.
పాటలొద్దు… అడ్డమైన పిచ్చి గెంతులొద్దు… బీభత్సమైన డీజే డప్పు మోతల బీజీఎం వద్దు… గాలిలో రౌడీలు గిరికీలు కొట్టే ఫైట్లు అస్సలు వద్దు… బిల్డప్పులొద్దు… ఎలివేషన్లు వద్దు… ఐటమ్ సాంగ్స్ ఏమాత్రం వద్దు…
ఈ మాట ఎవరైనా తెలుగు నిర్మాతతో అని చూడండి… ఎవరో ఎందుకు..? తెలుగు నయా జేమ్స్ కామెరూన్ నాగవంశీనే అడిగి చూడండి… ఎహె, నోర్మూసుకోవోయ్… కథ ఎవడిక్కావాలి… పైన చెప్పినవన్నీ ఉంటే సినిమా నడుస్తుంది… మీరు చెప్పినవి వద్దంటే తెలుగు ప్రేక్షకుడు ఒక్కడూ రాడు థియేటర్‌కు అంటాడు…
Ads
అలా అలవాటు చేశారు మన ప్రేక్షకులకు… తినగ తినగ వేము అన్నట్టుగా… చేదును తినిపించీ తినిపించీ అదే తీపి అనిపించేలా చేశారు… సినిమా అనేది ఓ బలమైన దృశ్యమాధ్యమం కదరా అని చెప్పామనుకొండి, ఎహె, తెలుగులో ఏడువు అంటారు… అదీ మన నిర్మాతలు, దర్శకుల స్థాయి…
మరి మన సుకుమార్‌లు, మన రాజమౌళిలు మన సినిమాను ప్రపంచ తెర దాకా తీసుకెళ్లారు కదా… వాళ్లు కూడా అంతే… పైన చెప్పినవేమీ లేకుండా సినిమా తీయలేరు… భయం… ఎవరూ చూడరనే జంకు… పిరికితనం… సాహసం, ప్రయోగం చేతకాని భీరువులు…
మలయాళంలో ఒక సినిమా వచ్చింది… కిష్కింధకాండం… భారీ భారీ తారలెవరూ లేరు… భారీ కర్చు లేదు… ముందే చెప్పినట్టు నో సాంగ్స్, నో ఫైట్స్, నో మాస్ మసాలా ఐటమ్ సాంగ్స్, నో ఎలివేషన్స్, నో హీరోయిక్ బిల్డప్స్… సింప్లీ కథ… సస్పెన్స్, సూపర్ టేకింగ్… జనం చూడలేదా మరి..? చూశారు…
జస్ట్ 7 కోట్లతో సినిమా తీసి, ఇదీ మా సరుకు నాణ్యత అని మార్కెట్‌లోకి వచ్చారు… 75 కోట్ల వసూళ్లు… తెలుగు స్టార్ హీరోల దొంగ వసూళ్ల లెక్కలు కావు ఇవి… అంటే జనం ఆదరించినట్టే కదా… ఎస్, సరుకులో దమ్ముండాలి, ఎందుకు చూడరు..? తెలుగు ప్రేక్షకుడు కూడా చూస్తాడు… చూడడు అనేది మన నిర్మాత దర్శకుల భ్రమ… హీరోల దుర్భ్రమ… ఇప్పుడిది డిస్నీ హాట్‌స్టార్‌లోకి వచ్చింది…
ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం..? అనే డైలాగుతో మొదలై చివరకు జీవితం ముందుకు సాగాలంటే నిజమే కాదు, అబద్ధమూ అవసరమే అనిపించి ముగిస్తాడు దర్శకుడు… ఒక ప్రధాన పాత్ర… పేరు అజయ్… భార్య చనిపోతుంది… కొడుకు కనిపించకుండా పోతాడు… రెండో భార్యగా అపర్ణా బాలమురళి వస్తుంది జీవితంలోకి…
అజయ్ తండ్రి ఆర్మీ మాజీ అధికారి… తన తుపాకీ మిస్సింగ్… మతిమరుపు కేరక్టర్… ఆ తుపాకీ ఓ కోతి చేతిలో కనిపిస్తుంది… కష్టమ్మీద పట్టుకుని చూస్తే రెండు బుల్లెట్లు మిస్సింగ్… దీని చుట్టూ కథను తిప్పుతాడు దర్శకుడు… మనల్ని మెల్లిగానైనా సరే కథలోకి ఈడ్చుకుపోతాడు… చివరిదాకా చూడకతప్పని సిట్యుయేషన్‌లోకి నెట్టేస్తాడు మనల్ని…
సస్పెన్స్, థ్రిల్ ఆద్యంతమూ కొనసాగి కథ రక్తికట్టాలంటే… హంగులు కాదు, కథ నడిపే విధానం ముఖ్యం… అది తెలిసిన దర్శకులైతే… ఇదుగో ఇలాగే 7 కోట్లు పెట్టి 70 కోట్లు కొడతారు… అదీ సంగతి..!! అవునూ, కోతి చేతిలో తుపాకీ కనిపిస్తే అదిక కిష్కింధకాండమేనా..?!
Share this Article