.
వయసుకు తగ్గ అమాయకత్వం.. భారాన్ని మోసే ఆరిందాతనం! అందుకే ఆమె పాత్ర ఓ వైబ్రేషన్!!
#PatherPanchali #umadasgupta #SatyajitRay #amazonprime
Ads
Shanthi Ishaan… ✍🏻
దుర్గ! ఆ పేరు వింటేనే తెలియని వైబ్రేషన్స్. నాకీ పాత్ర అంటే ఎంత మక్కువ అంటే దాని స్ఫూర్తితోనే ఓ కథ అల్లుకున్నాను, ఒక నాటకం కూడా రాసుకున్నాను. వయసుకు తగ్గ అమాయకత్వం ఓ వైపు, వయసుకు మించిన భారాన్ని మోసే ఆరిందాతనం మరోవైపు! Pather Panchali కోసం సత్యజిత్ రే తీర్చిదిద్దిన దుర్గ పాత్ర ఇది!
ఈ పాత్రలో జీవించి దాన్ని అజరామరం చేశారు ఉమా దాస్ గుప్తా! ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మినహా పెద్దగా నటించకపోయినా ఆమె దుర్గగా Indian Cinema తెరపైన, భారతీయ సినిమా ప్రేమికుల గుండెల్లోను చిరస్థాయిగా నిలిచిపోయారు.
సోమవారం (నవంబర్ 18) ఆమె తన 84వ ఏట క్యాన్సర్ తో పోరాడుతూ వెళ్ళిపోయారు. సినిమాలో, తొలకరిలో తడిసినందుకు దుర్గ తీవ్ర జ్వరంతో బాధపడుతూ చనిపోతుంది. ఇప్పుడు దుర్గ మరోసారి వెళ్ళిపోయిందంటూ అభిమానులు దుర్గ ఉరఫ్ ఉమాదాస్ గుప్తాకు నివాళులు అర్పిస్తున్నారు!
ఏపుగా పెరిగిన గడ్డి కంకులు. వెండిలా మెరిసిపోతున్న ఆ కంకుల మధ్య చెరకు గడ నములుతూ ఓ అక్క తన తమ్ముణ్ణి వెతుక్కుంటోంది. వాడు కాసేపు ఆట పట్టించి చివరికి అక్క దగ్గరకొస్తాడు. అక్క వాడికీ చెరకు గడ ఇస్తుంది. ఇంతలో దూరం నుంచి రైలు శబ్దం. ఇద్దరూ రైలు పట్టాలకేసి పరిగెడతారు. అక్క పడిపోతుంది.
తమ్ముడు మాత్రం పట్టాల దాకా వెళ్ళి రైలును దగ్గర నుంచి చూస్తాడు. నల్లటి రైలు వెండి కంకుల మీద దట్టమైన పొగ వదులుతూ వెళ్తుంది. “పథేర్ పాంచాలీ” అనగానే నాకు ముందుగా ఈ సీనే గుర్తొస్తుంది. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. ఇక్కడ అక్క దుర్గ, తమ్ముడు అప్పు. దుర్గ రైలు శబ్దాన్ని అపురూపంగా గుండెల్లో పొదువుకునే తీరు చాలా సహజంగా అనిపిస్తుంది.
“పథేర్ పాంచాలీ” అంటే “దారి పాట” అనుకోవచ్చు. Appu Trilogyలో ఇది మొదటి సినిమా. ఆ తర్వాతి రెండు సినిమాలు “అపరాజితో” “అపుర్ సంసార్”. నాకైతే మూడు సినిమాల్లోకెల్లా “పథేర్ పాంచాలీ”నే బాగా నచ్చుతుంది.
“పథేర్ పాంచాలీ”కి దుర్గ క్యారెక్టరే గొప్ప బలం. అమాయకంగా అనిపిస్తూనే గొప్ప పరిణితి కనబరుస్తుందీ పిల్ల. పేదరికం వల్ల సరైన తిండి లేకపోయినా, చిన్న చిన్న ఆశలు చంపుకోవాల్సి వచ్చినా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది.
తమ్ముడితో కలిసి చిన్న పిల్లలాగా ఆడుతుంది, పాడుతుంది. మళ్ళీ తనే ఆరిందాలా తమ్ముణ్ణి స్కూలుకి రెడీ చేసి తీసుకెళ్తుంది. పిల్ల పెళ్ళి, పిల్లాడి చదువు అనేది ఆ రోజుల్లో చాలా మామూలు విషయంలాగా కనిపిస్తుంది.
దుర్గ తర్వాత ఈ సినిమాలో గుర్తుండిపోయే మరో పాత్ర 80 ఏళ్ళ ఇందిర్ ది. ఈవిడ దుర్గకు, అప్పుకు మేనత్త. దుర్గకి, ఈ ముసలావిడకి మధ్య కెమిస్ట్రీ చక్కగా అమరిపోతుంది. ఇద్దరినీ చూస్తే ఎంత ముచ్చటేస్తుందో!
ముసలి మేనత్తకి ఇష్టమని జామకాయలు దొంగతనం చేసి మరీ తెస్తుంది దుర్గ. అమ్మతోను, తోట యాజమానితోను మాటలు పడాల్సి వచ్చినా పెద్దగా పట్టించుకోదు. ఆవిడకి కూడా దుర్గ అంటే అంతే ప్రాణం.
దుర్గ నాన్న పూజారి. కవితలు, నాటకాలు కూడా రాస్తుంటాడు. ఎప్పటికైనా అవి తనకి పేరు తెచ్చిపెడతాయని గట్టిగా నమ్ముతుంటాడు. పూజారిగా చేస్తే వచ్చే చాలీచాలని సంపాదనతోనే నలుగురూ బతికేస్తుంటారు. ముసలావిడ కూడా తమపైనే ఆధారపడుతుండడంతో దుర్గ తల్లి ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుంటుంది.
ఆ కోపం పేదరికం వల్ల వచ్చిందే గానీ సహజసిద్ధమైంది కాదు. భర్త తెచ్చే సంపాదన సరిపోక, పిల్లలకి సరైన తిండి పెట్టుకోలేక, ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటి మాటలు పడలేక పాపం ఆ ఇల్లాలు నలిగిపోతుంటుంది.
ఆ సమస్యల నీడలేవీ దుర్గని, అప్పుని తాకవు. తమదైన లోకంలో ఇద్దరూ హాయిగా తిరిగేస్తుంటారు. కానీ చివరికి పేదరికమే ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. మనకీ తేరుకోవడానికి చాలాసేపే పడుతుంది.
1920ల్లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన పుస్తకాల ఆధారంగా సత్యజిత్ రే ఈ మూడు సినిమాలు తీశారు. 1950ల్లో “పథేర్ పాంచాలీ” మొదలుపెట్టినప్పుడు రే ఇది భారతీయ సినీ చరిత్రనే మలుపు తిప్పుతుందని అస్సలు ఊహించి ఉండరు.
కమర్షియల్ ఫార్ములాకి భిన్నంగా ఉండడం వల్ల ఈ సినిమాకి మొదటి నుంచి సరైన నిర్మాతలే దొరకలేదు. కొంత కాలం డబ్బు పెట్టిన ఒక నిర్మాత వేరే సినిమాల వల్ల నష్టం వచ్చి తప్పుకున్నాడు. దాంతో రే కష్టాలు మొదలయ్యాయి.
భార్య నగలు తాకట్టు పెట్టి, తన గ్రామ్ ఫోన్ రికార్డులు అమ్మేసి, చిన్నా చితకా జాబ్స్ చేసి కొంత సినిమా తీశారు. చివరికి ప్రభుత్వ సాయంతో మూడేళ్ళ తర్వాత సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమాకి స్క్రిప్టంటూ పెద్దగా ఏమీ లేదు. రే గీసుకున్న బొమ్మలు, రాసుకున్న నోట్సే దీనికి స్క్రిప్టు. దుర్గ తండ్రి పాత్ర చేసిన కాను బెనర్జీని మినహాయిస్తే నటీనటులు కూడా పెద్దగా అనుభవమున్నవాళ్ళు కారు. ఒకరిద్దరు నాటకాల్లో పని చేశారు.
ముసలి మేనత్త పాత్రకు చునీబాలా దేవి అనే పెద్దావిడను రే పట్టుబట్టి మరీ ఒప్పించారు. అప్పటికే ఆవిడ కొన్ని సినిమాలు చేసి నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. రే పట్టుదలతో ఈ సినిమాలో నటించింది. పాపం సినిమా రిలీజవ్వక ముందే ఆవిడ జబ్బు చేసి చనిపోయింది.
ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సుబ్రతా మిత్రాకి అంతకుముందు కెమెరా పట్టుకున్న అనుభవమే లేదు. అయినా రే విజన్ ని అద్భుతంగా తెరకెక్కించగలిగారు. ఇక రవిశంకర్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది.
“పథేర్ పాంచాలీ” తీసి 70 ఏళ్ళు కావస్తున్నా ఏదో మన ఊర్లో మన చుట్టుపక్కలే జరుగుతున్నట్లుగా ఉంటుంది ప్రతి సంఘటన. సినిమాలో ఎక్కడా అసహజత్వం కనపడదు. దీన్నే రియలిస్టిక్ నేరేటివ్ స్టైల్ గా చెప్పుకోవచ్చు.
ఇటాలియన్ నియో రియలిజం ప్రభావం ఈ సినిమా నేరేటివ్ పై స్పష్టంగా కనిపిస్తుంది. Vittorio De Sica తీసిన neorealistic సినిమా “Bicycle Thieves” చూశాకే తను సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు రే ఒక సందర్భంలో చెప్పుకున్నారు. ఫ్రెంచ్ డైరెక్టర్ Jean Renoir ప్రభావం కూడా రే పై మెండుగానే ఉంది.
ఇన్ని ఒడిదుడుకులను తట్టుకుని, ఇన్ని రకాల స్ఫూర్తులను కూడగట్టుకుని రూపుదిద్దుకున్న ఈ మాస్టర్ పీస్ సత్యజిత్ రే పడ్డ శ్రమకు తగ్గ ఫలితాన్నిచ్చింది. లెక్కలేనన్ని నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది. ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. అలా ప్రపంచ పటంలో మన సినిమాకి గొప్ప గుర్తింపు మోసుకొచ్చింది…
Share this Article