Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది కథ కాదు… అవును, ఓ జీవితం… బాలచందర్ జీనియస్ క్రియేషన్…

November 8, 2024 by M S R

ఇది కధ కాదు . బాలచందర్ సినిమాలు కధల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన . మనసుకు హత్తుకుపోయేలా తీస్తారు . మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు . అలాంటి సినిమాలలో ఒకటి జూన్ 1979 లో వచ్చిన ఈ ఇది కధ కాదు . జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డుని తెచ్చిపెట్టిన సినిమా .

ఈ సినిమాలో రెండు స్త్రీ పాత్రలు ఉంటాయి . అందరికీ జయసుధ నటింంచిన సుహాసిని పాత్రే గుర్తు ఉంటుంది . అంతకన్నా గొప్ప పాత్ర సుహాసిని అత్త గారిది . కొడుకు చేసిన తప్పును సరిదిద్దటానికి విశ్వ ప్రయత్నం చేసి , తన కొడుకు మారడనే నిర్ణయానికి వచ్చి , ఆ కొడుకును వదిలేసి కోడలు వెంట నడిచేందుకు సిధ్ధమైన పాత్ర .

ఈ పాత్రను నటించిన నటి పేరు లీలావతి . కన్నడంలో సుమారు 400 సినిమాలలో నటించింది . అన్ని భాషల్లోను కలిపి సుమారు 600 సినిమాలలో నటించింది . మన రమాప్రభ , తమిళంలో మనోరమ లాగా .

జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది ? మహానటి సావిత్రి , వాణిశ్రీల వారసురాలు . మూడు మగ పాత్రలు . ప్రతి నిమిషం తాను మగాడిని , మగాడు ఆడది సమానం కాదు , ఆడదాన్ని హింసించడం మగాడి జన్మ హక్కు అని భావించే మృగాడి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు . ఎంత బాగా నటించారంటే సీట్లోనుంచి స్క్రీన్ లోకి దూరి తన్నాలని అనిపిస్తుంది . అంత బాగా నటించారు . సాడిస్టు పాత్ర . కెరీర్ మొదట్లో ఇలాంటి పాత్రలను చాలానే వేసారు .

Ads

leelavathi
మరో పాత్ర జానీ . కమలహాసన్ నటించిన పాత్ర . సుహాసిని మెప్పు కోసం , ఆమె ప్రశాంతంగా ఉండేందుకు అహర్నిశలూ మనసులోనే ఆరాధించే మంచి బాలుడిగా బాగా నటించారు . ఈ పాత్రకు గొప్ప పేరు రావటానికి కారణం వెంట్రిలాక్విజం . ఈ కళను చూపిన మొదటి సినిమా ఇదేనేమో !

అప్పట్లో చాలామంది సాధారణ ప్రజలకు ఈ కళ గురించి తెలియదు . ఇలాంటి పాత్రను ఒకదాన్ని సృష్టించాలనే ఆలోచనే గొప్ప ఆలోచన . ప్రఖ్యాత మిమిక్రి కళాకారులు వేణుమాధవ్ చేస్తుండేవారు . కమలహాసన్ ఈ వెంట్రిలాక్విజం పాత్రను అద్భుతంగా నటించారు .

ప్రేక్షకులు మరచిపోలేని మరో పాత్ర భరణి . జయసుధ , భరణి ప్రేమించుకుంటారు . ఈ పాత్ర కూడా కళాకారుడి పాత్రే . జయసుధ విడాకులు తీసుకున్నాక మరోసారి కధలోకి వస్తుంది . రెండోసారి కూడా జయసుధని పెళ్ళి చేసుకోలేక పోతాడు . సరితను పెళ్లి చేసుకుంటాడు . ఉదాత్తమైన పాత్ర .

మొదట్లో విలన్ గా నటించిన శరత్ బాబు పోనుపోను ఇలాంటి ఉదాత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు . బాలచందర్ సినిమాలలో పాత్రల సంఖ్య తక్కువగా ఉంటుంది . అలా అని మనకు అనిపించకుండా సినిమాను పరుగెత్తిస్తారు . మనకు తెలియకుండానే సినిమాతో పాటు పరుగెత్తుతూ ఉంటాం .

kamal
ఈ సినిమాకు ప్రాణం యం యస్ విశ్వనాథన్ సంగీతం . ముత్యపు చిప్పలో పడితే కానీ వాన చినుకు ముత్యం కాదు . అలాగే మంచి సంగీతం , గాత్రం ఉంటేనే కానీ సాహిత్యానికి గుర్తింపు రాదు . ఈ సినిమాలో పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు .

సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము పాట ఈరోజుకీ చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది . సుశీలమ్మ పాడారు . జూనియర్ జూనియర్ అంటూ సాగే ఇటు అటు కాని హృదయంతోని ఎందుకురా ఈ తొందర పాట . పిల్లలకు , సాధారణ ప్రేక్షకులకు భలే నచ్చిన పాట . బాలసుబ్రమణ్యం , రమోలా పాడారు .

idi katha kadu1
కమలహాసన్, సరితలు డాన్స్ పాట తకధిమితక జతజతకొక కధ ఉన్నది పాట ఇద్దరూ అద్భుతంగా నటించారు . ఈ పాటను చూసినప్పుడల్లా నాకు మేరా నామ్ జోకర్ హిందీ సినిమాలో రాజ్ కపూరే గుర్తుకు వస్తారు . అసలు ఈ సినిమాలో ఈ పాత్ర సృష్టికి బాలచందర్ కు రాజ్ కపూర్ జోకర్ పాత్రే స్ఫూర్తి ఏమో అని అనిపిస్తుంది . నాకయితే మాత్రం కమలహాసన్ పాత్ర చూసినప్పుడల్లా రాజ్ కపూర్ జోకర్ పాత్రే గుర్తుకు వస్తుంది .

idi katha kadu
ఇంకా మరో రెండు పాటలు ఉన్నాయి . గాలికదుపు లేదు కడలికంతు లేదు . సంగీత సాహిత్యాలు రెండూ అదుర్సే . మరో పాట జోల పాట పాడి ఊయలలూపనా పాట . చాలా శ్రావ్యంగా ఉంటుంది . వెరసి ఈ సినిమా సక్సెస్ కు కారణాలయిన సంగీత సాహిత్య గాత్రాలను అభినందించాల్సిందే .

కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాలను బాలచందర్ అందిస్తే , పదునైన డైలాగులను గణేష్ పాత్రో అందించారు . ఇప్పటికీ తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . తక్కువ బడ్జెట్తో బాగా హిట్టయిన సినిమా . పైగా బ్లాక్ & వైట్ సినిమా .

1977 లో తమిళంలో బాలచందర్ తీసిన అవర్ గళ్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . జయసుధ పాత్రను సుజాత పోషించింది . కమలహాసన్ రెడింటిలోనూ నటించారు . చిరంజీవి పాత్రను రజనీకాంత్ పోషించారు . చిరంజీవి , కమలహాసన్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదొక్కటే .

ఈరోజుల్లో కూడా ఈ సినిమాను చూడనివారు ఉండరు . ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . An unmissable , musical , art film . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు    …. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

 



గాలికదుపు లేదు అనే పాట గురించే ఓ కథనం రాయొచ్చు… చాలామంది రాశారు కూడా… కానీ ఈ సినిమాలోని మరోపాట… నిజంగా ఓ ప్రయోగం… కమలహాసన్ కాబట్టే అంత బాగా చేశాడేమో… చిత్రీకరణ, పాట, ట్యూన్ అన్నీ అప్పట్లో అందరూ అబ్బురపడుతూ చూశారు… ‘ముచ్చట’ గతంలో రాసిన ఆ కథనం లింక్ ఇది… చదవండి… 



అప్పట్లో ప్రతి పాటా ఓ ప్రయాస… ఓ ప్రయోగం… ఈ పాట కూడా అంతే…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions