బ్రహ్మకయిన పుట్టు రిమ్మ తెగులు . ఈ సినిమా కధాంశమే అది . బ్రహ్మకే కాదు , ఎవరికయిన పుట్టు . నా ఉద్దేశంలో ఎవరికయినా అంటే మగవారికే కాదు ; ఆడవారికయిన పుట్టు ఆ తెగులు అని . ఈ సినిమాలో జరిగేది అదే .
ఓ నడి వయస్కుడి కుటుంబం , పక్కింటి అల్లరిపిల్ల కుటుంబం చాలా చాలా సన్నిహితంగా ఉంటారు . ఓ రోజు ఆ నడి వయస్కుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అల్లరిపిల్ల వానలో తడిసొచ్చి , బట్టలు మార్చుకుంటూ ఉంటే నడి వయస్కుడికి ఆ వాంఛ పుడుతుంది . అల్లరిపిల్ల ప్రతిఘటించదు . క్లైమాక్సులో అల్లరిపిల్ల ఆత్మహత్య చేసుకోవటంతో కధ ముగుస్తుంది .
What is the takeaway from this ? ఆడయినా , మగయినా హద్దులు దాటితే ఆ కోరిక ఉద్భవించే అవకాశం ఉంటుంది . అలా ఉత్పన్నమయ్యే దుస్సంఘటనల వలన విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి . కన్ను పోయే కాటుక అవసరమా ! దీన్ని తేల్చుకోవలసింది బుధ్ధి ఉన్న ఆడా మగ . పరిణామాల గురించి ఆలోచించే ఓపిక , ఖాతరు లేనివారు ఎలాంటి కాటుక అయినా పెట్టుకోవచ్చు . ఈ సూక్తి ముక్తావళిని ఆపి ఇంక సినిమాకు వద్దాం .
Ads
ఈ సినిమా సరితది . మరో చరిత్రలో కన్నా ఎక్కువ అల్లరిపిల్లగా నటించింది . చాలా బాగా నటించింది . సినిమా మొదట్లోనే shadography తో ప్రేక్షకులకు పరిచయం అవుతుంది . Shadography అంటే చేతి వేళ్ళతో ఇమేజెస్ చూపటం . తోలుబొమ్మలాటలాగా ఉంటుంది . మనలో చాలామంది చిన్నప్పుడు ట్రై చేసే ఉంటాం .
సినిమా అంతా గలగలా పారుతూనే ఉంటుంది సరిత పాత్ర . పాపం ! బాలచందర్ కి సరితకు పూర్వ జన్మలో ఏదో పంచాయతీ ఉండి ఉంటుంది . మరో చరిత్రలో చంపాడు , మళ్ళా ఈ గుప్పెడు మనసులోనూ చంపుతాడు . మామూలుగానే బాలచందర్ షేక్స్పియర్ లాగా ట్రాజెడీ లవర్ . ఆయనవి కూడా ట్రాజెడీలు పాపులర్ అయినంతగా కామెడీలు పాపులర్ కాలేదు .
మరో ప్రధాన పాత్ర సుజాతది . ఓ రచయిత్రి , సెన్సార్ బోర్డు సభ్యురాలు . సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పెంచిన కూతురిని మగాడు పెళ్ళి చేసుకునే సీనుకి అభ్యంతరం పెడుతుంది . అలాంటి ఘటనే తన ఇంట్లో జరుగుతుంది . ఈ సంఘర్షణాత్మక పాత్రని చాలా బాగా పోషించింది .
మూడో ప్రధాన పాత్ర నడి వయస్కుడు శరత్ బాబు పాత్ర . పక్కింటి అల్లరిపిల్లతో ఉన్న చనువు అక్రమ సంబంధంగా మారటం , అది విపత్కర పరిస్థితికి దారి తీయటం , ఆ సీన్ భార్య , కూతురు లైవ్ గా చూడటం , వారిద్దరినీ ఫేస్ చేయలేకపోవటం , వగైరా సన్నివేశాలను సమర్ధవంతంగా పోషించాడు .
ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది . కమలహాసన్ అతిధి పాత్రలో తళుక్కుమంటాడు . ఇతర పాత్రల్లో నారాయణరావు , రమణమూర్తి , శ్యామల ప్రభృతులు నటించారు . 1979 నవంబరులో వచ్చిన ఈ గుప్పెడు మనసు సినిమా తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో తీసారు .
ఈ రెండు సినిమాలు అంతకుముందు మళయాళంలో వచ్చిన ఆ నిముషం సినిమాకు రీమేక్ . మళయాళంలో సరిత పాత్రను శ్రీదేవి పోషించింది . మిగిలిన రెండు ప్రధాన పాత్రలను మధు , షీలా పోషించారు .
మన తెలుగు సినిమాకు పాటలను ఆత్రేయ వ్రాయగా , యం యస్ విశ్వనాధన్ సంగీతాన్ని అందించారు . ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ బాల మురళీకృష్ణ పాడిన మౌనమె నీ భాష ఓ మూగ మనసా . చెవుల తుప్పు వదులుతుంది . పొరపాటున కూడా మిస్ కాకండి . ఈ పాటకు బాల మురళీకృష్ణ సినీ హెరాల్డ్ వారి ఉత్తమ గాయకుడి అవార్డుని పొందారు .
నేనా పాడనా పాట, నువ్వునా సంపంగి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . నేనా పాడనా పాట వాణీ జయరాం గొంతులో కొత్తగా పరిమళించింది . మిగిలినవి థియేటర్లో బాగున్నా బయట హిట్ కాలేదనుకుంటా . ఈ సినిమాలో సుజాత ఆల్విన్ టోఫ్లర్ వ్రాసిన ఫ్యూచర్ షాక్ అనే పుస్తకాన్ని చదవటం చూపుతాడు దర్శకుడు . ఈ పుస్తకం ప్రపంచమంతా కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడయ్యాయి 1970s కే .
మనందరికీ తెలిసిందే . బాలచందర్ సినిమాలు భిన్నంగా , విభిన్నంగా ఉంటాయి . ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే . డబ్బులు వస్తాయా రావా అనేది ఆ నిర్మాతల అదృష్టం . పోస్టర్లలో సమర్పకులుగా యం యస్ రెడ్డి పేరుంది . ఆయన మల్లెమాల రెడ్డి గారా మరో రెడ్డి గారా నాకు తెలియదు . బహుశా మల్లెమాలే అయి ఉండవచ్చు .
ఆరోజుల్లో బాగా చర్చించబడ్డ సినిమాయే . చూడతగ్గ సినిమా . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . చూడనివారు వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . బాల మురళీకృష్ణ గారి పాటను మాత్రం అర్జెంటుగా వినండి , చూడండి , ఆస్వాదించండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
చాన్నాళ్ల క్రితం ముచ్చట పబ్లిష్ చేసిన ఇదే సినిమాకు సంబంధించిన మరొక విశ్లేషణాత్మక కథనం ఇది… ఆసక్తి ఉన్న వారి కోసం… (రచన – Sai Vamshi)
శరత్‌బాబు అనగానే గుర్తొచ్చేది ఈ సినిమాయే… బాలచందర్ క్లాసికల్ క్రియేషన్…
Share this Article