నిజమే! అమెరికానే మనల్ను పాలిస్తోంది!
——————-
భాషలో ప్రతి మాటకు అభిదార్థం, లక్ష్యార్థం అని రెండు రకాల అర్థాలుంటాయంటుంది వ్యాకరణం. ఉదాహరణకు- నిప్పులు వేడిగా ఉన్నాయి- అన్న మాటలో “నిప్పులు” అభిదార్థం. దాని అర్థం నేరుగా అలాగే వాడడం. నిప్పులు చెరుగుతున్నాడు- అన్న మాటలో “నిప్పులు” లక్ష్యార్థం. నిజానికి అక్కడ నిప్పులు లేనే లేవు. నిప్పు గుణాన్ని ఇంకో వ్యక్తీకరణకు ఆపాదించడం. ఇంతకంటే లోతుగా వెళ్ళడానికి ఇది వ్యాకరణ పాఠం కాదు. ఒకవేళ వెళ్లినా తెలుగు వ్యాకరణం గురించి బహిరంగంగా మాట్లాడిన నేరం కింద శిక్ష పడే ప్రమాదముంటుంది!
ఉత్తరాఖండ్ ను దేవభూమి అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళకు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కానీ- మన శాస్త్రాలు, పురాణాలన్నిటిలో ఉత్తరాఖండే గాడ్స్ ఓన్ కంట్రీ. ఆ ఉత్తరాఖంఢ్ సకల తీర్థాల సమ్మేళనం. అలాంటి ఉత్తరాఖండ్ కు మొన్ననే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినవాడు తీరథ్ సింగ్. అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకోవడమే సకల అనర్థాలకు మూలమని ఈమధ్య ప్రవచించిన తీరథ్ సింగ్- తాజాగా మరో చారిత్రక సంచలనాన్ని విడమరిచి చెప్పారు.
Ads
“భారతీయులను అమెరికా రెండు వందల ఏళ్లు పరిపాలించింది. అలాంటి అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. కానీ భారత్ మాత్రం మహా వట వృక్షంలా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది” …… ఇలాంటప్పుడే భాషలో అభిదార్థం, లక్ష్యార్థాలు అవసరమవుతాయి. ఆయన ఉద్దేశం బ్రిటీషు వారు భారత్ ను రెండు వందల ఏళ్లు పాలించారని. ది గ్రేట్ బ్రిటన్ కు- అమెరికాకు తేడా తెలియని తీర్థం తీర్థభూమికి ముఖ్య మంత్రిగా ఎలా ఉండగలుగుతారని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు కూడా. జ్ఞానం చర్చకే కానీ- కూడు పెట్టదు. స్థూలంగా ఇంగ్లీషు మాట్లాడేవారు మనల్ను బానిసలుగా చేసుకుని పాలించారు- అన్నది ఆయన అమెరికా మాట లక్ష్యార్థం.
ఒకవేళ- అభిదార్థంగా అమెరికా మనల్ను పాలించింది- అన్న మాటను తీసుకున్నా అందులో “పాలించింది” అన్న క్రియాపదంలో తప్పు తప్ప – విషయంలో తప్పేమీ లేదు. పాలించింది అన్న మాట బదులు “పాలిస్తోంది” అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ టెన్స్ వాడితే సరిపోయేది. మన పిల్లల చదువులు అమెరికా.
మన పిల్లలు స్థిరపడుతున్నది అమెరికా.
ప్రపంచానికి పెద్దన్న అని తనకు తాను అనుకునేది అమెరికా.
మన పిల్లల హెచ్ వన్ బి వీసా కోసం చిలుకూరు బాలాజీ ఆలయంలో నూట పదకొండు ప్రదక్షిణల మన మొక్కు అమెరికా.
మన దిక్కు అమెరికా.
మన గమ్యం అమెరికా.
మన లక్ష్యం అమెరికా.
మన కలలు అమెరికా.
మన కళలు అమెరికా. అలాంటప్పుడు ఒక కొండా కోన ప్రాంతాల ముఖ్యమంత్రి అమెరికా రెండు వందల ఏళ్లు పాలించింది అన్న మాటను ఎగతాళిగా కాకుండా- గుండె లోతుల్లో నుండి ఒక భారతీయుడికి కలిగిన ఆవేదనగా అర్థం చేసుకుంటే తీర్థానికి తీర్థం- ప్రసాదానికి ప్రసాదం వేరు వేరుగా దొరుకుతాయి!……….. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article