.
యాదాద్రి అనే పేరును మొత్తం తుడిచిపెట్టేసి… పాత యాదగిరిగుట్ట అనే పేరునే అధికారిక రికార్డుల్లో పొందుపరిచి… ఆ పాత ద్రోహాన్ని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు…
నో డౌట్… రీసెంట్ తన నిర్ణయాలు, అడుగుల మీద ప్రజలకు చాలా అభ్యంతరాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ ఈ చిన్న విషయంలో మాత్రం భక్తజనం ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్నాడు…
Ads
అబ్బే… నేములోనేముంది అని తేలికగా తీసిపారేయకండి… నేములోనే ఉద్వేగం ఉంది… తరాల అనుబంధం ఉంది… జియ్యరుడికి అంత సోయి లేదు కాబట్టి యాదాద్రి అన్నాడు… దిక్కుమాలిన పేరు… మా గుట్ట మాకుంటే… ఈ అద్రి ఎందుకొచ్చింది నడుమ..?
(థాంక్ గాడ్… భద్రాద్రి, వేమాద్రి ఎట్సెట్రాలు, ఎక్సట్రాలు ఆగిపోయినట్టే అనుకోవాలా..? ముందు ఆ థర్మల్ స్టేషన్ పేరు మార్చండర్రా… కొండగట్టును కొండాద్రి, ధర్మపురిని ధర్మాద్రి, కాలేశ్వరాన్ని కాళాద్రి అంటారేమోనని తెలంగాణ సమాజం భయపడి వణికిపోయింది… మీ దుంపలు తెగ… )
అద్రి అంటే కూడా గుట్టే కదా… మరి అచ్చ తెలంగాణ భాషలో గుట్ట అని పిలుచుకుంటే తనకేం అభ్యంతరం..? మరి తన తెలివి, తన మేధస్సు జనానికి తెలియాలి కదా అనుకున్నట్టున్నాడు… జియ్యర్లు ఏది చెబితే అది చేసి సాగిలబడే పాలకుడికి తెలివి ఉండొద్దా అంటారా..?
అదే ఉంటే ఈ కథ దేనికి..? 1300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి, ఈరోజుకూ ఊరుస్తుంది… కుంగుతుంది… అంతటి ఘనమైన నిర్మాణం కేసీయార్ ఘనత… పైగా మధ్యలో స్థంభాల మీద తన బొమ్మలు, తన పథకాలు… అదో దరిద్రం… లక్ష్మినర్సింహుడు ఉగ్రుడై మింగేస్తాడని భయపడి, సర్దుకున్నాడు, దిద్దుకున్నాడు… సరే, ఎవరెంత మింగారో మనకెందుకు, ఆ ఉగ్ర నరసింహుడే చూసుకుంటాడు గానీ…
ఆ నరసింహ దంపతులను విడదీయాలని ఒక పర్వర్టెడ్ పీఠాధిపతి… కుదరదు అని అర్చకులు కస్సుమనేసరికి నాలుక కర్చుకుని లెంపలేసుకున్న ఓ పాలకుడు… పైగా లక్ష పుస్తకాల సిద్ధాంతి… తెలంగాణ ఖర్మ…
ఈరోజుకూ ఆ కొత్త గుడికి పోతే అదొక కొత్త వాతావరణం… మనకు తెలిసిన ఆ పాత గుట్ట ఆధ్యాత్మికత, ఆ పాజిటివిటీ అక్కడ కరువు… ఘనమైన ఆర్కిటెక్చర్ కాదురా నాయనా..? దర్శనం చేసుకున్నాక కాసేపు అక్కడ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నడుమ కూర్చుంటే, సేద తీరితే… ఓ రిలాక్సేషన్… మది ప్రశాంతం…
కల్వకుంట్ల జియ్యరుడు దాన్ని మొత్తం నాశనం చేశాడు… ఆ ఎగువ పుష్కరిణిని మూసేశాడు తను… గుట్ట కింద ఎక్కడో ఎవరికీ పెద్దగా అడ్రస్ దొరకని ప్లేసులో కేశఖండనాలు, స్నానాలు… ఏదో దేశానికి వెళ్లి, తెలియని మొక్కులు సమర్పించినట్టు..! లక్ష్మినర్సింహుడు బహుశా ఇక ఎప్పుడూ కేసీయార్ అనే కేరక్టర్‌ను క్షమించడేమో…
గవర్నర్‌ను రానివ్వరు, వేరే పార్టీల నేతలనూ రానివ్వరు… అదేదో సొంత పార్టీ ఆఫీసు ఓపెనింగులాగా కార్యక్రమాలు… చెబితే కంటు… ఆ వాస్తు శిల్పులను, ఆ సలహాదార్లను, ఆ ఆర్కిటెక్టులను నర్సింహస్వామి క్షమిస్తాడో లేదో నాకు తెలియదు గానీ…
సీఎం రేవంత్, ఆ శాఖ మంత్రి సురేఖ దాన్నలా వదిలేయండి… అక్కడి అధికారులకు స్వేచ్ఛనివ్వండి… లోకల్ ఇన్‌ఫ్లుయెన్స్ పడనివ్వకండి… తెలంగాణలోకెల్లా ధనిక, ప్రసిద్ధ దేవాలయాన్ని కాస్త ఆ పాత కేసీయార్, ఆ పాత జియ్యర్ దుర్వాసనల నుంచి విముక్తం కానివ్వండి…
తెలంగాణ ప్రాంత ఆత్మదైవం ఆ యాదగిరిగుట్ట లక్ష్మినర్సింహస్వామికి కాస్త ఊపిరి సలపనివ్వండి… అసలే తిరుమలకు వెళ్లాలంటేనే భయపడే స్థితిలో అక్కడి పాలన ఉంది… కనీసం మా పాత స్వామిని మాకు ఇవ్వండి పాలకులూ..! అయ్యా, రేవంతుడూ… నువ్వు ఏం ఉద్దరిస్తావో తరువాత సంగతి… మా దేవుడిని మాకు వదిలెయ్… వోటుకునోటు నుంచి విముక్తం చేస్తాడు…!!
Share this Article