.
తాతమ్మ కల – తేజస్వి – మున్నా
ఎవరనుకున్నారు, ఎవరు కలగన్నారు, ఎవరెందుకు పుడతారో. ఏ పని సాధిస్తారో అంటూ మొదలుపెట్టి అష్టమ గర్భాన పుట్టిన శ్రీకృష్ఠుడు, ఆరో సంతానం గాంధీగారు అంటూ ఆ పాటలో ఒక తాతమ్మ వివరంగా చెబుతుంది.
Ads
ఆమే భానుమతి. గంపెడు పిల్లలను కనాలన్నది ఆమె ఆశ. అలనాటి నటడు ఎన్టీయార్ తీసిన సినిమా తాతమ్మ కలలోని పాట ఇది. ఆమె కోరుకున్నట్టు మనవడిగా ఎన్టీయార్ గంపెడు సంతానానికి కారకుడవుతాడు, కష్టాలపాలవుతాడు. చివరకు మునిమనవడు బాలకృష్ణ ఆమె కల తీరుస్తాడు.
నంది అవార్డుల ప్రదానంలో భాగంగా ఈ సినిమాకు గాను ఉత్తమ కథా రచయితగా ఎన్టీయార్ ఎంపికయ్యారు. అయితే సినిమాకు నంది అవార్డు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఎన్టీయార్ జ్యూరీని నిలదీశారు. అప్పట్లో ఎర్ర త్రికోణం గుర్తుతో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు మాత్రమే అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
అధిక జనాభాతో దేశానికి చేటు అని చెబుతోంది. దానికి వ్యతిరేకం అయినందున ఈ సినిమాను నంది అవార్డుకు పరిగణనలోకి తీసుకోలేదని జ్యూరీ సమాధానం ఇచ్చింది. చివర్లో హరిత విప్లవం దిశగా తీసుకెళ్ళినందున కథకు మాత్రమే అవార్డు ఇచ్చామని వివరించింది.
అవార్డు ఇచ్చే సమయంలో ప్రభుత్వ లక్ష్యాలను సైతం పరిగణనలోకి తీసుకునేవారు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాకు మాటల రచయితగా పని చేసిన డివి నరసరాజు ఒక సందర్భంలో మరో విషయం చెప్పారు.
ఉదయం ఎన్టీయార్‌కు ఈ సినిమా కోసం, మధ్యాహ్నం భానుమతి సొంత పిక్చర్‌కు పనిచేసేవారట. ఎన్టీయార్ కథ అనుకున్న తరవాత భానుమతి సరిగ్గా సరిపోతారని భావించి, ఒప్పించే బాధ్యతను డివి నరసరాజుపై పెట్టారట. వీలు చూసుకుని ఆయన భానుమతి వద్ద ప్రస్తావించారట.
ఈ సినిమాలో తాతయ్య ఎవరని ఆమె అడిగారట. ఎన్టీయార్ తాతయ్య అని నరసరాజు చెప్పారట. ఆయన తాతయ్య వేషం వేస్తే, తాతమ్మ పాత్రకు తనకు అభ్యంతరం లేదని చెప్పారట భానుమతి. అలా సమస్య పరిష్కారమైందట. కథే కాదు, అందుకు తగ్గ పాత్రధారుల ఎంపికలోనూ అప్పట్లో రాజీ పడేవారు కాదనడానికి ఇదో ఉదాహరణ.
ఇంతకీ విషయం ఏమిటంటే, బీహార్‌లో ముదుసలులకు ముచ్చెమటలు పట్టించిన తేజస్వి తన తల్లిదండ్రులు లాలూ, రబ్డీదేవికి తొమ్మిదో సంతానం. బీహార్ ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిద్దరికీ సరైన వారసుడుగా ఎదుగుతున్నాడు. చిన్నతనం, చిన్నపాటి పొరపాట్ల ఫలితంగా కొద్దిలో బస్ మిస్ అయిందనుకోండి.
మున్నా కథ ముగియలేదు. నాలుగో పర్యాయం బీహర్ పగ్గాలు చేపట్టబోతున్న నితీష్ ను స్వగ్రామంలో మున్నాఅంటారట. నితీష్‌కు స్వతహాగా నీతిపరుడిగా పేరుంది. అలాగే వీచే గాలికి అనుకూలంగా పరుగులు పెట్టి సీఎం పదవిని కైవశం చేసుకుంటున్న ఘనతా ఉంది.
2005లో తొలిసారి సీఎం అయినప్పుడు స్వగ్రామంలో ఆయన్ను మున్నా అంటారంటూ ఒక వార్త వచ్చింది. నేను పనిచేస్తున్న పత్రికలో అప్పట్లో జనరల్ విభాగంలో ఉండేవాడిని. వార్తను అనువదించి ఇచ్చాను. బాక్స్‌గా పెట్టుకుందాం అనుకున్నాం.
అర్ధరాత్రి అయ్యేసరికి అన్నివైపుల నుంచి వచ్చే వార్తల ఫలితంగా కొన్ని ఇలాంటివి మిస్ అవుతూ ఉంటాయి. రష్ ఫలితమది. దాంతో ఈ మున్నా వార్త ప్రచురణకు నోచుకోలేదు. అలా ప్రచురణ కాని వార్తలు రాసిన వ్యక్తికి మాత్రమే కలకాలం గుర్తుంటాయి. నా పరిస్థితీ అదే మరి! ….. ( మద్దిపట్ల మణికుమార్ )
Share this Article