.
స్కిల్ యూనివర్శిటీ కోసం ఆదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళం వాపస్… రేవంత్ రెడ్డి నిర్ణయం…
ఇదీ వార్త… ఒకరకంగా చిన్న సంచలనం… మేం పోరాడుతున్నాం కాబట్టే రేవంత్ విధి లేక వాపస్ చేస్తున్నాడు అని బీఆర్ఎస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చుగాక… కానీ నేపథ్యం, అసలు కారణం వేరు…
Ads
ఆదానీ ఇచ్చిన ముడుపులకు సంబంధించి అమెరికాలో ఓ కేసు నమోదైంది… దాన్ని బీజేపీ మెడకు చుట్టాలని కాంగ్రెస్ విపరీతంగా ప్రయత్నిస్తోంది… ఈరోజు పార్లమెంటులో గొడవ కూడా అదే… జేపీసీ వేయాలని ఇండి కూటమి డిమాండ్…
నిజానికి ఆదానీ ముడుపులు, ఒప్పందాలు తవ్వితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలూ ఇరుకునపడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి… ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద ఆదానీ ఇష్యూ మీద పోరాడుతుంటే… తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల విరాళం తీసుకుంటే అది ఇబ్బందికరంగా ఉంటుందని, సమర్థించుకోలేమని కాంగ్రెస్ భావన…
అందుకే ఢిల్లీ ఆదేశించింది… రేవంత్ రెడ్డి పాటించాడు… అంతకుమించి పెద్ద కారణమేమీ కనిపించదు… నిజానికి ఆదానీ ఐనా, ఇంకే వ్యాపారి ఐనా వంద కోట్ల విరాళం ప్రకటించాడూ అంటే… ఇంకేదో పెద్ద చేపకు ఎర వేసినట్టే..!
ఐతే ఆదానీ మీద కస్సుమంటున్న కేటీయార్ ఒకసారి ఈ చార్ట్ చూస్తే బెటరేమో… అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉండే మరొకలా మాట్లాడితే పోయేది తన విశ్వసనీయతే… దావోస్‌లో ఆదానీతో కుదిరిన 12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని హరీష్ రావు ప్రశ్నిస్తున్నాడు…
వీటి పూర్తి వివరాల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు గానీ… ఆదానీకైనా అంబానీకైనా మరెవరికైనా ఏ పార్టీ అధికారంలో ఉందనేది అప్రస్తుతం… వాళ్లు వ్యాపారులు… తమ లబ్ధి కోసం ఎవరికైనా ఏమైనా ఇస్తారు, పనులు చక్కబెట్టుకుంటారు… రియాలిటీ అది…
జగన్‌కు 1750 కోట్లు ఇచ్చారనే ఆరోపణలోని నిజానిజాలు విచారణలో తేలతాయి గానీ… మొన్న అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఆదానీ- జగన్ ముడుపుల మీద తీవ్రమైన వ్యాఖ్యలేమీ చేయలేదు… తనకూ ఆదానీ దూరం పెట్టాల్సిన కేరక్టర్ కాదు కాబట్టి…
ఇదే కాదు… ఒక్కసారి మేఘా ఇంజనీరింగ్ కథ చూడండి… ఇదే కేసీయార్ తనను ఓ బహిరంగవేదిక మీద సన్మానించాడు… అధికారం పోగానే తను హఠాత్తుగా ప్రజావ్యతిరేకిగా కనిపిస్తున్నాడు… మళ్లీ అధికారం వస్తే అదే కృష్ణారెడ్డిని ఫస్ట్ హత్తుకునేది బీఆర్ఎస్ ముఖ్యనేతలే…
మేఘాకు జగన్ ఎంతో, చంద్రబాబూ అంతే… కేసీయార్ ఎంతో, రేవంత్ కూడా అంతే… వీళ్లే కాదు… తను దేశవ్యాప్తంగా అనేక రంగాల్లోకి విస్తరించాడు… అన్ని పార్టీలకూ వందలు, వేల కోట్ల విరాళాలను సమర్పించుకున్నాడు… తనకు అన్ని పార్టీలూ కావాలి… నేతలందరూ కావాలి… కాదు వాళ్లకు మేఘా కావాలి… అదీ రియాలిటీ…
ఇదే బీజేపీ ప్రభుత్వం ఆదానీని కాపాడటానికి తప్పకుండా ప్రయత్నిస్తుంది… అందులో డౌటేమీ లేదు… కాకపోతే ఏ మార్గంలో అనేది కాలం చెబుతుంది… వర్తమాన రాజకీయాల్లో ఏ వ్యాపారైనా రాజకీయాలకు కావాలి… వ్యాపారికి రాజకీయ నేతలు కావాలి… సింపుల్ ఈక్వేషన్..!!
Share this Article