.
Vijayakumar Koduri …… కొంచెం మోదం – కొంచెం ఖేదం ……. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ – వెబ్ సీరీస్
**********
కొంత కాలం క్రితం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ‘క్రౌన్’ వెబ్ సీరీస్ (బ్రిటీష్ రాజరిక వ్యవస్థ చరిత్ర ఆధారంగా తీసిన వెబ్ సీరీస్) చూసినపుడు, మనదేశంలో కూడా ఇట్లా తీయదగిన అనేక చరిత్రలు వున్నాయి కదా అనిపించింది.
Ads
ఇటీవల ‘సోని లివ్’ లో ప్రసారమవుతున్న ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ వెబ్ సీరీస్ (సీజన్ 1 – 7 ఎపిసోడ్స్) చూసిన తరువాత ఉన్నతస్థాయి సాంకేతిక విలువలతో మనవాళ్ళు కూడా చరిత్ర ఆధారిత వెబ్ సీరీస్ లు తీయగలరు అన్న నమ్మకం ఏర్పడింది
* * * * *
1947 లో భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన వేళ దేశ ప్రజల గుండెలలో స్వాతంత్య్రం సిద్ధించిందన్న సంతోషం ఒకవైపు ఉంటే, దేశం విడిపోయిందన్న బాధ మరొకవైపు ఉండేది అని చరిత్రకారులు అంటారు
సోని లివ్ లో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సీరీస్ డొమినిక్ లాపిరే & లారీ కొలిన్స్ 1975 లో రచించిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ పుస్తకం ఆధారంగా చిత్రించబడింది. డొమినిక్ లాపిరే ఫ్రెంచి రచయిత అయితే, లారీ కొలిన్స్ అమెరికా రచయిత
భారత దేశ స్వాతంత్రానికి దాదాపు ఒక ఏడాది ముందు మొదలై, మహాత్మా గాంధీ మరణంతో ముగిసే చారిత్రిక సంఘటనల ఆధారంగా రచించిన ఈ పుస్తకం ఎంతటి ప్రశంసలను అందుకున్నదో, అంతటి విమర్శలను కూడా మూటగట్టుకున్నది. పుస్తకంలో ఆనాటి జాతీయనాయకులను చిత్రించిన తీరు పట్లా, ఆనాటి కొన్ని సంఘటనలను చూసిన దృష్టికోణం పట్లా అనేక విమర్శలు వెలువడ్డాయి. కానీ, అదే సమయంలో ఆ పుస్తకం చరిత్రలో చోటు చేసుకున్న సంఘటనలను సాధికారికంగా రికార్డు చేసిన తీరును మాత్రం ఎవరూ పెద్దగా తప్పు పట్టలేదు
డొమినిక్ లాపిరే & లారీ కొలిన్స్ ఇద్దరూ అప్పటికే వారి మొదటి పుస్తకం ‘ఓ జెరూసలేం’ ద్వారా సుప్రసిద్ధులు. ఒకవిధంగా చెప్పాలంటే, వాళ్లకు ఆ పుస్తకం వలన లభించిన పెద్ద పేరు, గౌరవం, ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ పుస్తక రచనకు సంబంధించిన రీసెర్చ్ చేయడానికి చాలా ఉపకరించింది.
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతొ నిఖిల్ అద్వానీ తీసిన ఈ వెబ్ సీరీస్ చూసిన తరువాత, ఆ పుస్తకంలోని చారిత్రిక సంఘటనలు, ఇతర వివరాలు స్వీకరించి, తనదైన దృష్టికోణంతో ఈ వెబ్ సీరీస్ తీసాడు అనిపించింది. అందుకే కొంత సంతృప్తి – కొంత అసంతృప్తి !
ఉదాహరణకు, 1920 నాగపూర్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జిన్నా కాంగ్రెస్ నుండి పక్కకు తొలగడం, గాంధీ కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడుగా ఎదగడం వంటి సన్నివేశాలలో కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ, మొత్తం వెబ్ సీరీస్ చూసినపుడు, చరిత్ర పట్ల పూర్తి అవగాహన లేని వాళ్లకు కేవలం జిన్నా అత్యాశ వల్లనే ఈ విభజన సమస్య ఉత్పన్నం అయింది అనిపిస్తుంది. అంతేకాదు, దాడులన్నీ అతడు ప్రేరేపించడం వల్లనే జరిగాయి అన్నట్టుగా ఉంటుంది.
మతపరమైన దాడుల చిత్రీకరణను తెలుపు నలుపులో చిత్రీకరించి, దాడులకు రంగులు అద్దే పనికి పూనుకోనట్టు అనిపించినా, ముఖ్యంగా పంజాబ్ దాడుల చిత్రీకరణలో దర్శకుడు నిఖిల్ అద్వానీ కొంత స్వేచ్ఛ తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి బెంగాల్ మరియు పంజాబ్ దాడుల నేపథ్యం ఏమిటో పుస్తకం రికార్డు చేసింది
పాశ్చాత్య దేశాలతో పోల్చినపుడు మనకు చరిత్రను చరిత్రగా చూసే అలవాటు లేదు. బహుశా, అందుకే మనకు చరిత్రకు ఇతిహాసానికి / పురాణానికి నడుమ గీతాలు చెరిగిపోయి, చివరికి స్వాతంత్య్ర పోరాట చరిత్రకు సంబంధించిన సంఘటనలను కూడా పురాణ గాథలలా చదవడానికి / చూడడానికి ఇష్టపడుతున్నామా అనిపిస్తుంది.
ఇప్పుడు దేశంలో విస్తరించి వున్న రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ వాతావరణానికి భంగం కలిగించే వివాదాల జోలికి పోకుండా ఈ సీరీస్ తీసినట్టు అనిపిస్తుంది.
ఒకవైపు గాంధీ తన ఆదర్శాలను మొండిగా పట్టుకుని వున్నపుడు, మరొకవైపు నెహ్రు ఆదర్శాలు – ఆచరణ ల నడుమ ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతూ వున్నపుడు, ఇంకొకవైపు జిన్నా తన దేశవిభజన వాదం పైన మొండిగా వున్నపుడు, ధైర్యంగా కార్యాచరణలోకి దిగి దేశాన్ని అధికారిక స్వాతంత్ర దినం వైపు నడిపించింది సర్దార్ పటేల్ అని దర్శకుడు అనేక సన్నివేశాలలో ఎస్టాబ్లిష్ చేయడం చూస్తే దర్శకుడు వర్తమాన రాజకీయ వాతావరణాన్ని ఒకింత సంతోషపెట్టే ప్రయత్నం కూడా చేశాడా అనిపిస్తుంది.
ఈ పరిశీలనలు పక్కన పెడితే, సీరీస్ లోని చివరి రెండు ఎపిసోడ్స్ నిజంగా అద్భుతం! అట్లా అని, మొదటి 5 ఎపిసోడ్స్ బాగాలేవని కాదు. చరిత్రను చూపెట్టే క్రమంలో దర్శకుడు ఎంచుకున్న VANTAGE POINT ని పక్కనపెట్టి, అంతపెద్ద పుస్తకాన్ని తెరమీదకు తీసుకువచ్చిన విధానం, సహజంగా సాగిపోయే సన్నివేశాలు అన్న ఫీల్ ని ప్రేక్షకులకు ఇవ్వడం కోసం పద్ధతిగా రాసుకున్న స్క్రీన్ ప్లే, ప్రతి ఎపిసోడ్ కి ఒక నేపథ్య సంఘటన వంటి దానిని పాత చరిత్రలోంచి తీసుకుని దానిని ఆయా ఎపిసోడ్స్ కి ప్రోలాగ్ లాగా ఉపయోగించుకున్న తీరు, నేపథ్య సంగీతం, కెమెరా పనితనం అన్నీ మనల్ని సీరీస్ మొత్తం చూసేలా చేస్తాయి.
సాధారణంగా ఒక ఉద్యమం జరిగే కాలంలో (అది దేశం కోసం అయినా, రాష్ట్రం కోసం అయినా లేక హక్కుల సాధన కోసం అయినా) దాదాపు అన్ని సంఘటనలూ బహిరంగంగానే ఉంటాయి. ఆ ఉద్యమం విజయం సాధించిన తరువాత (సంపూర్ణంగానో / పాక్షికంగానో) ఆ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టవలసిన తదుపరి కార్యాచరణకు సంబంధించిన ‘రాతకోతల పని’ అధికారుల /నాయకుల సమావేశాలు జరిగే నాలుగు గోడల హాలులోకి మారుతుంది. అక్కడ ఎవరు ఏమని వుంటారు? ఎవరెవరు ఏయే భావోద్వేగాలతో ప్రవర్తించి వుంటారు? అన్న సంగతులు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ ప్రొసీడింగ్స్ (ప్రొసీడింగ్స్ అన్న మాటకు తెలుగులో ‘సమాన అర్థం’ ఇచ్చే మాట ఏమిటి?) అన్నింటినీ చిత్రించిన విధానం ఆకట్టుకుంటుంది.
కేవలం నమ్మిన ఆదర్శాల కోసమే బతికిన మహాత్మాగాంధీకి సహజంగానే ఇటువంటివి రుచించవు. ‘కోట్ల మంది దేశవాసుల కలలను ఈ గుప్పెడు మంది నిర్ణయించడం ఏమిటి ?’ అని వాపోతాడు. నెహ్రు ని, పటేల్ ని పట్టుకుని ‘మీరు చాలా మారిపోయారు. అధికారం మిమ్మల్ని చాలా మార్చేసింది’ అంటాడు. కానీ, అధికార రాజకీయాలలో వ్యవహారాలు నడిపే పటేల్ కు ఆ బాధ ఏమిటో తెలుసు. అందుకే, ‘పోనీ – మీరే ఈ కుర్చీలో కూర్చోండి’ అని గాంధీని అడుగుతాడు.
దాదాపు 4-5 ఎపిసోడ్స్ వరకు గాంధీ, నెహ్రు, పటేల్, జిన్నా, మౌంట్ బాటెన్ పాత్రలు, ఆయా పాత్రలు వేసిన నటుల ప్రతిభ వలన మనసుకు హత్తుకుంటాయి. బహుశా, దర్శకుడు పటేల్ పాత్ర చిత్రణలో తీసుకున్న ‘కాస్త ఎక్కువ శ్రద్ధ’ వలన ఆ పాత్ర మరికాస్త ఎక్కువ నచ్చుతుంది. అయితే, చివరి రెండు ఎపిసోడ్స్ దగ్గరికి వచ్చేసరికి, ఆనాటి బ్రిటిష్ ఇండియాలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్ వి పి మీనన్ చాలా ఇష్టమైన పాత్ర అయిపోతుంది.
మే 1946 నుండి మొదలయే ఈ పుస్తకం, గాంధీ మరణం వరకూ కొనసాగుతుంది. పుస్తకం ఆధారంగా తీసిన ఈ వెబ్ సీరీస్ సాంకేతికంగా చూస్తే విశ్వసనీయమైన అనుసరణగానే అనిపిస్తుంది. సీజన్ 1 (7 ఎపిసోడ్స్) భారతదేశ విభజన విధివిధానాల చిత్తుప్రతి మీద బాధ్యులైన వివిధ నాయకుల, ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడం దగ్గర ఆగిపోయింది కాబట్టి, రాబోయే సీజన్ 2 మహాత్మా గాంధీ మరణం వరకూ కొనసాగుతుందేమో?
‘We Study History Not To Be Clever in Another Time; but to be wise always’ అంటాడు రోమన్ ఫిలాసఫర్ సిసిరో!
మన దేశ స్వాతంత్య్ర చరిత్రను, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తరువాత కుదేలైన బ్రిటన్ ఇక తప్పనిసరై మన దేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, మౌంట్ బాటెన్ ని చివరి వైస్రాయ్ గా జాతీయ నాయకులందరితో సంప్రదించి విధివిధానాలను రూపొందించడానికి పంపించిన తరువాత చరిత్రలో ఏమి జరిగిందో ఇట్లా దృశ్యమాధ్యమంలో తెలుసుకునే ఒక అవకాశాన్ని ఈ వెబ్ సీరీస్ ఇచ్చింది. చరిత్ర పట్ల ఆసక్తి వున్న వాళ్ళు ఈ వెబ్ సీరీస్ తప్పకుండా చూడండి ! (సోనీ లివ్ లో)…….
Share this Article