.
ఇంతలోనే ఎంత మార్పు..? శబరిమలలో రుతుమహిళలను ప్రవేశపెట్టిన ప్రభుత్వంలో భాగమైనందుకు సీపీఐ లెంపలేసుకుంది కదా… మత కార్యక్రమాల్లో పాల్గొందాం, దూరంగా ఉండొద్దు అని ఎట్టకేలకు కళ్లు తెరుచుకున్నట్టు నటించింది కదా…
కేరళ సీపీఎం కూడా అదే తరహా తీర్మానాలు చేసుకుని పుష్కరిణి స్నానాలకు, ప్రక్షాళనలకు, ప్రాయశ్చిత్తాలకు సై అంటోంది కదా… ఇప్పుడిక సీపీఎం తన రెడ్ రాజ్యాంగ సవరణలకు పూనుకుంటోంది… మనమూ సంఘ్ తరహాలో చొచ్చుకుపోదాం జనం గుండెల్లోకి అంటోంది…
Ads
సరే… లెఫ్ట్ పార్టీల ఐక్యత వంటి డొల్ల, అసాధ్య సిద్ధాంతాల్లాగే ఇదీ ఆచరణకు నోచుకుంటుందనే విశ్వాసం ఎవరికీ లేదు… కాకపోతే ఇన్నాళ్లూ తను మతంపై అనుసరించిన తన విధానం తప్పే అని ఒప్పేసుకున్నట్టే అనుకోవాలా..? పోరాటాలు విడిచి, ఎంతసేపూ ఏదో ఓ పార్టీకి తోక పార్టీగా అతుక్కుని తాత్కాలిక పబ్బం గడిపే ధోరణికి ఈ హేతువాదానికి నిర్హేతుక తిలోదకాలు అదనపు జోడింపు అన్నమాట…
ఈ వార్త చూడగానే మిత్రుడు గుర్రం సీతారాములు రాసిన ఓ సెటైర్ చదవండి… దిగువన…
తప్పేమీ లేదు, యజమాని ఆయుధాలతోనే యజమాని సౌధాన్ని కూలగొట్టాలి…
సోషలిజానికి ప్రధాన శత్రువు పెట్టుబడి కాబట్టి మనమే పెట్టుబడిదారులుగా అవతారం ఎత్తాలి, అందులో లోపాలు యెత్తి, వాళ్ళను వశపర్చుకుని, ఆస్తులు పంచాలి…
ముందు మన బొజ్జ నిండాక ఆకలి పేగుల గురించి ఆలోచించాలి…
తర్వాత మత విశ్వాసులతో కలిసిపోవాలి…
ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఇంకో దారి కదా అక్కడ కూడా…
ముందుగా…
రిలీజియస్ స్టూడెంట్ ఫెడరేషన్, రిలీజియస్ యూత్ ఫెడరేషన్, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ లాగా మనం కూడా యంగ్ మాన్స్ రిలీజియస్ అసోసియేషన్ పెట్టుకోవాలి… అప్పుడు భక్తి మీద యుద్ధం చేసి ముక్తి మార్గం దిశగా యుద్దాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి …
ఈ మధ్య పార్టీలో ఈ అన్యవర్గ ధోరణులు వచ్చాయి కానీ మన అమృత పాణి అరటి పండ్లు కేరళ కుట్టియన్ నంబూద్రిలు ఆ దారిలోనే ఇది వేద భూమి అని రాశారు, మనవే పాడు బుర్రలు అర్థం చేసుకోలేదు…
ఇప్పుడు మోడీ కూడా ఇది వేద భూమి అంటున్నాడు కాబట్టి అది కూడా మన శాఖనే…
పనిలో పని వూరికో గుడి కట్టి అందులో మన గడ్డం సాములు మార్క్స్, ఎంగిల్స్, స్టాలిన్ దేవతా విగ్రహాలు పెడితే… ముక్తి, భుక్తి, యుక్తి, అంతిమంగా కపాల మోక్షం కూడా…
జాగ్రత్త, మావో గుడి కట్టమాకండి, కొంపలు కొల్లేరు అవుతాయి
ఒకప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన సిపిఎం అభ్యర్థి అని గోడల మీద చదివినా…
వీలుంటే బాజాప్తా గా భాజపాతో విలీనం చేసి తీర్మానాల కాపీ మాయం చేసి, కాషాయ జెండా పీకేసి, మన జెండా పెట్టుకుంటే జనతా ప్రజాస్వామిక విప్లవం వచ్చినట్టే…
ఇంత సింపుల్ మోక్షానికి ఇన్ని జెండాలు రక్తాలు అవసరమా మనకు..?
ముందు ఈ తీర్మానం రాసినాయన చేతిలో ఒక త్రిదండం పెట్టండి…
ఆయనను యెర్ర జియ్యరుగా ప్రకటించండి…
సమతా మూర్తిలాగా…
ఆయనలో సోషలిస్టు మూర్తి ఉన్నాడు..
తందానా హరి తందనానా బోలె…
యెర్ర సేన బెదిరి పోదు
తంద నానా బోలె
జై బోలో కారత్ మహా స్వామికీ జై..
ఎంతకు తెగించారు రా మీరు….
అసలు వార్త ఈ లింకులో చదువుకోవచ్చు…
https://www.andhrajyothy.com/2024/national/lets-work-with-religious-believers-1332024.html
Share this Article