తెలంగాణలోని ఓ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థికి తీన్మార్ మల్లన్న అనే ఇండిపెండెంట్ దీటైన పోటీ ఇవ్వడంతో ఇప్పుడు ‘‘ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం’’ అనేది మళ్లీ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోయింది… ఎందుకంటే..? మల్లన్న ప్రధానబలం అదే కాబట్టి… తనకంటూ ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని, పకడ్బందీగా, సెటైర్‌తో కూడిన విమర్శల్ని చేస్తూ పోయాడు… ప్రజల్లో ఆసక్తిని పెంచుతూ పోయాడు… ఈ కార్యాచరణ తనను తెలంగాణ ఉద్యమ సంధానకర్తగా వ్యవహరించిన కోదండరాంనూ దాటిపోయేలా చేసింది ఫస్ట్ ప్రయారిటీ వోట్లలో…! దీంతో పార్టీల అనుబంధ సోషల్ మీడియా విభాగాల మీద జోరుగా చర్చలు సాగుతున్నయ్… ప్రత్యేకించి ఏపీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఘోరాతిఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది కదా… దాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నెత్తికి చుడుతున్నారు… జగన్ ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకుంటే, వెక్కిరించి… చివరకు తను కూడా అదేరకంగా వాతలు పెట్టుకున్నాడు చంద్రబాబు… ఆ పీకే దోస్త్ రాబిన్నే పెట్టుకున్నాడు… మరి చంద్రబాబును ఆ వ్యూహకర్త ఎందుకు గెలిపించలేకపోయాడు..? ఈ వార్తలు యూట్యూబ్ చానెళ్లలోనే కాదు, ఒకటీరెండు మెయిన్ స్ట్రీమ్ టీవీల్లోనూ కనిపిస్తున్నయ్…
ఒక పార్టీ ఓడినా, గెలిచినా దానికి బోెలెడు కారణాలుంటయ్… స్థానిక ఎన్నికల్లో జగన్ పార్టీ విజయఢంకాకు ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు… తెలుగుదేశం ఓటమికి రాబిన్ శర్మ చేసిన తప్పు కూడా ఏమీ లేదు… పైగా ఇది ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ నడుమ వైరమూ కాదు… ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతారు… అంతే… అయితే ఇక్కడ మనం చెప్పుకునే ముచ్చట నిజానికి అది కాదు… మన మీడియా, మన సోషల్ మీడియా ధోరణి గురించి… అజ్ఞానం అంటే ఫీలయిపోతారు గానీ… రాబిన్ శర్మ పేరుతో నెట్లో సెర్చించే కొద్దీ బోలెడు వార్తలు కనిపిస్తున్నయ్… వీడియోలు, థంబ్ నెయిల్స్, ఇమేజెస్ ఉన్నయ్… హహహ… వాళ్లంతా వాడింది ఎవరి ఫోటోనో తెలుసా..? ప్రముఖ వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత రాబిన్ శర్మ ఫోటోలు… తను పన్నెండు పుస్తకాలు రాస్తే అన్నీ హిట్… The Monk Who Sold His Ferrari ఎంతటి సంచలనమో తెలిసిందే కదా…
Ads
నిజానికి ప్రశాంత్ కిషోర్ గతంలో పెద్దగా తెర మీద కనిపించేవాడు కాదు… కానీ ఎప్పుడైతే తనకు పొలిటికల్ యాంబిషన్స్ పెరిగాయో… నేరుగా తెర మీదకు వచ్చేస్తున్నాడు… తను ఒప్పందాలు కుదుర్చుకున్న పార్టీల అధినేతలతో ఫోటోలు దిగుతున్నాడు… అవి పబ్లిషవుతున్నయ్… జగన్ అయితే ఓ పార్టీ మీటింగులోనే తనను అందరికీ పరిచయం చేశాడు… అందుకని తన వీడియోలు, తన ఫోటోలు అందరికీ లభ్యం… కానీ టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ అలా కాదు… అంతా తెర వెనుక పని మాత్రమే… కనీసం ఫోటోలు కూడా దొరకవు… పైన చూశారుగా అదొక్కటే తన పేరిట దొరికే ఫోటో… ఐతేనేం… నెట్లో రాబిన్ శర్మ అని కొడితే ఆ రైటర్ ఫోటో కనిపించడం, దాన్ని కట్ చేసి పేస్ట్ చేసేయడం… ఇదీ జరుగుతోంది… ఏమోలే… అసలు సోషల్ మీడియా, మీడియా అంటేనే ఫేక్ ప్రధానం కదా ఇప్పుడు… ఆఫ్టరాల్ ఒక్క తప్పుడు ఫోటోకు ఏమొచ్చిందిలే..?!
Share this Article