.
గోల్ ఏం లేదు. బతకడానికి ఎక్కడవకాశం దొరికితే అక్కడ పని చేస్తూ వచ్చాడు. కానీ, చివరకు నటనలో మాత్రం విభిన్నమైన శైలిని కనబర్చాడు. కొన్ని పాత్రలు అనుకున్న స్థాయిలో కుదరాలంటే.. వాటిని తాను మాత్రమే చేయగలనని నిరూపించాడు.
అలా ఒక వెయిటర్ నుంచి.. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గా.. అక్కడి నుంచి బాలీవుడ్ వైవిధ్య నటుడిగా ఎదిగిన బొమన్ ఇరానీ పుట్టినరోజు నిన్న… అందుకే, అతగాడి గురించి ఓ నాల్గు మాటలైనా చెప్పుకోవాల్సిన రోజు…
సినిమా నటీనటులుగా ప్రయత్నించేవాళ్లెందరో యుక్తవయస్సు నుంచి చిన్నాచితకా పాత్రలతో ఎన్నో ఏళ్లు గడిస్తేనేగానీ ఒక దశకు చేరుకోలేరు. కానీ, దాదాపు నడి వయస్సులో… అంటే 44 ఏళ్లకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఈడియట్స్ వంటి సినిమాల్లో నటనతో తనెందుకు భిన్నమైన నటుడో తెలియజెప్పాడు. వీరూ సహస్ర బుద్ధి పేరుతో… 3 ఈడియట్స్ షార్ట్ గా వైరస్ అని పిల్చుకున్న బొమన్ ఇరానీ నటనను చూసి ఆహా అనకుండా ఉండేవారెందరు..?
Ads
నటనలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. ఏనాడూ తన కమిట్ మెంట్ నుంచీ, తన వృత్తిపైనున్న ఫోకస్ నుంచి మాత్రం పక్కకు తప్పుకోలేదు.
తండ్రి చనిపోయిన ఆర్నెల్ల తర్వాత పుట్టాడు. మగ పురుగు కనిపించని ఇంట్లో ఆడవాళ్ల మధ్యే ఒంటరి పురుషుడన్నట్టు పెరిగాడు. చిన్ననాటే చదవడం, మాట్లాడ్డం, రాయడం సరిగ్గా రాని డైస్లెక్సియా బారినపడ్డాడు. అలా ముభావమైన పిల్లాడిగానే పెరిగాడు.
జస్ట్ లైక్ 3 ఈడియట్స్ సినిమాలో వైరస్ తరహాలోనే చిన్ననాట మాట్లాడితే అంతా ఆట పట్టించేవారట బొమన్ ని. ఒకింత ఆతృత, అత్యుత్సాహంతో మాట్లాడటంతో తప్పులు దొర్లి.. చాలా అరుదుగా మాట్లాడటం చేసేవాడు బొమన్. తాను 7వ తరగతికొచ్చే 12 ఏళ్ల వయస్సు వరకూ తానెక్కువ మాట్లాడకపోయేవాణ్నంటాడు.
ఓరోజు తన ప్రవర్తనతో మిషనరీ స్కూల్ ఫాదర్ బొమన్ ని అనర్హుడిగా ప్రకటించి ఇంటికి పంపించేశాడు. కానీ, ఆ ఫాదర్ కు ఏమనిపించిందో ఏమో… మళ్లీ ఆయనే వారం తర్వాత పిలిపించి తిరిగి అడ్మిషన్ ఇవ్వడంతో పాటు, బొమన్ లోని ది బెస్ట్ ఏంటో దాన్ని బయటకు తీస్తామని తన తల్లికి హామీ ఇచ్చి పంపించేశాడట.
ఎలాగోలా కష్టపడి ఎస్సెస్సీ పూర్తి చేసిన బొమన్.. ఆ తర్వాత కాలేజ్ చదువులకు పూణేలోని వాడియా కళాశాల వైపు అడుగులేశాడు. కానీ, తాను ఇంజనీరో, డాక్టరో కావాలన్న కలలేనాడూ కనలేదు. ఎందుకంటే, తన సత్తా ఏంటో తానెంత మాత్రం చదువగలడో తనకు తెలుసు. అలా ఆర్ట్స్ వైపు మనసు తిప్పుకున్న బొమన్ కు తాను వెయిటరైతే బెటరేమో అనిపించింది. అలా హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో శిక్షణ పొంది.. అమ్మమ్మా నేను వెయిటర్ కావాలనుకుంటున్నాని చెప్పాడు.
ఇంకేం కట్ చేస్తే ముంబై తాజ్ హోటల్ కు ఇంటర్వ్యూకు వెళ్లాడు. బాస్ బొమన్ అర్హతల గురించి అడిగి తెలుసుకున్నాడు. హోటల్ లో ఏం చేయాలనుకుంటున్నావనడిగాడు. దానికి సమాధానంగా కస్టమర్స్ కు ఫుడ్ అండ్ డ్రింక్స్ డెలివరీ అని చెప్పాడు. అసలు హోటల్ ఉందే అందుకు కదా.. అంతకుముందు నువ్వెక్కడ చేసేవాడివనడిగాడు.. దానికి తాను అంతకుముందు పనిచేసిన ఓ హోటల్ పేరు చెప్పాడు.
దానికి ఓహో.. ఒకేసారి పైకెదగాలనుకుంటున్నావా ఫూల్.. నువ్వు ముందు కింది నుంచి ప్రారంభించంటూ.. హోటల్ రూమ్స్ సర్వీస్ మ్యాన్ గా ఉద్యోగమిచ్చాడు. అలా అక్కడ రెండేళ్లు పనిచేశాడు బొమన్. అక్కడి ఉద్యోగంలో కష్టపడి సంపాదించిన డబ్బును పైసా పైసా కూడబెట్టి బ్యాంకులో వేసుకున్నాడు.
ముంబైలోని రెస్టారెంట్స్ లో పనిచేశాక.. చిన్నగా తన కుటుంబీకులతోనే కలిసి గుజరాతీ ఫలహారాలమ్మే ఓ స్వగృహ ఫుడ్స్ వంటి సెంటర్ ను ప్రారంభించాడు. 25 ఏళ్లకు పెళ్లైంది. 26 ఏళ్లకు తండ్రయ్యాడు. పెళ్లై ఏడేళ్లు గడిచిపోతోంది. లైఫ్ దానికదే సాగిపోతోంది. ఎందుకో ఒకింత గిల్టీగా ఫీలైపోయిన బొమన్.. తన దగ్గర ఉన్న సేవింగ్స్ తో ఓ ప్రొఫెషనల్ స్టిల్ ఫోటో కెమెరా కొనుగోలు చేశాడు.
మెల్లిగా స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ చేయడం మొదలెట్టాడు. అలా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడే యువకుల ఫోటోలను తీస్తూ వాళ్ల తల్లిదండ్రులకు ఒక్కో ఫోటోను 25 రూపాయలకొకటి చొప్పున అమ్మేవాడు. అలా కొంత డబ్బు సంపాదించుకోగల్గాడు. మెల్లిగా అప్పటివరకూ తనకున్న కొన్ని అప్పులనూ తీర్చేశాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దేవర్ ను ఓ స్టూడియోలో కలిసిన సందర్భంలో వారు లంచ్ కు బయటకు కలిసి వెళ్లే ఓ సందర్భం వచ్చింది. అక్కడ ఆలిక్ పదమ్సీని కలిశాక.. ఆయన ఓ పాత్రలో నటించమని బొమన్ కు ఆఫర్ ఇచ్చాడు. ఆ థియేటర్ షో ఫ్లాప్ అయినప్పటికీ.. ఇరానీకిచ్చింది జస్ట్ రెండున్నర నిమిషాల పాత్రే అయినప్పటికీ.. తన పాత్ర మాత్రం హిట్ టాక్ కొట్టేసింది.
దాంతో మరో నాటకంలో ఐ యామ్ నాట్ బాజీరావ్ అనే పాత్ర దొరికింది. 75 ఏళ్ల ఆ పాత్రను 150 మంది ఆడిటోరియంలో ప్రదర్శిస్తే.. బొమన్ కు 200 రూపాయలు పారితోషికమిచ్చారు.
ఆ తర్వాత ఓ సినిమా ఆఫర్ వచ్చినా బొమన్ కు అదీ కుదరకుండా పోయింది. కానీ అప్పటికే థియేటర్ ఆర్టిస్ట్ గా విధూ వినోద్ చోప్రా కళ్లల్లో పడ్డ బొమన్ దశ ఇక అక్కడి నుంచీ మారిపోయింది. ఓరోజు డిన్నర్ కు తన వెంట బొమన్ ను తీసుకెళ్లి.. ఆ తర్వాత రెండు లక్షల రూపాయల చెక్ చేతికిచ్చాడు. ఇంతెందుకు సార్ నాకు అంటే.. నెక్స్ట్ ఓ సినిమాలో మీరు నటించబోతున్నారని బదులిచ్చాడట విధూ వినోద్ చోప్రా.
అదే ఆ తర్వాత భాషలకతీతంగా ప్యాన్ ఇండియా సినిమాగా హిట్టై.. ప్రాంతీయ భాషల్లోకీ రీమేక్స్ అయి సంచలనం సృష్టించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఇంతకీ ఆ సినిమాలో తన పాత్రేంటని అడిగితే డీన్ అని చెప్పగానే.. ఏం చేయాల్సి ఉంటుందన్నాడట బొమన్..? ఏం లేదు జస్ట్ నవ్వుకుంటూ ఉండటమే ఆ పాత్ర అని బదులిచ్చాడట విధూ వినోద్ చోప్రా.
సినిమా సూపర్ హిట్. తనకు సహాయ నటుడి అవార్డ్ దక్కింది. ఆ స్టేజ్ పై ధరించేందుకు ఓ సూట్ కావాలి. అప్పుడు వచ్చాడు అర్షద్ వార్సీ. తన రెగ్యులర్ టైలర్ కు చెప్పి బొమన్ కు ఓ సూట్ కుట్టించాడు. ఆ బ్లాక్ సూట్ వేసుకున్న బొమన్… ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ గోస్ టూ బొమన్ అనేసరికి ఆ స్టేజ్ పైకొచ్చే క్రమంలో తట్టుకుని కింద పడిపోయాడు.
చేతికి గాయం కూడా అయింది. తన జీవితంలో మురికిలాగే.. తన సూట్ కూ మురికి అంటుకుంది. అయినా, ప్రేమ్ చోప్రా చేతులమీదుగా ఆ అవార్డ్ అందుకున్న మధుర క్షణాలు.. మర్చిపోలేనివంటాడు బొమన్.
ఇక ఆ తర్వాత బొమన్ వెనక్కి తిరిగి చూడలేదు. ఒక త్రీ ఈడియట్స్ చాలు తన కెరీర్ మొత్తంలో ది బెస్ట్ అని చెప్పడానికి. మై హూ నా, లగే రహో మున్నాభాయ్, దోస్తానా వంటి అనేక సినిమాల్లో బొమన్ కోసమే ప్రత్యేక పాత్రల చిత్రణ తయారైంది. వయస్సొక ఒక సంఖ్య మాత్రమేనని.. తన వైవిధ్యమైన పాత్రలతో నిరూపించాడు..
మీరు ఇష్టపడేదాన్ని చేయాలనుకుంటే ఎప్పుడైనా ముందడుగు వేయొచ్చని చాటాడు. తనంత కమిట్మెంట్ తో చేస్తే… నిల్చిపోవచ్చనీ తన నటనతో ప్రకటించేశాడు. ఇప్పుడు తను జీవితం ప్రారంభించిన స్టార్ హోటల్ రూమ్స్ లోనే పేరు మోసిన నటుడి హోదాలో ఆతిథ్యం స్వీకరిస్తున్నాడు… ( రమణ కొంటికర్ల )
Share this Article