.
ఈ రోజు రిలీజయిన రీ-ప్రింట్లు ఇవి. కొత్త పుస్తకాలే అమ్ముడు పోవటం లేదనుకుంటున్న రోజుల్లో ఇది సంతోషకరమైన ప్రోత్సాహం. ఇందులో ‘లేడీస్ హాస్టల్’ అన్న నవలలో కథానాయకి ఒక సైకాలజిస్ట్. ‘ఆనందోబ్రహ్మ’లో మందాకినీ, ‘ప్రేమ’ లో వేదసంహిత పాత్రల్లా ఈమె నాకు చాలా ఇష్టమైనది.
శోభనం తొలిరాత్రి సగంలో పోలీస్ ఇన్స్పెక్టర్ భర్తని అరెస్ట్ చేసి తీసుకుపోతే అతడిని బయటకు తీసుకురావటానికి ఆమె చేసే ప్రయత్న౦ కథాంశం.
భార్యాభర్తల మధ్య తొలిరాత్రి సంభాషణ ఈ నవలలో 40 పేజీల పైగా సాగట౦ తెలుగు సాహిత్యంలో నాకు తెలిసినంతలో ఒక కొత్త ప్రయోగం. కొందరు సాహిత్య పరిరక్షణ స్త్రీవాదులు ఆ రోజుల్లో నేను ఏమి వ్రాసినా విరుచుకుపడే వారు. ఈ క్రింది వర్ణనకి చాలా గొడవ చేశారు.
Ads
“నా మనస్తత్వం గురించీ ఇంత బాగా వివరించి చెప్పినందుకు ‘నీకేం కావాలి?” అని అడిగాడు.
ఆమె నవ్వి “ఏమిస్తారు?” అంది.
“ఏమిచ్చినా తీసుకుంటావా?”
“ఊఁ” అంది అమాయకంగా.
ఊహించని వేగంతో ఆమె దగ్గరగా చేరి బుగ్గని పంటితో నొక్కి పెట్టాడు. ఎంత గింజుకున్నా నిముషం పాటు వదలక, ఆ తరువాత ‘చాలా’ అన్నాడు. ఆమె చేత్తో చెంప రాసుకుంది. ఆ నొప్పికి కంట జారిన నీటి చుక్క, చెక్కిలి మీద దంతక్షతమై, పెదవి వెలుగులో పరావర్తనమమై, పెదవి వంపుల్లో ఇంద్రధనస్సులా మెరిసి౦ది. ఆ నీటి చార, బుగ్గ ధనస్సు మీద ఎక్కు పెట్టిన మన్మధ బాణంలా మనోహరంగా ఉంది.
అది చాపమై, మెడ క్రింది వరకూ వెళ్ళి౦ది. స్థిరమైన హిమాలయాలు ఒక్క సారిగా ఊగిపోవటంతో బెదిరిన పర్వతరాజ తనయ పార్వతి (సవతి అన్న విషయం కూడా మర్చిపోయి) ‘నన్ను వదిలి, వెళ్లి గంగని వెతుక్కో’మంది! మన్మధుడు భగీరథుడు అయ్యాడు. నాభి గంగోత్రి. పొత్తి కడుపు గంగా సైకతస్థలి. కొంచెం క్రిందికి జారితే –
చేతి మీద ముద్దు- చెరిపేసే సరిహద్దు. చెంప మీద ముద్దు – ముత్యాల దుద్దు. బుగ్గ మీద ముద్దు – లెఖ్ఖకందని పద్దు. పెదవి మీద ముద్దు – మర్యాద సంస్కారాలు రద్దు. మెడ క్రింద ముద్దు ఇక వివరాలు వద్దు.
ఈ నవల కథాంశం ఉద్భవించటానికి దోహదపడింది ఒక సంఘటన. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఒక రాత్రి 8 గంటలకి నేను, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎవరినో కలుసుకోవటానికి ఒక కాలేజీకి వెళ్ళాము. కాలేజీ బిల్డింగ్… దాని పక్కనే కాస్త గ్రౌండ్… దానికి అటుపక్క లేడీస్ హాస్టల్ ఉన్నది.
సరే. సినిమా నటుడు అనగానే జనం వస్తారు కదా. కానీ బాగా చీకటి అవటంతో ఎక్కువ మంది రాలేదు. వాళ్లతో ప్రసాద్ మాట్లాడుతూ ఉండగా నా దృష్టి లేడీస్ హాస్టల్ కాంపౌండ్ వాల్ కి ఆనుకుని ఉన్న కదులుతూన్న తుప్పల మీద పడింది.
హడావుడికి అందులోంచి రెండు మూడు జంటలు బయటికి వచ్చాయి. మరో మూడు, నాలుగు జంటలు తుప్పల వెనుక ఉన్నట్టు చూచాయిగా తెలుస్తోంది. అదంతా సాధారణ వ్యవహారం అన్నట్టు దానిని ఎవరూ పట్టించు కోవటం లేదు.
రెండు రోజుల తరువాత నేను ఆ హాస్టల్ వార్డెన్ ని కలుసుకొని నా కథాంశ౦ చెప్పాను. “కాలేజీ వివరాలు వెల్లడించకుండా వ్రాస్తానంటే అన్నివిధాలా సహకరిస్తాను. ఇక్కడ జరుగుతున్నది నాకే జలదరింపుగా ఉంది. కానీ మేము ఏమీ చేయలేం. ఆ పొదలు కొట్టిచ్చేద్దాం అనుకున్న నన్ను ఈ పదవి నుంచి నన్ను తొలగించే వరకు కొందరు విద్యార్థులు ఊరుకోలేదు. రెండు మూడు రోజుల్లో బాధ్యతలు మరొకరికి అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను” అని చెప్పింది.
అప్పుడు తయారైంది నవల. ఇదీ ఈ నవల ఉద్బవ చరిత్ర. ఈ కాలేజీ సరిగ్గా నగరం నడిబొడ్డున ఉన్నది. 40 సంవత్సరాల క్రితం పరిస్థితి అది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. (ఈ పుస్తకాలపై వచ్చే రాయల్టీ ఖమ్మం ‘అభయం’ ఫౌండేషన్ కు చేరుతుంది. ఇవి కావలసిన వారు 8558899478 శ్రీమతి భావరాజు [అచ్చంగా తెలుగు] పద్మిని గారి ద్వారా పొందవచ్చు)…….. యండమూరి వీరేంద్రనాథ్
.
(యండమూరి సమకాలీనుడు మల్లాది ఆమధ్య నేనిక రాయదలుచుకోలేదు, ఎవరూ కొనడం లేదు, రాసి దండుగ అన్నట్టు గుర్తు… నిజంగానే కొత్త పుస్తకాలకు చదువరులు లేరు… అలాంటిది యండమూరి 12 పుస్తకాలు ఒకేసారి రీప్రింటై మార్కెట్‌లోకి రావడం ఓ విశేషమే…)
Share this Article