.
“నీకీ సంగతి తెలుసా సుబ్రావ్?”
“ఏదీ మీరు చెప్తేనేకదా తెలిసేది మాస్టారు ”
“యూ నాటీ.. నేను సినిమా తీస్తున్నా ”
“యూ సిల్లీ నిజంగా ?”
“ఎస్ కథేంటో తెలుసా ?”
Ads
“యూ రియల్లీ సిల్లీ.. కథలు బెట్టి ఎవరన్నా సినిమాలు తీస్తారా మాస్టారు ?”
“నేను తీస్తానుగా ”
“అయితే కథ ఏంటో చెప్పుకోండి మాస్టారు?”
“అనగనగా ఒక ఊరు
ఆ ఊరిలో ఒక బోరు”
“ఆగాగు ఊరు బోరు అంటున్నారు.. ఆ ఊరి పేరు బోరుగుంట కదూ ”
“ఎగ్జాట్లీ ”
“గూట్లే ఏం కాదూ.. తర్వాత చెప్పండి మాష్టారు”
“బోరుగుంట ఊరవతల సముద్రం పక్కన కొండ వెనకాల ఉంటుంది ”
“ఈజిట్ ”
“ఎస్ .. ఆ ఊళ్ళో అందరికీ పెద్ద మావుళ్ళయ్య..అందరిలో చిన్న పుల్లయ్య ”
“ఎవరు వీళ్లిద్దరూ?”
“తాత మనవళ్ళు”
“ఐ సీ.. నెక్ట్స్ ”
“మావుళ్ళయ్య ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటాడు ”
“ఓహో.. ఫ్రీడం ఫైటర్ అన్నమాట ”
“అలాంటోడే అనుకో”
“అనుకున్నా ”
“ఓ రోజు ఆంగ్లేయులు మావుళ్ళయ్యను వెలేస్తారు ”
“ఊరి నుంచా?”
“కాదు దేశం నుంచి…
ఇప్పుడు ఒక పాట ”
“వాహ్ టైమ్లీ.. తర్వాత ?”
“మావుళ్ళయ్య ఇంగ్లాండ్ చేరతాడు”
“ట్విస్టా?”
“అవును, అదిరిపోలా ?”
“ఎవరికీ?”
“ఇంకెవరికి ప్రేక్షకులకి ”
“వాళ్ల సంగతేమో కానీ నాకే కొద్దిగా ‘ అదిరి ‘ పోయింది ”
“ఇంకా వింటే పూర్తిగా అదిరిపోతుంది.. విను.. అప్పుడు మనవడు పుల్లయ్య.. తాత మావుళ్ళయ్య కోసం అడవులు సముద్రాలు గాలిస్తాడు ”
“పిచ్చి పుల్లయ్య తాత అడవులు.. సముద్రాల్లో ఎందుకుంటాడు ? హాయిగా ఇంగ్లాండ్ లో ఉంటేనూ?”
“ఇక్కడ ఇంకో ట్విస్ట్ ”
“ఏంటదీ?”
“ఇంగ్లాండ్ వెళ్లిన మావుళ్ళయ్య ఎలిజబెత్ రాణిని ప్రేమిస్తాడు ”
“ఎందుకూ?”
“సస్పెన్స్ ”
“ఓహో.. నరాలు మెలికలు తిరగడం అంటే ఇదేనా? సరే మరి పిచ్చి పుల్లయ్య ఏమయ్యాడు ?”
“తాతను బ్రిటీష్ వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారనీ.. ఎలాగైనా తాతను వాళ్ళ చెర నుంచి విడిపించాలని ఇక్కడి బ్రిటీష్ గవర్నర్ కూతుర్ని ప్రేమిస్తాడు..
అదిరిందా..?”
“కొద్దికొద్దిగా అదురుతుంది ఇప్పుడే ”
“ఇప్పుడు ఒక పాట”
“పాట అక్కడ తాత ఎలిజబెత్ రాణి తోనూ.. యిక్కడ మనవడు గవర్నర్ కూతురితోనూ కదా ”
“ఎగ్జాట్లీ.. ఇంతకీ వాళ్ళు ఆ బ్రిటీష్ ఆడోళ్ళని నిజంగా ప్రేమిస్తున్నారు అనుకుంటున్నావా ?”
“కాదా?”
“కాదు.. ఇండియా నుంచి ఆంగ్లేయులను తరిమికొట్టడానికి వేసిన ప్లాన్ అన్నమాట.. అదిసరే
కానీ నువ్వేంటి అలా ఉగిపోతున్నావ్?”
“ఏ పార్టులోనో తెలీట్లేదు కానీ ఎక్కడో అదురుడు ఎక్కువైంది మాష్టారూ.. సరేగాని వీళ్ళిద్దరిలో హీరో ఎవరు?”
“ఇద్దరూ కాదు.. వీళ్లిద్దరూ సైడు క్యారెక్టర్లు..”
“మరి హీరో ?”
“మావుళ్ళయ్య కొడుకు.. పుల్లయ్య కి తండ్రి హీరో”
“ఓహ్ మళ్ళీ ట్విస్ట్..ఇంతకీ హీరో ఎంట్రన్స్ ఏదీ?”
“పార్ట్ 2 లో” ..
అదిరిందా.. హలో.. హలో.. ఏంటీ మాట్లాడట్లేదూ.. అదేంటీ? మనిషి అలా అదిరిపోతున్నాడు.. హలో.. హలో.. సుబ్రావ్ పూర్ ఫెలో పార్ట్ 2 కూడా వింటే ఇంకా అద్దిరిపోయేవాడు ”
అసలు స్టోరీ పార్ట్ 2 లో చూద్దాం!…… పరేష్ తుర్లపాటి
Share this Article