.
కైలాస పర్వతం మిస్టరీ.. ఆశ్చర్యపర్చే కారణాలు!
సాక్షాత్తూ భోళాశంకరుడి నివాసంగా హిందువులు కొల్చే పుణ్యధామం. అందుకే ఈ కొండకు కైలాస పర్వతమనే పేరు వచ్చిందనే ఓ బలమైన విశ్వాసం. అటు బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఆరాధించే ఆధ్యాత్మిక క్షేత్రం.
Ads
పైగా ఈ కొండనెక్కడం ఒక్కముక్కలో చెప్పాలంటే అసాధ్యం. నిట్టనిలువుగా, మంచుతో కప్పబడి కఠినమైన సవాళ్లతో దీన్ని అధిరోహించడానికి యత్నించి విఫలమైనవాళ్లే తప్ప.. సఫలీకృతులైనవారెవ్వరూ లేకపోవడంతో.. ఆశ్చర్యమూు, దీనివెనుకున్న మార్మికత చర్చకు తెరలేపాయి. ఎంతటి సవాళ్లెదురైనా సరే ఎక్కి తీరుతామనుకున్నవాళ్ల మంచి మంచి పర్వతారోహకులు ఇక్కడి సవాళ్లకు తోకముడిచారే తప్ప.. సాహసం చేయలేదు. చేసినవాళ్లెవ్వరూ బతికి బట్ట కట్టలేదు.
ఈ పర్వతం పైకి ఎక్కాలన్న ప్రయత్నంలో చాలామంది ప్రాణాలే కోల్పోవడం కూడా.. ఆధ్యాత్మికంగా మౌంట్ కైలాస్ ను ఏకంగా ఆ పర్వతమంత ఎత్తున నిలబెట్టింది. భక్తితో కూడిన భయం ఆవహించింది. అందుకే, ఇప్పటికే హిందూ, బౌద్ధ, జైన, బాన్ విశ్వాసులెవ్వరూ ఈ పర్వతం అధిరోహించాలన్న యోచన కూడా చేయరు. ఏకంగా ఈ పర్వాతారోహణను నిషేధించారు.
దీన్ని విశ్వానికే ఒక కేంద్రకంగా.. సెంటర్ ఆఫ్ యూనివర్స్ గా… పేర్కొంటారు. ఇక బౌద్ధులైతే ఈ విశ్వాన్ని నడిపించే ఓ నావలా ఆరాధిస్తారు. కాస్మిక్ యాక్సిస్ గా ఈ కైలాస పర్వతాన్ని భక్తితో కొల్చే బాన్ మతస్థులైతే.. ఏకంగా ఈ కొండచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్తి లభిస్తుందని భావిస్తారు. దీన్నో పవిత్రమైన తీర్థయాత్రగా చూస్తారు.
ఇక భూమినీ, స్వర్గాన్ని కలిపే ఒక అనుసంధానమైన వారధిలా ఈ కైలాస పర్వతాన్ని పవిత్రంగా ఆరాధించడంతో పాటు.. టిబెటిన్ బౌద్ధులైతే ఏకంగా తమ ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు కైలాస మానస సరోవర పర్వతాన్నే కేంద్ర బిందువుగా భావిస్తారు.
హిందువులైతే తాము నివశిస్తున్న భౌతిక ప్రపంచానికీ, వారు చేరుకోలేని అధిభౌతిక ప్రపంచానికీ మధ్య ఓ అనుసంధానమైన ప్రదేశంగా పవిత్రంగా కొలుస్తారు. అందుకే ఎందరో ఆధ్యాత్మిక వాదులకు, భక్తులకు ఈ కైలాస పర్వత కేంద్రం జ్ఞానోదయాన్ని పంచే పుణ్యక్షేత్రం. అంతకుమించిన అతీత శక్తుల కేంద్రం.
అన్ని పర్వతాల్లా ఈ కైలాస పర్వతంపై మంచు కరగకపోవడం మరో విశేషమంటారు. ఇతిహాసాలు, ఆధ్యాత్మిక పురాణాల్లో చెప్పినట్టే ఇక్కడి మంచుకొండ ఎప్పటికీ కరగదనే భావన ఈ పర్వత ప్రాంతం గురించి ఎరిగినవాళ్లందరూ చెప్పే మాట.
అయితే, కాస్త ఎండాకాలంలో మాత్రం దీని మంచు పైపైన కరిగి.. స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో ఇక్కడి చుట్టుపక్కల నదులను చేస్తుంది. కానీ, మిగిలిన కొండల్లా మంచు కరగడం కనిపించదు. అలా కఠినమైన వేసవి భానుడి తాపానికి సైతం కొండను వెండి తాపడంలా అంటుకునుండే ఆ మంచు ఇక్కడి స్పిర్చువాలిటీకి, పవిత్రతకు తార్కాణంగా పేర్కొంటారు.
పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పినట్టు శివుడి చిరునవ్వును చూడగల్గే పర్వతంగా ఇక్కడికొచ్చే భక్తజనం విశ్వసిస్తారు. ఈ కైలాస పర్వత ప్రదక్షిణంలో కనిపించే మన నీడ మనల్నే మెస్మరైజ్ చేస్తుందంటారు. మొత్తంగా ఈ పర్వత ప్రదక్షిణలో… కైలాస పర్వతపు కొత్త కొత్త విషయాలు, మరింత కొత్త అనుభూతులు జీవితానుభవంలోకొస్తాయని విశ్వసించే భక్తుల సంఖ్య ఆసియా దేశాలన్నింటా కనిపిస్తోంది.
కైలాస పర్వతం ఆసియాలోని నాల్గు ప్రధాన నదులకు మూలాధారం!
సింధునది కైలాస పర్వతం చుట్టూ ఉద్భవించి… వాయువ్యంగా టిబెట్ గుండా ప్రవహించి భారతదేశంలోకి ప్రవేశించి చివరికి పాకిస్థాన్‌ను దాటుతుంది. ఇక సట్లెజ్ నది టిబెట్ గుండా వాయువ్య మార్గంలో ప్రవహిస్తూ హిమచల్ ప్రదేశ్ మీదుగా పంజాబ్ కు చేరుకుని.. ఆ తర్వాత సింధూనది మీదుగా మళ్లీ పాకిస్థాన్ కు చేరుకుంటుంది. ఇక బ్రహ్మపుత్ర నది టిబెట్ లోని యార్లంగ్ స్యాన్పో లో ప్రారంభమై.. తూర్పు వైపుకు ప్రవహిస్తుంది.
భారత్ లోకి ప్రవేశించి అస్సాం మీదుగా చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక గంగానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న కర్నాలి నది.. నేపాల్ ద్వారా దక్షిణంగా ప్రవహించి గంగలో కలుస్తుంది. ఇలా కైలాస పర్వతం నుంచి ఉద్భవించిన ఈ నాల్గు నదులు వివిధ దేశాలు, రాష్ట్రాల జీవన విధానంలో.. వారి నాగరిక సంస్కృతిలో భాగమైంది విడదీయరాని అనుబంధాన్నేర్పర్చుకుంది.
అలాగే, కైలాస పర్వతం చుట్టూ ఉన్న సరస్సులూ చెప్పుకోవాల్సినవి. ప్రపంచంలోనే ఎత్తైన మానస సరోవరం అనే శుద్ధమైన మంచినీటి సరస్సులకు ఈ ప్రాంతం నెలవు. ఈ సరస్సులో గడ్డ కట్టే నీళ్లల్లోనూ స్నానమాచరించడమంటే.. దైవానుగ్రహంగా భావిస్తారు.
అయితే ఇలా దైవీకమైన సరస్సులెలాగైతే ఈ కైలాస పర్వతం వద్ద కనిపిస్తాయో.. అలాగే, అతీంద్రయ దుష్ఠశక్తులు కల్గిన సరస్సులూ ఈ ప్రాంతంలో ఉన్నాయని.. వాటికి దూరంగా ఉంటారు భక్తులు. అలాంటివాటిలో రక్షస్థల్ సరస్సు ఒకటి. దీన్ని అపవిత్రంగా భావిస్తారు. ఈ సరస్సు వద్ద ప్రతికూల శక్తులుంటాయన్న ప్రగాఢమైన విశ్వాసముంటుంది ఈ ప్రాంతం గురించి తెలిసినవారికి. హైందవ పురాణాల్లోనూ రక్షస్థల్ సరస్సును ఓ దెయ్యంలా ప్రతికూలంగా పేర్కొన్నారు. అందుకే, ఈ సరస్సు వైపు ఎవ్వరూ వెళ్లరు.
అయితే, హిమాలయాల్లో ఎక్కడా కనిపించని వాతావరణం కూడా కైలాస పర్వతం దగ్గర అనుభవంలోకొస్తుంది. ఇక్కడ సమయం వేగంగా గడిచిపోతుంది. దీంతో ఇక్కడికొచ్చే యాత్రీకుల జుట్టు రంగులో వెంటనే మార్పు రావడం, గోళ్లు వెనువెంటనే పెరగడం వంటి సింబాలిక్ ఛేంజెస్ కనిపిస్తాయంటారు. ఈ పర్వతం నుంచి వెలువడే చల్లని గాలి కూడా అందుకు కారణమనేవారూ ఉన్నారు.
ఈ పర్వతంపై హిందువులు పవిత్రంగా భావించే ఓంతో పాటు, స్వస్తిక్ గుర్తులు వీక్షక్షులను కనువిందు చేయడంతో.. మౌంట్ కైలాస్ పవిత్రతకు మరించ ప్రాధాన్యతేర్పడింది. అందుకే పర్వతంపైన దైవముందనేదే దీన్ని గురించి ఎరిగినవారి బలమైన విశ్వాసం.
కైలాస పర్వత ప్రాంతంలో భూగర్భ నగరాలు!
కైలాస పర్వత ప్రాంతంలో భూగర్భ నగరాలున్నాయనే వాదనా ఉంది. అవే శంబాలాతో పాటు.. అగర్త కైలాష్ గా చెబుతుంటారు. శంబాలా రాజ్యాన్ని శాంతి, జ్ఞానోదయానికి చిహ్నంగా చెబుతారు. ఇక అగర్త కైలాష్ పూర్తిగా ఆధ్యాత్మిక వెల్లివిరిసిన నగరంగా చెబుతారు. స్థానిక ఇతిహాసాల్లో వాటిని గురించి పేర్కొన్నట్టు తెలిసినవారు చెప్పే మాట.
కైలాస పర్వత ప్రదక్షిణ ఆత్మను శుద్ధిపరుస్తుందని నమ్మే భక్తులెందరో. ఇది జీవితకాల సాఫల్యంగా భావించేవారెందరో. పర్వతం చుట్టూ 52 కిలోమీటర్లు సవ్యదిశలో సాగే ఇక్కడి ట్రెక్కింగ్ చాలా కఠినంగా సవాళ్లతో కూడిందట. విస్మయం చెందే ఎత్తులు, ఆందోళన కల్గించే లోతుల్లో శారీరక ఓర్పు.. ఒకింత సాహయగుణం, ఓర్పు వంటివెన్నో అవసరం.
ఈ ప్రయాణంలో మనిషి తనను తాను తెలుసుకునే ఒక స్థితికి రాగలగుతాడని.. తనను తాను కొత్తగా కనుగొనగలడన్న భావనతో పాటు.. ఇది తమ జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోలేని ఓ ప్రయాణంగా ఈ కైలాస పర్వత కోరా ప్రయాణం అలరిస్తుందట.
ఎన్నో ప్రత్యేకతలకు అలవాలమైన హిమాలయాల్లోని ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి హిందూ ఇతిహాసాల్లో ఎన్నో కథలున్నాయి. పైగా ఈ పర్వతం చుట్టూ నెలకొన్న రహస్యాలు, ఇతిహాసాలు ఈ పర్వతంవైపు మరింత ఆకర్షిస్తూనే ఉన్నాయి. శివుడి కోసమే దైవిక శక్తులన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఒక ఆవాసంగా దీన్ని చెబుతుంటారు. అందుకే ఈ కైలాస పర్వతం ఎప్పుడూ తెలుసుకోవాలన్న ఉత్సుకతను పెంచే ఓ విశేషమైన పర్యాటక ప్రాంతంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది…
మెగా జగదేకవీరుడు అతిలోకసుందరిని చూసిన ప్రాంతమూ ఇదేనా..? యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞసీమ అంటూ ఎన్టీయారుడు మనసు పారేసుకున్న ప్రాంతమూ ఇదేనా..? అదేదో సినిమాలో ఎన్టీరావణుడు పెకిలించి నెత్తిన మోసిన పర్వతమూ అదేనా..? మన సినిమాలకూ కైలాస పర్వతమంటే మహా ఇది..!! …… (రచన :: రమణ కొంటికర్ల)
Share this Article