.
హతుడు తెలీదు .. హత్య మాత్రం జరిగింది .. ఎలా .. చూడాలంటే …
నాడి చూసే వైద్యుడి కన్నా అనుభవజ్నుడైన కాంపౌండర్ మేలన్నది ఒక నానుడి. అలాగే కొత్తగా చేరిన ఎస్సై కన్నా సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ మిన్న. కోర్టుల్లో వాదించే ప్లీడర్ల కన్నా అక్కడే పాతుకుపోయిన గుమస్తా వెయ్యి రెట్లు గొప్పోడు.
ఎందుకంటే వాదోపవాదాలు.. అభ్యంతరాలు.. క్రాస్ ఎక్జామినేషన్లు.. తీర్పులు.. చట్టంలో లొసుగులు.. ఎవిడెన్సులు.. సాక్ష్యాల తారుమారు.. ఇలా అతని అనుభవంలోకి వచ్చేవి ఎన్నో… సరిగ్గా ఇదే సూత్రం మీద ఆధారపడి వచ్చిందో మలయాళ సినిమా.. ఆ సినిమా పేరే గుమస్తాన్ .. అమెజాన్ లో ఉంది.
Ads
దర్శకుడు అమల్ కె. జోబి ఎంత పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడంటే ఒక హత్య జరిగిందని తెలుసు.. హతుడు ఎవరో తెలియదు.. అనుమానాలన్నీ కోర్టు గుమాస్తా మీదే.. అతని ప్రవర్తన విపరీత సందేహాలు రేకెత్తిస్తుంది. పనిమనిషి ఇచ్చిన చిన్న సమాచారంతో.. ఒక దశలో అతని భార్యనే హత మార్చాడని ఊరు ఊరంతా నమ్ముతుంది…
పోలీసులు ఇల్లంతా సోదా చేస్తారు.. ఏమి దొరకదు .. భార్య ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి అందరూ ఎడ్డి మొహాలు ఏసుకుంటారు.. చివరకు పోలీసులు బకరాలు అవుతారు…కానీ పోలీసులు దీన్ని ప్రతిష్టగా తీసుకుంటారు…
ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు సహజంగా ఉండే వైరి వర్గాల వివరాలు.. ఆచూకీలు .. అన్వేషణ కొనసాగిస్తారు. అనుమానితులు కొందరు కనిపించపోయేసరికి వాళ్ళే హతులని నిర్ధారణకు వస్తారు. తీరా వాళ్ళు తిరిగి వచ్చేసరికి కధ మళ్ళీ మొదటికి వస్తుంది.
పోలీసుల్లో లాయర్లు.. ఇలాంటి కోర్టు గుమస్తాల పట్ల ఉండే కక్ష, దుగ్ధ, తృణీకారం ఇందులో కూడా కనిపిస్తాయి. అసలు ప్రారంభ సన్నివేశమే ఒక లాయరు, భార్యను చంపిన ఒక నిందితుణ్ణి హీరో దగ్గరకు తీసుకుని వస్తాడు. ఆ కేసు పూర్వాపరాలు తెలుసుకుని విశ్లేషించి అందులోంచి ఎలా బయటపడాలో చెబుతాడు.
అప్పుడా నిందితుడు అంటాడు.. కేసు నేను ఆయనతోనే వాదించుకుని ఉందును కదా అని.. అప్పుడా లాయరు చెబుతాడు.. ఫలానా క్రిమినల్ లాయరు దగ్గర 30 ఏళ్లు పనిచేసిన గుమాస్తా రా బాబు అని…
అలా క్రిమినల్ లా, భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లపై ఈ గుమస్తా లాయర్లకు సలహాలు ఇస్తుంటాడు. కిరాయి గుండాల మధ్య పంచాయితీలు తీరుస్తుంటాడు… కానీ ఒక బలహీనత.. ఏ మాత్రం శబ్దాన్ని భరించలేడు.. ప్రశాంతత కోరుకుంటాడు..
పల్లెల్లో సహజంగా స్థితిమంతుల మీద ఉండే అక్కసు ఇతని మీద కూడా అందరికీ ఉంటుంది. మళ్ళీ టీచరుగా పనిచేసే భార్య అంటే అందరికీ గౌరవం..
చట్టంలో లొసుగుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు.. పోలీసుల్నిఎలా తప్పుదారి పట్టించవచ్చు.. హతుడు ఎవరు.. ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది .. అనేది మాత్రం చెప్పను.. సినిమా మాత్రం చివరి వరకు చూడకుండా వదల్లేం …
తన ఆహారం కోసం సాలె పురుగు ఎంతగా శ్రమించి గూడు అల్లుకుంటుందో అంతగా ఆలోచించానంటాడు సినిమా చివర్లో.. జైసి జోస్ తన పాత్రలో సెటిల్డ్ నటన కనబరిచాడు.. అలాగే కోర్టుల్లో న్యాయం ఎంత త్వరగా లభిస్తుందో మనకు తెలిసిందే కదా సార్ కొన్నిసార్లు సత్వర న్యాయం మనమే చేయాలంటాడు తాను పని చేసిన సీనియర్ న్యాయవాదితో.. కాకపోతే తెలుగు అనువాదం లేదు. చిత్రీకరణ, నేపధ్య సంగీతం బాగా కుదిరాయి… ( హరగోపాలరాజు వునికిలి )
Share this Article