.
కులం – నా అభిప్రాయం
నన్ను ఎవరైనా కులం పేరుతో మాత్రమే పిలవాలి అంటే “కుక్క” అని పిలవండి, నేను పలుకుతాను. ఎందుకంటే అసలు మన దేశంలో కులాలు ఎలా ఎర్పడ్డాయి అన్న అంశం మీద ఉన్న 9 సిద్దాంతాలు పూర్తిగా అధ్యయనం చేశాను. వాటిని చదివి నేను 10 వ సిద్దాంతాన్ని రచించాను. నేను 10 వ సిద్దాంతాన్నే పూర్తిగా నమ్ముతాను , దాని సారాంశం ఈ పోస్ట్ చివర్లో ఉంటుంది.
Ads
వాటిని పక్కన పెడితే.., అవును అన్నా, కాదు అన్నా మన దేశంలో డైరక్ట్ గానో, ఇన్ డైరక్ట్ గానో మనం పుట్టిన కులానికి, మన నెట్ వర్క్ & భవిష్యత్తుకి సంబంధం ఉంటుంది. అందుకే నేను అవుట్ రైట్ గా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన కులగణనకి మద్దతు ఇస్తాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాహూల్ గాంధీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ డిక్లరేషన్ అమలు పూర్తిగా లేదా పాక్షికంగా అవ్వకపోయినా ఒక అడుగు అయితే వేసారు, అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ని ఈ విషయంః లో 100% సపోర్ట్ చేస్తాను.
మళ్ళీ అసలు మన దేశంలో కులాలు ఎలా ఎర్పడ్డాయి అన్న దానిపై మెజార్టీ ప్రజలు అనుకునేది మను సిద్దాంతం. కానీ నిజానికి మను సిద్దాంతంలో గౌడ్ అని ఉండదు, వెలమ అని ఉండదు, రెడ్డి అని ఉండదు, కాపు అని ఉండదు, ముదిరాజ్ అని ఉండదు, యాదవ్ అని ఉండదు, కమ్మ అని ఉండదు, మంగళి అని, చాకలి అని, పద్మశాలి అని, కంసలి అని ఇలా ఏమీ ఉండదు.
4 వర్ణాలు మాత్రమే ఉంటాయి. వాటి ప్రకారం పైన పేర్కొన్న కులాలన్నీ శూద్రుల క్రిందకే వస్తాయి. ప్రస్తుతం అసలు సమస్య ఈ శూద్రుల మధ్యే కాబట్టి అందరూ అనుకున్నట్లు ప్రస్తుత కుల సమస్యకి కారణం మను సిద్దాంతం కాదు. అసలు మను సిద్దాంతంలోని వర్ణ వ్యవస్థలో కులం లేదు, అంటరాని కులం అని ప్రత్యేకంగా ఏదీ లేదు.
వేదాలలో ఎక్కడా కులం అనే పదమే లేదు. అసలు “కులం” అన్నది ఆధునిక యుగంలో కూడా భారతీయ పదం కాదు.
భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”. దీని అర్థం – మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి అని. వేదాలలో నాలుగు వర్ణాల గురించి చెప్పారు కానీ కులం అని ఎక్కడా ఉండదు మరియూ నాలుగు వర్ణాల మధ్య ఎక్కువ, తక్కువల గురించి ఎక్కడా ఉండదు.
నాకు తెలిసి బ్రిటీష్ ఇండియాలో జనాభా లెక్కలు చేసింది 1872 లో. ఆనాటి బ్రిటీష్ ఇండియాలో 1871 నుంచి 1872 వరకు ప్రాంతాలు, మతాలు, వర్గాలు వారిగా జనాభా లెక్కించి “జర్నల్ ఆఫ్ స్టాటిస్టికల్ సొసైటీ ఆఫ్ లండన్” లో ప్రచురించారు. అది 6 పేజీలు ఉంటుంది,
హిందువులలో ఫలానా కులం వాళ్ళు ఇంత మంది అని ఎక్కడా ఉండదు. 6 వ పేజీ చివర్లో హిందువులలో ఆచరణాత్మకంగా కులం అనేది తెలియదు అని ఉంటుంది, అంతే కాని కుల ప్రస్తావన ఎక్కడా లేదు, వర్ణ ప్రస్తావన ఎక్కడా లేదు. బ్రిటీష్ వాళ్ళే భారతీయ హిందువులని బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మణులు అని చూశారు తప్పితే ఆనాటి భారత దేశంలో కుల ప్రస్తావన ఎక్కడా లేదు.
ఆధునిక కాలంలో మన దేశంలో కులాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్నదానిపై చాలా మంది అధ్యయనం చేసి ప్రధానంగా 9 సిద్దాంతాలని ప్రవేశపెట్టారు. అవి; మను సిద్దాంతం, వృత్తి సిద్దాంతం, జాతి సిద్దాంతం, జాతి వృత్తి సిద్దాంతం, సంస్కార సిద్దాంతం, భౌగోళిక సిద్దాంతం, మన సిద్దాంతం, రాజకీయ సిద్దాంతం, మరియూ బహుళ కారక సిద్దాంతం.
ఈ ఒక్క సిద్దాంతం మాత్రమే కుల ఆవిర్భావానికి కారణం అని ఎక్కడా లేదు. ఎవరి అవసరాలు, కోరికలు, గుర్తింపులని బట్టి ఒకో సిద్దాంతం లో ఒకో పాయింట్ తీసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. అందుకే నేను ఏ సిద్దాంతాన్ని నమ్మను.
నా సిద్దాంతం (10 వ సిద్దాంతం) – నీవు ప్రస్తుతం సమాజం ప్రకారం ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ ఖండంలో పుట్టినా ఈ ప్రపంచంలోని మనుష్యులు రెండే కులాలకి చెందినవారు
1. ఆర్ధిక స్వేచ్చ ఉన్న వారు
2. ఆర్ధిక స్వేచ్చ లేని వారు
అందుకే, ఏ మనిషి అయినా ఆలోచించాల్సి వస్తే మొదట ఆలోచించాల్సింది “డబ్బు” గురించి, డబ్బు ఎలా సంపాదించాలి అన్న దాని గురించి, ఏ విధంగా సంపాదించాలి అన్న దాని గురించి. ఆ తర్వాత సమయం ఉంటే ఆలోచించాల్సింది ఆరోగ్యం గురించి, ఆ తర్వాత కుటుంబం గురించి, ఈ మూడే.
ఈ మూడు విషయాలు కాకుండా ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నా వాళ్ళని నేను మనుష్యులు క్రింద పరిగణించను. అందుకే నేను అంటాను, “నన్ను కులం పేరుతోనే పిలవాలి అని ఎవరైనా అనుకుంటే, “కుక్క” అని పిలవండి, పలుకుతాను అని”… ప్రస్తుత సమాజం ప్రకారం మీ కులం ఏదైనా నాకు సమస్య లేదు, నేను దాన్ని అసలు పట్టించుకోను.
నా కుల సిద్దాంతం ప్రకారం మనుష్యులు రెండే రకాలు; ఆర్ధిక స్వేచ్చ ఉన్నవారు, ఆర్ధిక స్వేచ్చ లేని వారు. మరియూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఆలోచించాల్సి వస్తే ఆలోచన చేయాల్సింది ఈ మూడు మాత్రమే
1. డబ్బు
2. ఆరోగ్యం
3. కుటుంబం
సమకాలీన వ్యవస్థలో ఉన్న కులం అన్నం పెట్టదు, ఒకవేళ ఎప్పుడైనా అన్నం పెట్టినా దానితో జీవిత కాలం కడుపు నిండదు, కులం వలన సంతోషం ఉండదు. ఒకే కులంలో డబ్బు ఉన్నవారు, డబ్బు లేని వాళ్ళ మధ్య చాలా తేడాలు ఉంటై.
అందుకే నేను అంటాను “ద్విజర్వర్ణ్యం జగన్నాధ సృష్ట్యం డబ్బు అలోచన విభాగశః” – దీని అర్ధం, ఈ ప్రపంచంలో రెండే కులాలు; ఒకటి డబ్బు ఉన్నవారు, రెండు డబ్బు లేని వారు. నీవు దేని గురించి అయినా ఆలోచించాలి అంటే అది డబ్బు గురించే అయి ఉండాలి, ధన సంపాదన గురించి మాత్రమే అయి ఉండాలి, ఇంకా దేని గురించి ఆలోచించకు.
పుట్టుకతో మనుష్యులు అంతా సమానమే. పుట్టుకతో నీ కులం డిసైడ్ అవదు, నీ ఆలోచన మరియూ సంపాదన బట్టి నువ్వే నీ కులాన్ని నిర్ణయిస్తావ్..! …… జగన్నాథ్ గౌడ్ పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article