Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కర్నాటక కోస్తా తీరయాత్ర… అటు ఆహ్లాదం, ఇటు ఆధ్యాత్మికం…

November 25, 2024 by M S R

.
భారతదేశంలో చూడాల్సిన ప్రముఖ యాత్ర ప్రదేశాల్లో కర్ణాటకలోని కోస్తా తీరం ఒకటి. ఈ యాత్రలో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు మేఘాలను తాకే పడమటి కనుమలు, ఆహ్లాదకరమైన వాతావరణంలోని అరేబియా తీరం వెంబడి బీచులతో పిల్లలు, పెద్దలు యాత్రను ఆస్వాదించవచ్చు.

ఇటీవలే మేము కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న దర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠం, మాల్పే బీచ్ వెళ్లి వచ్చాము. బెంగళూరు నుండి సకలేష్ పూర్ మీదుగా కుక్కే సుబ్రహ్మణ్య వరకు పడమటి కనుమల్లో రైలులో వెళ్లిన అనుభవం గురించి రాస్తే వైరల్ అయ్యింది… (వర్షాకాలంలో ఈ రైలు ప్రయాణం మరింత అనుభూతికరం)

చాలామంది మిత్రులు ఈ టూర్ ఎలా వెళ్ళాలి, ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి, అక్కడి వసతి సౌకర్యాల గురించి అడుగుతున్నారు. ఈ యాత్ర వివరాలు హైదరాబాదు నుండి బయలుదేరే వారి కోణంలో ఉంటాయి.

Ads

హైదరాబాదు నుండి మొదట బెంగళూరు నగరానికి చేరుకోవాలి. బెంగళూరులోని యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్ నుండి కార్వార్ ఎక్స్ ప్రెస్ రైలులో సకలేష్ పూర్ మీదుగా కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్ వరకు రైలులో వెళ్ళవచ్చు. రైలు కాకుండా కారులో వెళ్ళినా కూడా ఇదే రూట్ లో వెళ్ళాల్సి ఉంటుంది.

కుక్కే సుబ్రహ్మణ్య

కుక్కేలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు. కాలసర్ప దోషం, నాగప్రతిష్ట, ఆశ్లేష బలి వంటి విశేష పూజలకి ఈ ఆలయం ప్రసిద్ధి. సమీపంలోని కుమారధార నది వద్ద స్నాన ఘాట్ లు ఉన్నాయి. దర్శనం భక్తుల రద్దీని బట్టి 1-3 గంటల్లో పూర్తవుతుంది.

ప్రత్యేక పూజల కోసం ఆలయ వెబ్సైటులో ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. వసతి కోసం ఆలయ సమీపంలో అనేక హోటళ్ళు ఉన్నాయి. మేము ఆలయం ముందే ఉన్న వ్యాసమందిర అనే హోటల్లో బస చేసాము. ఒకరోజుకి ₹2500. భోజనం ఆలయ అన్నప్రసాద మందిరంలో చేయవచ్చు.

ధర్మస్థల

కుక్కే నుండి 55 కిలోమీటర్ల దూరంలో ధర్మస్థల క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీ మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. ఇక్కడ వసతి కోసం దేవస్థానం వారి సత్రాలు ఉన్నాయి. సత్రాల సౌకర్యాలను బట్టి ₹200 నుండి ₹1000 వరకు చెల్లించి వీటిలో ఒకరోజు బస చేయవచ్చు. మేము సహ్యాద్రి కాటేజ్ లో ఉన్నాము. ధర ₹1000.

దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సత్రాలు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. ధర్మస్థలలో నేత్రావతి నదిలో స్నానం ఆచరించవచ్చు. స్వామీ వారి దర్శన అనంతరం ఆలయ అన్నప్రసాద మందిరంలో భోజనం చేయవచ్చు. ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఆలయం ఎదురుగా ఉన్న వసంతోత్సవం అనే ఉద్యానవనంలో అక్వేరియం, వింటేజ్ కార్ మ్యూజియం, ఏనుగుల శాల, ప్రముఖ జైన గురువులలో ఒకరైన బాహుబలి విగ్రహం, సీతారాముల ఆలయం.

ధర్మస్థల

ఉడుపి/మంగళూరు

ధర్మస్థల నుండి 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి వెళ్ళవచ్చు లేదా 75 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగళూరుకి వెళ్ళవచ్చు. మంగళూరు వెళితే నేత్రావతి సముద్రంలో కలిసే చోటు, ఉల్లాల్ బీచ్, బందర్, కటీల్ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం దర్శించుకోవచ్చు. మేము నేరుగా ఉడిపి చేరుకున్నాం.

ఉడుపిలో 13వ శతాబ్దంలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన మధ్వాచార్యులు శ్రీ కృష్ణ మఠాన్ని స్థాపించారు. హిందూ మతంలో ముఖ్యమైన మూడు సిద్ధాంతాలలో ఒకటైన ద్వైత సిద్ధాంతాన్ని శ్రీ మధ్వాచార్యులు ప్రతిపాదించారు. మొదట ఆలయంలో తూర్పు ముఖంగా ఉన్న శ్రీ కృష్ణుడి మూల విరాట్ విగ్రహం, కృష్ణుడి పరమ భక్తుడైన కనకదాసు చూపిన భక్తికి పశ్చిమ దిశకు మరలి దర్శనం ఇచ్చాడు. నేటికీ భక్తులు ఆ కిటికి గుండానే శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు.

udupi

మాల్పె బీచ్

మేము ఉదయం మాల్పె బీచ్ కి వెళ్ళాం. మాల్పె బీచ్ లో ఒకవైపు నది సముద్రంలో కలిసే చోటు మరోవైపు సముద్రం. ఈ రెండింటినీ వేరు చేస్తూ సుమారు కిలో మీటరు పొడవునా నిర్మించిన సీ వాక్ (sea walk) మీద నడచుకుంటూ వెళ్ళవచ్చు. చేపలు పట్టడానికి అరేబియా సముద్రంలోకి వెళ్లిన ఫిషింగ్ బోట్లు ఈ మార్గంలోనే హార్బర్ లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడి నుండి అరేబియా సముద్రంలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళవచ్చు. ఒక్కొకరికి ₹350 టిక్కెట్.

మాల్పె బీచ్ తక్కువ స్థాయి అలలతో, క్రమంగా తగ్గే లోతుతో ఉండటం వలన సముద్ర స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. పిల్లలు పెద్దలు సముద్రంలో ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కడైనా సముద్రంలోకి దిగరాదు అని హెచ్చరిక బోర్డులు పెట్టడం చూసి అంటారు. ఇక్కడ స్విమ్మింగ్ జోన్ అని బోర్డు పెట్టారు అంటే అర్థం చేసుకోవచ్చు సముద్రంలో దిగడం సురక్షితం అని. అలా అని ఎంతమాత్రం అజాగ్రత్తగా ఉండరాదు.

ఇంకా ఇక్కడ బోటింగ్, పారా సైలింగ్ వంటి అనేక నీటి క్రీడలు ఉన్నాయి. అవి కూడా ప్రయత్నించవచ్చు. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే పరిశుభ్రత. మేము బీచులో ఐస్క్రీం కొనుక్కుంటే వాటి కవర్లు ఐస్క్రీం అమ్మే వ్యక్తి తీసుకుని తన సైకిల్ కి ఉన్న ప్రత్యేక సంచిలో వాటిని పెట్టుకున్నాడు. అంతేకాక బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మాతో అన్నాడు.

మనదేశంలో బీచ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది గోవా. కానీ టూరిస్టుల నుండి అధిక డబ్బులు గుంజడమే లక్ష్యంగా గోవాలో ట్యాక్సీలు ఓలా, ఉబర్ సర్వీసులు నడపకుండా ఏయిర్ పోర్టు నుండే అధిక చార్జీలు వసూలు చేయడం, హోటళ్లలో వసతి ధరలు అధికంగా పెంచేయడం, లోకల్ గా తిరగడానికి వాహనాలు అద్దెకు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు బండి డ్యామేజ్ అయ్యిందని టూరిస్టులతో గొడవ పెట్టుకుని అధిక మొత్తం వసూలు చేయడం, ఇంకా స్థానికులు టూరిస్టులతో ఆరోగెంట్ గా ప్రవర్తిస్తూ ఉండటం వంటి కారణాల వలన గోవా వెళ్ళే టూరిస్టులు తగ్గిపోయారని, గోవాకు వచ్చే విదేశీయులు వియత్నాం, శ్రీలంక వెళ్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అత్యంత చౌకగా, పరిశుభ్రంగా ఉన్న కర్ణాటక కోస్టల్ తీరం మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మాల్పె బీచ్ మాత్రమే కాకుండా కర్ణాటక కోస్టల్ తీరం వెంబడి అనేక బీచులు ఉన్నాయి. అందులో రోడ్డుకు ఒకవైపు నది ఒకవైపు అరేబియా సముద్రం ఉన్న మరవంతే బీచ్ కూడా ఒకటి.

murudeswar

మురుడేశ్వర్

ఉడుపి నుండి 104 కిలో మీటర్ల దూరంలో మురుడేశ్వర్ ఉంది. శివుడు రావణుడికి ఇచ్చిన ఆత్మలింగం ఐదు ముక్కలు అవగా ఒక భాగం ఈ మురుడేశ్వర్ లో పడిందని చెబుతారు. ఇక్కడి ఎత్తైన ఆలయ గోపురం, సముద్రం ఒడ్డున ఉన్న శివుడి విగ్రహం, బీచ్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

గోకర్ణ

మురుడేశ్వర్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో గోకర్ణ క్షేత్రం ఉంది. రావణుడు పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుడి ఆత్మలింగాన్ని పొందగా సంధ్యావందనం కోసం లింగాన్ని కింద పెట్టకుండా పట్టుకోమని గోవుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడికి ఇవ్వగా, వినాయకుడు సంధ్యా వందనం చేస్తున్న రావణున్ని మూడుసార్లు పిలిచి లింగాన్ని భూమిపై పెట్టిన ప్రదేశమే గోకర్ణ. గోకర్ణలో శివలయంతో పాటు చూడవలసిన ప్రదేశాలలో ఓం బీచ్, అఘనాశిని నది సముద్రంలో కలిసే చోటు, అగస్త్య గుహలు, ట్రెక్కింగ్ పాయింట్ వంటి టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి.

గోకర్ణ నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉత్తర కర్ణాటకలో అతిపెద్ద నగరం ఆయిన హుబ్లీ నగరం ఉంది. హుబ్లీ నుండి హైదరాబాదు, బెంగళూరు వెళ్ళడానికి బస్సు, రైలు, విమాన సర్వీసులు ఉన్నాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఐదు రాత్రులు ఆరు రోజుల్లో కర్ణాటక కోస్టల్ యాత్ర పూర్తి చేయవచ్చు.

వర్షాలు తక్కువగా ఉన్న సమయం లేదా అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ యాత్ర చేయడానికి అనువైన కాలం. వేసవికాలంలో మాత్రం వెళ్ళకండి. సముద్రం కారణంగా ఉక్కపోత అధికంగా ఉంటుంది. హైదరాబాదు లాంటి వాతావరణంలో నివసించే వారికి భరించడం కష్టంగా ఉంటుంది….. – నాగరాజు మున్నూరు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions