ్రాసిన అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది , చిత్రీకరణ కూడా బాగుంటుంది .
వేటూరి వ్రాసిన చలిజ్వరం చలిజ్వరం ఇది చెలిజ్వరం , ముందూ వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు డ్యూయెట్లు హీరోహీరోయిన్ల మీద బాగుంటాయి .
ఈ సినిమాలో విలన్ మాదల రంగారావు చేతిలో మోసపోయిన వనితగా ఫటాఫట్ జయలక్ష్మి నటించింది . ఆమె మీద ఓ పాట ఉంటుంది . ఆత్రేయ వ్రాసారు . పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగ చేస్తాడు అనే పాట . బాగుంటుంది .
ఆయన వ్రాసిందే మరో డ్యూయెట్ విరిసిన సిరిమల్లీ పెరిగే జాబిల్లీ కూడా శ్రావ్యంగా ఉంటుంది . జయమాలిని , మాడా , సారధిల మీద డాన్స్ పాట లగ్గం పెడితే లగెత్తుకొచ్చా సైరో జంబైరో హుషారుగా ఉంటుంది . వేటూరి వ్రాసారు . బాలసుబ్రమణ్యం, సుశీలమ్మ , యల్ ఆర్ ఈశ్వరిలు పాటల్ని పాడారు .
ఎర్ర హీరో మాదల రంగారావు ఇంకా విలన్ వేషాలు వేస్తున్న రోజులే అవి . ఈ సినిమాలో ప్రధాన విలన్ అతనే . బంగారు చెల్లెల్ని ఆదరించి పెళ్ళి చేసుకునే ఉదాత్తమైన డాక్టర్ పాత్రలో మురళీమోహన్ నటించారు . ఇతర పాత్రల్లో గిరిజ , నాగభూషణం , ధూళిపాళ , హేమ సుందర్ , ఝాన్సీ , ప్రభాకరరెడ్డి , కాంతారావు , రాజనాల , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .
1977లో తమిళ భాషలో శివాజీ గణేశన్, సుజాత జంటగా అన్నన్ ఒరు కోయిల్ పేరుతో నిర్మించబడింది. ఇదే సినిమాను మలయాళంలో 1981లో ప్రేమ్‌నజీర్, శ్రీవిద్య జంటగా ఎల్లామ్ నినక్కు వెండి అనే పేరుతో నిర్మించారు. తెలుగులో చెల్లెలు పాత్ర ధరించిన శ్రీదేవి మలయాళ సినిమాలో కూడా అదే పాత్రను పోషించింది.
సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . మహిళలకు బాగా నచ్చుతుంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . శోభన్ బాబు అభిమానులు అయితే మరోసారి చూడండి . A feel good and sister-brother sentimental movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article