.
పక్కాగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలుగా… దురుద్దేశాలతో, ఆడవాళ్లను, పిల్లలను కూడా వదలకుండా నీచమైన పోస్టులు… మార్ఫింగ్ ఫోటోలు, ఎడిటెడ్ వీడియోలతో ప్రచారాలు… వీళ్లపై ప్రభుత్వం ఉరుముతుంటే, వేటాడుతుంటే… కేసులు పెడుతుంటే, అరెస్టులు చేస్తుంటే…
దీన్ని ‘‘ప్రశ్నించే గొంతులపై కత్తులు’’ అని చిత్రించడం కరెక్టేనా..? ఇది ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ..! కాకపోతే ఏపీతో పోలిస్తే ఆడవాళ్లు, పిల్లలు, కుటుంబాలను కూడా నీచమైన ప్రచారాల్లోకి తీసుకురావడం తెలంగాణలో తక్కువ…
Ads
సాక్షి కథనాన్ని బట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికి 680 మందికి నోటీసులు ఇచ్చింది… 147 కేసులు పెట్టింది… 49 అరెస్టులు… దమనకాండ, నిర్బంధకాండ ఎట్సెట్రా రాసుకొచ్చింది… కూటమి సర్కారు వైసీపీ యాక్టివిస్టులనే టార్గెట్ చేస్తోంది కాబట్టి సాక్షి తరఫున డిఫెండ్ చేసుకోవడమూ సహజమే, దాని అవసరం అది…
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ కేసులు సబబే అని రాసుకొస్తున్నాయి… కూటమి ప్రభుత్వం యాక్షన్ కాబట్టి..! నిజంగానే వైసీపీ సోషల్ యాక్టివిస్టులు అడ్డూఅదుపూ లేకుండా అలాంటి పోస్టులు పెట్టారు కాబట్టి..! కానీ టీడీపీ యాక్టివిస్టులు ఏమైనా తక్కువా..? జనసేన తక్కువా..? మరి ఆ పోస్టుల మీద ఈ యాక్షన్ లేదెందుకు అనే ప్రశ్న కూడా సబబే…
నిన్న ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు, ఓ టీవీ హెడింగ్ ఫోటో చూశాను… అది జగన్ భార్య భారతిరెడ్డి మీద అత్యంత నీచంగా ఉంది… ఆ టీవీ ఓనర్‌కు ఏకంగా టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చారు కదానేది ఆ పోస్టు ప్రశ్న… దీనికి చంద్రబాబు దగ్గర సమాధానం లేదు… ఉండదు… (ఆ ఫోటో ఇక్కడ పోస్ట్ చేయదలుచుకోలేదు, నీచంగా ఉంది…)
శ్రీరెడ్డి వంటివాళ్లు కాళ్లబేరానికి వచ్చి, క్షమాపణలు కోరుతున్నారు… కేసుల అంకుశం తరుముతుంటే పారిపోతున్నారు… కొందరు అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు… ఒకాయన సాక్షిలో రాస్తాడు, ప్రస్తుత చట్టాల ప్రకారం, సెక్షన్ల ప్రకారం ఈ కేసులు నిలవవు అని… ఐటీచట్టం అసలే వర్తించదు అంటాడు…
పోలీసులు తలుచుకుంటే ఆ చట్టమే కాాదు, ఏదైనా ప్రయోగిస్తారు… కేసులు నిలుస్తాయా లేదానేది కాదు సమస్య… ఫస్ట్ ఇలాంటి పోస్టులు పెట్టాలంటే భయపడాలి అనే భావనతో అంకుశం ప్రయోగించడం… పవన్ కల్యాణ్ కూతురి మీద చిల్లర పోస్టులు పెట్టిన వాళ్ల మీద పోక్సో కేసు కూడా పెట్టొచ్చు… మన చట్టాల్లో సెక్షన్లకు కొదవేముంది..?
ఐతే… ఒక గ్రూపులో సభ్యుడిగా ఉన్నందుకు… ఆ గ్రూపులో ఎవడో ఏదో పోస్టు పెడితే గ్రూపు సభ్యులందరినీ బుక్ చేస్తున్నారని మరో ఆరోపణ వైసీపీ నుంచి వినిపిస్తోంది… అది నిజమే అయితే దారుణమే… కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అలాంటి సోషల్ గ్రూపుల నుంచి బయటపడటం మంచిది… వాళ్లూవాళ్లూ బాగానే ఉంటారు, ఎలాగోలా బయటపడతారు, ఎటొచ్చీ ఆ గ్రూపుల్లో ఉన్నవాళ్లు సఫరవుతారు…
తెలంగాణలోనూ బీఆర్ఎస్ సోషల్ దూకుడు పెరిగేకొద్దీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబులాగే ఉరమడం ఖాయం అనిపిస్తోంది… ఆల్రెడీ కేసులు, అరెస్టులు ప్రారంభమయ్యాయి కొన్ని… ఎప్పుడైతే పార్టీలు తమ కోసం సోషల్ మీడియా వ్యాపారులను నియమించుకుని, ప్రత్యర్థులపై చిల్లర పోస్టులకు ఉసిగొల్పుతున్నాయో… అప్పటి నుంచే ఈ అరాచకం… మస్తు నీతులు చెప్పే ప్రశాంత్ కిషోర్ బాపతు ఐ-ప్యాక్ యాక్టివిటీతో ఇదంతా మొదలైంది…
లక్షల ఫేక్ అకవుంట్లు, నియంత్రణ- పర్యవేక్షణ- పరిశీలన మన్నూమశానం లేనిది జుకర్‌బర్గ్ పైత్యం… మర్యాదస్తుల పోస్టులను కూడా తనకే సమజ్ కాని కమ్యూనిటీ స్టాండర్డ్స్, బ్యాన్ పేరిట సతాయిస్తాడు గానీ, ఆ చిల్లర పోస్టులు మాత్రమే యథేచ్ఛగా నర్తిస్తుంటాయి సోషల్ బజారులో… బరిబాతల..!
మిత్రుడు చేగొండి చంద్రశేఖర్‌కు చెందిన జిందగీ ఇమేజెస్ పేజీలో తను వాకిట్లో ముగ్గు వేస్తున్న ఫోటో పెడితే ఫేస్‌బుక్ రిస్ట్రిక్ట్ చేసి, కమ్యూనిటీ స్టాండర్డ్స్ పేరిట ఉరిమింది… అదీ ఐరనీ, అదీ కంట్రాస్టు, తెలుగులో చెప్పాలటే అదీ వాడి అజ్ఙానం…
అవునూ… రేప్పొద్దున మళ్లీ జగన్ పవర్‌లోకి వస్తే… టీడీపీ కూటమి సోషల్ యాక్టివిస్టులపై ఇదేతరహా వేట ఉంటుందా..? డౌటేముంది..? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో… ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరం కదా… స్పందన, ప్రతిస్పందన… కారం, ప్రతీకారం… వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తూనే ఉన్న ట్రెండ్ కదా…!!
Share this Article