.
ఆమె జీవితంలో నిజానికి ఓ సినిమా కథకు కావల్సినంత పెద్దగా ఘర్షణ ఉందా..? వ్యక్తిగత జీవితంలో కొన్ని భంగపాట్లు ఉండవచ్చుగాక… కానీ కెరీర్‌పరంగా ఆమె ఎదుర్కున్న సవాళ్లు, విమర్శలు, అడ్డంకులు చాలా చిన్నవి…
కెరీర్‌లో చాలామంది తారలు ఢక్కామొక్కీలు తిని, నానా మోసాలకు గురై… నమ్ముకుని, అన్నీ అమ్ముకుని ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ల గురించీ చదివాం… ఆ దెబ్బలతోనే ఎదిగిన కథలూ బోలెడు… వాళ్లతో పోలిస్తే నయనతార జీవితం చాలా చాలా నయం…
Ads
ఇంకా నయం… నెట్‌ఫ్లిక్స్ టీం దీన్ని డాక్యుమెంటరీతో సరిపెట్టింది… బయోపిక్ తీయడానికి ముందుకురాలేదు… నిజానికి బయోపిక్ చేసేంత జీవితం కూడా కాదు ఆమెది… చాలావరకూ స్ట్రెయిట్ ఎదుగుదల, అదృష్టం… ఈరోజు హయ్యెస్ట్ పెయిడ్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్‌స్టార్ ఆమె…
ధనుష్‌తో ఘర్షణ కారణంగా, ఏవో పాతపగలు ఉన్నాయనే వార్తల కారణంగా ఈ డాక్యుమెంటరీకి బహుళ ప్రచారం జతచేరింది… అదే గనుక లేకపోతే పెద్దగా ఇంట్రస్టింగ్ డాక్యుమెంటరీ ఏమీ కాదు తనది… కాకపోతే వీలైనంతవరకూ ఆమె జీవితాన్ని మరీ ఓ కథలా చెప్పడానికి ప్రయత్నించినా.,. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీయే…
ఆమె జర్నీతో సంబంధం ఉన్న వాళ్లతో కొన్ని మాటలు చెప్పించడాలు, ఆమె బాల్యం, ఫోటోలు, వీడియోలతో నయనతారను అభిమానించే వాళ్లను మాత్రం ఆకట్టుకునే డాక్యుమెంటరీ ఇది… సినిమా కెరీర్ మీద ఇంట్రస్టు లేకపోయినా ఏదో యాడ్ ద్వారా పలకరించిన అవకాశాలు… మలయాళం నుంచి తమిళంలోకి ఎంట్రీ…
మొదట్లో బాడీ షేమింగ్ కామెంట్స్, అందుకే బిల్లా సినిమాలో బికినీలో దర్శనం, కెరీర్ వీక్ అయిపోయిన సందర్భంలో నాగార్జున చేసిన సాయం, తరువాత శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్ర చేయడంపైనా విమర్శలు గట్రా బాగానే ఉన్నాయి… మీడియా మహిళా నటుల్ని మాత్రమే టార్గెట్ చేయడంపై నయనతార అభిప్రాయాల వరకూ వోకే…
(వ్యాంప్ తరహా పాత్రలు వేసుకునే దానితో సీత పాత్ర వేయిస్తారా అని బోలెడు ట్రోలింగ్ అప్పట్లోనే… కానీ సీత పాత్రలో ఆమె మెప్పించింది… తెలుగు ప్రేక్షకులు ఆదరించారు… ఆమె మీద నెగెటివిటీ చాలావరకు తగ్గింది ఆ పాత్రతో…)
శింబుతో తనకు ఎందుకు బెడిసింది..? ఇకపై తనతో ఏ సినిమాలోనూ నటించబోననే ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది..? ప్రభుదేవాతో ప్రేమబంధం కోసం కెరీర్‌కే ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకున్నా, హిందూ మతం స్వీకరించినా సరే తనతో ఎందుకు చెడింది..? నయనతార కోసం ప్రభుదేవా భార్యకు విడాకులు… ఇవీ ఆమె జీవితంలో ఇంపార్టెంట్ ఘట్టాలు… పిల్లల కోసం సరోగసీనే ఎందుకు ఎంచుకుంది..? (పెళ్లి వీడియోల్ని కూడా నెట్‌ఫ్లిక్స్‌కే అమ్ముకుంది ఆమె…)
ఆమె మీద నెగెటివిటీ పెంచిన అంశాలవి… కానీ ఈ డాక్యుమెంటరీ ఆమె చేదు జ్ఞాపకాల్లోకి పెద్దగా వెళ్లకుండా… విఘ్నేశ్ శివన్‌తో లవ్వు ఎలా మొదలైందో, ఎలా పెరిగిందో, బలపడి పెళ్లి దాకా ఎలా వచ్చిందో చూపటానికి ప్రయారిటీ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్ టీం… గంటన్నర నిడివి… షార్ట్ ఫిలిం కాదు, ఫీచర్ ఫిలిమ్ లెంతూ కాదు…
గ్లాస్ హౌజులోనే పెళ్లి, ఐదారువేల మంది పెళ్లికి పనిచేయడం, ఎరుపురంగు డ్రెస్సే దేనికి వంటి అనాసక్త అంశాలు నిజానికి ఆమె జీవితకథలో పెద్దగా అవసరం లేని అంశాలు… ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్… బెంగుళూరులో పుట్టినా మలయాళీ నేపథ్యం… సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ… మొత్తంగా ఈ డాక్యుమెంటరీ చాలామందికి పెద్దగా రుచించకపోవచ్చు… పెద్దగా లోతుల్లోకి కథ వెళ్లలేదు కాబట్టి..!! చివరకు ధనుష్ 10 కోట్లు అడిగిన ఆ (నానుమ్ రౌడీ దాన్) వీడియో బిట్ కూడా అనాసక్తికరంగా ఉండి, ఈమాత్రం దానికి ధనుష్ ఇంత రాద్ధాంతం చేశాడా అనిపిస్తుంది..!!
Share this Article