నమస్తే తెలంగాణ అనే పత్రిక మెయిన్ పేజీల్లో ఓ చిన్న వార్త కనిపించింది… మంచి స్టోరీ… భారతీయ న్యాయవ్యవస్థ నిజంగా తక్షణం ఏ సమస్యపై దృష్టిపెట్టాలో చెప్పే వార్త… చీఫ్ జస్టిస్ ఈమధ్య తరచూ పాత చట్టాల గురించి, మార్పుల గురించి ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నందున ఈ వార్తకు నిజంగానే అమిత ప్రాధాన్యం ఉన్నట్టనిపించింది… ఈ కథకు సరైన ప్రయారిటీ కూడా ఇవ్వలేకపోయారని నిందించాలని అనిపించింది… కానీ అదెక్కడో చదివిన గుర్తు… కాస్త వెనక్కి వెళ్లి చెక్ చేసుకుంటే దొరికింది… మన ‘ముచ్చట’లోనే మార్చి నెలలో వివరంగా చెప్పుకున్నాం… మరి 9 నెలల తరువాత ఆ పత్రిక మళ్లీ ఎందుకు రాసినట్టు..? ఏమోలే.., ఏదో ఒకటి రాసేద్దాం, పేజీలు నింపేద్దాం… మన దయ- పాఠకుడి ప్రాప్తం అనుకునే పత్రిక అది… దానికి ఎవరైనా ఏం చెప్పగలరు..? ఇంతకీ ఆ వార్త క్లిప్పింగు ఏమిటో… మనం గతంలో చెప్పుకున్న ఆ దయనీయమైన కథేమిటో చూడండి ఓసారి…
ఈమధ్యే విడుదలైన తెలుగు సినిమాలు మూడు… నాంది, జాతిరత్నాలు, చెక్… చూశారు కదా… పోనీ, వాటి కథలు తెలుసా..? ఆ మూడు కథల్లోనూ తప్పుడు కేసులు, జైళ్లు కామన్ పాయింట్ కదా… ఇక మనం ఓ నమ్మబుల్ అనిపించని ఓ రియల్ కేసులోకి వెళ్దాం… అది 1981… అంటే నలభై ఏళ్ల క్రితం… బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా… ఓ హత్య జరిగింది… పోలీసులు ఓ నేపాలీ వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయనే హంతకుడు అని స్టాంపేశారు… సాక్ష్యాలదేముంది..? అన్నీ వచ్చేశాయి… చార్జిషీటు కూడా వేసేశారు… ఆ నేపాలీ పేరు దీపక్ జైషి… అప్పట్లో ఎంత మొత్తుకున్నాడో తెలియదు… ఎవరూ వినిపించుకున్నవారు లేరు… అసలు తనను తీసుకుపోయి ఓ హత్య కేసులో జైలులో పడేశారు అనే సంగతే తనవాళ్లకు తెలియదు… ఏమైపోయాడో నేపాల్‌లోని వాళ్ల సంబంధీకులకు అర్థం కాలేదు… ఏళ్లు గడుస్తూనే ఉన్నయ్… మన పోలీస్ వ్యవస్థ, మన జైళ్లు, మన న్యాయవ్యవస్థల గురించి పదే పదే చెప్పుకునేది ఏముంది..? ఆ న్యాయదేవత ఎత్తిపట్టుకున్న ఆ ధర్మఖడ్గం నిండా తూట్లే కదా… ఈ జైషి గురించి అడిగేవాళ్లు లేరు… క్రమేపీ కేసు పెండింగ్ పడిపోయింది… జైలులో జైషి కాలం ఈడుస్తూనే ఉన్నాడు… ఏళ్లు గడిచిపోయినయ్… ఎన్నేళ్లు తెలుసా..? అక్షరాలా నలభై ఏళ్లు… షాక్ తినకండి… నలభై ఏళ్లుగా ఆ కేసు పెండింగే… ఆగండి… ఇంకా ఉంది… మనం మరింత ఏడ్వడానికి ఈ కథలో ఇంకొన్ని ఉద్వేగాలు, కన్నీళ్లు కూడా ఉన్నయ్…
Ads
నిజానికి ఆ హత్య కేసులో… తనంతట తనే మొదటి విచారణలోనే నేరం అంగీకరిస్తే… తనకు యావజ్జీవం గనుక పడి ఉంటే… రెమిషన్లు గట్రా కలుపుకుని ఏ పదీ పన్నెండేళ్లలోనే బయటికొచ్చేవాడు… బతుకుజీవుడా అని నేపాల్ వెళ్లిపోయేవాడు… కానీ అలా జరిగితే ఇక కథేముంది..? నేపాల్‌కే చెందిన మరొకాయన ఆమధ్య ఈ జైషి ఉన్న డమ్ డమ్ సెంట్రల్ జైలుకు వచ్చాడు… తను ఇచ్చిన సమాచారం ద్వారా హ్యామ్ రేడియో ఆపరేటర్లు కొందరు జైషి ఉనికిని సరిగ్గా కనుక్కున్నారు… నిజమే… సినిమాటిక్ కాదు… జైషి బంధువులకు తెలిశాక నేపాల్ ప్రభుత్వాన్ని కంటాక్ట్ చేశారు ఈమధ్యే… మావాడిని అక్రమంగా, దశాబ్దాలుగా విచారణ కూడా దిక్కులేకుండా నిర్బంధించారు అని మొత్తుకున్నారు… ఈ వార్త ఎక్కడో చదివిన కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ కదిలిపోయి ఓ లాయర్‌ను పిటిషన్ వేయాలని సూచించాడు… అయ్యా, సదరు విచారణ ఖైదీని విడుదల చేసి, నేపాల్‌కు పంపించేయండి, ఇదీ కథ అంటూ ఓ పిటిషన్ దాఖలైంది కొద్దిరోజుల క్రితం…
ఈలోపు తెలిసింది ఏమిటయ్యా అంటే..? సదరు ఖైదీ మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు అని… అప్పుడెప్పుడో జైలులోకి వచ్చిన కొత్తలో… 1982లో పరీక్షలు జరిపారట… అప్పుడే ఆయన మానసిక స్థితి బాగాలేదని గుర్తించారట… ఐనాసరే, ఇన్నేళ్లలో తన ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాథుడే లేడు… ఇప్పుడు తన పరిస్థితి ఏమిటీ అంటే..? తన నేటివ్ ప్లేస్ ఎక్కడో తనకు తెలియదు… మెమొరీ మొత్తం కోల్పోయాడు… ఆయన్ని పరీక్షించిన కలకత్తా యూనివర్శిటీ నిపుణులు ‘‘తొమ్మిదేళ్ల మెంటల్ ఏజ్‌లో ఉన్నాడు’’ అని చెప్పారు… అంటే ఇన్నేళ్ల జీవితం పోయింది, ఆరోగ్యం పోయింది… సత్యనాశ్… ఇప్పుడు వయస్సు 70 ఏళ్లు… చివరకు ఏం తేల్చారు..? ‘‘ఈయనపై పెట్టిన కేసు విచారణ కూడా ఇక శుద్ధ దండుగ… విచారణ ఎదుర్కునే స్థితిలో ఆయన లేడు…’’ దాంతో అరుదుగా వినియోగించే విశేష అధికారాల్ని వాడి హైకోర్టు ఆయన విడుదలకు ఆదేశించింది… (Section 482 of the Code of Criminal Procedure (inherent powers of high court) and Articles 226 and 227 of the Constitution) అంతేకాదు… జైషిని తిరిగి నేపాల్‌లో వాళ్ల బంధువులకు అప్పగించాలని, ఈమేరకు నేపాల్ కాన్సులేట్, హైకోర్టు రిజిస్ట్రార్ కోఆర్డినేట్ చేసుకోవాలని సోమవారం తీర్పు చెప్పింది… బాగుంది… కానీ ఓ ప్రశ్న సశేషం… జవాబు లేనిది కూడా… ఒక వ్యక్తి కోల్పోయిన నలభై ఏళ్ల జీవితానికి పరిహారం ఏమిటి..? ఎవరు బాధ్యులు..? వాళ్లకు శిక్షలు ఏమిటి..? దయచేసి ఏదో ఒకటి చెప్పండి యువరానర్..!!
Share this Article