- రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు.
- గుంటూరు నగర పాలక సంస్థలో ‘‘మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’’ అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా? పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా? నిలబడి కొట్లాడవలసిన వాళ్లు లాలూచీ పడుతుంటే ప్రజలు తెలుసుకోలేరా?
- తన తరఫున ప్రజలే పోరాడాలని కోరుకోవడం ఏమిటి? అధికార పార్టీ నుంచి తమకు వేధింపులు ఎదురుకాకుండా నాయకులు రాజీ పడుతుంటే కార్యకర్తలు మాత్రం సర్వం ఒడ్డి పోరాటం చేయాలని కోరడం ఏమి న్యాయం?
- విశాఖపట్నంలో నాయకుల వైఫల్యం, లాలూచీ కారణంగానే నగర పాలక సంస్థ చేజారింది. ఓటేయడానికి విశాఖ వాసులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారిలో భరోసా కల్పించే నాయకుడు ఏడి?
- కీలక సమయాల్లో పార్టీ అధినేత తమకు అండగా ఉంటారన్న నమ్మకం ఆయనపై పార్టీ నాయకులకు లేదనే చెప్పవచ్చు. మరో రకంగా చెప్పుకొంటే తనపై నమ్మకం లేకుండా ఆయనే చేసుకున్నారు.
- ఒకప్పుడు వాహినీ వారి చిత్రాలలో పెద్దమనుషుల రూపంలో విలనిజం చూశాం. ఇప్పుడు భయంకరమైన విలన్ పాత్రలు పోషించేవారికి అదే స్థాయిలో క్రేజ్ ఉంటోంది. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోయాయి. నాయకులు ఆ మేరకు మారకపోతే కనుమరుగవుతారు.
- పార్టీ గురించి ఆలోచించని వారినీ, తనపట్ల కనీసం గౌరవం కూడా లేనివారిని ఇంకెంత కాలం మోస్తారు? పార్టీకి ఇప్పుడు కొత్త రక్తం అవసరం.
- ఆంధ్రప్రదేశ్ ప్రజల సైకాలజీని అర్థం చేసుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు…..
పైన మీరు చదివిన ప్రతి అక్షరమూ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్నదే… స్థూలంగా వ్యాస సారాంశం ఏమైనా గానీ… సగటు పాఠకుడికి మాత్రం దీన్ని చదువుతుంటే ఏమర్థమవుతుంది..? ‘‘చంద్రబాబు మీద ఎవరికీ భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు… ఈయనకేమో కొరడా పట్టుకుని శిక్షించడమూ చేతకాదు… సాఫ్ట్ విలన్ పాత్రధారిలాగా గాకుండా హార్డ్కోర్ విలనీ ప్రదర్శించాలి… లేకపోతే ఇక పార్టీకి కొత్తరక్తం అవసరం… ఏపీ ప్రజల సైకాలజీ కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదు… సో, తక్షణం ఓ ముళ్లకొరడా పట్టుకుని అధికార పార్టీతో లాలూచీ పడ్డ వాళ్లను విరగబాదాల్సిందే… లేకపోతే పార్టీకి మనుగడ ఉండదు’’… ఇదీ సగటు పాఠకుడికి అనిపించేది… అంటే, ఇది కూడా ఒకరకంగా పార్టీ అధినేత మీద భయం లేకపోవడమే, గౌరవం లేకపోవడమే, భక్తి లేకపోవడమే బహుశా…
కానీ నిజానికి చంద్రబాబును మరీ అంత తేలికగా తీసిపారేయాల్సిన అవసరం లేదు… కొత్త విలనీతనం ప్రదర్శించాల్సిన పనీ లేదు… తెలుగుదేశం కేడర్ మీద జగన్ పెట్టిస్తున్న కేసులు అసాధారణమే… కానీ వీలైన ప్రతి దగ్గరకూ చంద్రబాబు లేదా లోకేష్ వెళ్తున్నారు… కేడర్ డిమోరల్ గాకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు… ఇదొక గ్రహణ దశ… రాజకీయ పార్టీ అన్నాక ఉత్థానపతనాలు ఉంటయ్… అవకాశాలు కలిసొచ్చినప్పుడు మళ్లీ లేస్తాయి… ఒకప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండేది… పార్టీని మూసేసుకోవాలని అనుకున్న దశ నుంచి ఇప్పుడు ఎదురులేని స్థానంలోకి రాలేదా..? రెండు సీట్ల నుంచి బీజేపీ స్పష్టమైన సొంత మెజారిటీతో దేశవ్యాప్తంగా విస్తరించలేదా..? ఏమో… ఇప్పటికైతే వైసీపీకి టీడీపీయే ప్రత్యామ్నాయం… వేరే పార్టీ కనిపించడం లేదు… కనిపిస్తే తెలుగుదేశం మిగలదు… చంద్రబాబును మించిన ప్రత్యామ్నాయ నేత కనిపించడం లేదు… కనిపిస్తే చంద్రబాబు కెరీర్ సమాప్తం… కానీ ఇప్పుడా తక్షణ ప్రమాదం ఏమీ లేదు… ఈ వయస్సులో తను మారడు, మారలేడు, తన ఒరిజినల్ తత్వం నుంచి బయటపడలేదు… బయటపడితే ఇక ‘‘మొత్తం బయటపడినట్టే…’’
Ads
చివరగా… ఎలాగూ విలనీతనం గురించిన ప్రస్తావన వచ్చింది కదా… ముత్యాల ముగ్గు అనే ఓ పాత బాపు సినిమా అనుకుంటాను… రావుగోపాలరావు సాఫ్ట్ విలనీయే… చెంపలకు పులిపిర్లు, కోరమీసాలు, జేబులో పిస్టల్, సాక్సులో కత్తులు, వెనుక జేబులో బాంబులు, వెనుక వేటకొడవళ్లతో అనుచరులు, విషపుచూపులు, మాట్లాడితే చాలు కసకసా అనేసే ట్రెండీ విలన్ కేరక్టర్ ఏమీ కాదు… కానీ తన వెంట ఇద్దరు ఉంటారు… ఎవరైనా రావుగోపాలరావు దగ్గరకు వచ్చి ఆహా ఓహో అని భజన మొదలెడితే చాలు, ఆ ఇద్దరూ మద్దెల వాయిస్తుంటారు… అంటే భజనలో పడిపోకు అని ఎప్పటికప్పుడు తనను అలర్ట్ చేసే అలారం సిస్టం అన్నమాట… ఎస్, చంద్రబాబుకు అలాంటి ఒక టీం కావాలి అర్జెంటుగా… ఎందుకంటే, ప్రపంచంలో చంద్రబాబును మోసం చేయగలిగేది కేవలం తనను ప్రచారమాయలో ముంచెత్తి పబ్బం గడుపుకునేవాళ్లే కాబట్టి…!!
Share this Article