.
నేను తెలుగమ్మాయిని. ఉత్తరాది వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు నలుగురు ఆడపిల్లలు.
ఉత్తరాది అయినా, దక్షిణాది అయినా ఆడపిల్లల మీద వివక్ష ఉంటుంది. ఒక అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న వారు “ఎవరు పుట్టినా ఫర్లేదు” అంటారు. కానీ చాలామందికి అబ్బాయే పుట్టాలని ఉంటుంది.
Ads
బయటికి చెప్పరు. చెప్తే వాళ్ల మీద వివక్ష ముద్ర వేస్తారని భయం. ఎవరు పుట్టినా ఫర్లేదు అనే వారిలో 90 శాతం మందికి అబ్బాయి పుట్టాలనే ఉంటుంది. ఇది నిజం!
నాకు మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పుడు మా అత్తగారు ఫీలయ్యారు. “మా పరంపర కొనసాగేందుకు నీకో మగబిడ్డ కావాలి కదా?” అన్నారు. అసలా పరంపర, వారసత్వం అంటే ఏమిటో? అది కొనసాగాలంటే మగపిల్లలే ఎందుకు కావాలో ఎవరికైనా తెలుసా? మగపిల్లలకు మాత్రమే తల్లిదండ్రుల జీన్స్ వస్తాయా? ఆడపిల్లలకు రావా?
మా ఆయన ఇంట్లో వాళ్ల కోసం ఒక మగబిడ్డ కావాలని నాలుగుసార్లు సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని పిల్లల్ని కన్నాను. కానీ అబ్బాయి పుట్టలేదు. అది నా తప్పా? మగబిడ్డను కనలేకపోవడం తల్లుల తప్పా?
ఇవాళ్టికీ మా ఇంట్లో ఏదైనా పూజ జరిగితే మా ఆయన పక్కన వాళ్ల అన్నయ్య కొడుకు కూర్చుంటాడు. మా అమ్మాయిలు దూరంగా నిలబడి చూస్తుంటారు. ఆడపిల్లలూ మరీ పూజలకూ పనికిరానివారా? ఇదేం పరిస్థితి?
2021 వచ్చింది. టెక్నాలజీ పెరిగింది, రాకెట్ సైన్స్ తెలిసింది అని గొప్పలు పోతున్నాం. కానీ ఆడపిల్లల మీద ఇంకా వివక్ష ఎందుకుందో? మగపిల్లలు లేని భార్యాభర్తల్ని పట్టుకొని “అయ్యో! మీకు అబ్బాయిలు లేరా?” అని జాలిగా ఎందుకు అడుగుతారో ఎవరైనా కనిపెట్టారా?
(ఒక తమిళ ఇంటర్వ్యూలో నటి ముచ్చెర్ల అరుణ గారు చెప్పిన మాటలు… సాయి వంశీ… విశీ… 2 డిసెంబరు 2021)
Share this Article