.
బాపు సినిమా అనేదానికన్నా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సినిమా అనటమే సబబు . సంతోషం ఏమిటంటే బాలచందర్ లాగా హీరోహీరోయిన్లను చంపకుండా బతికిపొమ్మని రైలెక్కించారు .
మొదటిసారి సినిమా చూసినప్పుడు ఎక్కడ చంపేస్తారేమో అని కంగారుపడి చచ్చాం . ఒరిజనల్ తమిళ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు . భారతీరాజా సినిమాలను బాలచందర్ లాగా విషాదాంతం చేయడు . ముక్కులు చీదుకుంటూ హాల్లో నుండి బయటకు రానక్కరలేదు .
Ads
తమిళంలో సంవత్సరం ఆడిన కిళక్కు పోగుం రైల్ అనే సినిమాకు రీమేక్ మన తెలుగు తూర్పు వెళ్ళే రైలు . అది రాధిక మొట్టమొదటి సినిమా ఇది . సుధాకర్ మొదటి తమిళ సినిమా … ఈ అనువాద సినిమాను బడిపంతులు సినిమా నిర్మాత పి పేర్రాజు నిర్మించారు . అందువలనే రాజమండ్రి , కలిదిండి , ధవళేశ్వరం ప్రాంతాలలో ఈ సినిమా ఔట్ డోర్ షూటింగ్ చేసారు .
తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఒకమ్మాయి అక్క ఇంటికి చేరుతుంది . పిల్లలు కలగలేదని రోజూ గొణిగే బావ మరదలు మీద ఓ కన్నేస్తాడు . ఆ ఊళ్ళో ఓ క్షురకుని కొడుకు తన సహజ కవిత్వంతో ఆకలిరాజ్యం హీరోలాగా పాటలు , పదాలు వ్రాస్తుంటాడు , విడుస్తుంటాడు .
పెద్ద పెద్ద కళ్ళ హీరోయిన్ ఈ సహజకవిని ప్రేమిస్తుంది . నచ్చని కుళ్శుబోతు బావగాడు పంచాయతీ పెట్టించి , హీరోకి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగింపు చేస్తారు . హీరో పట్నానికి వెళతాడు . ఇక్కడ గ్రామంలో పెద్ద తుఫాను వస్తుంది .
ఊరు రక్షించబడాలంటే గంగమ్మ తల్లిని శాంతింపచేయాలని పూజారి గవరయ్య చెపుతాడు . కన్నెపిల్లకు కుంభాభిషేకం చేసి దిశ మొలతో కాగడా పట్టుకుని వేకువజామున గ్రామంలో తిరగాలని హుకుం జారీ చేస్తారు . చీట్లు వేస్తారు .
లాటరీలో హీరోయిన్ పేరు వస్తుంది . వేకువజామున గ్రామంలో తిరుగుతున్నప్పడే పట్నం నుండి హీరో వచ్చి దిశ మొలతో కాగడాతో కనిపించిన హీరోయినుతో ఉడాయించి, రైలు ఎక్కి పారిపోతారు . టూకీగా ఇదీ కధ .
మూఢాచారాలను వ్యతిరేకించే ద్రవిడ తమిళ రాష్ట్రంలో ఈ కధ బాగా ఎక్కింది . సంవత్సరం ఆడింది . అక్కడ సక్సెస్ కావటంతో బాపు దర్శకత్వంలో ఇక్కడా తీసారు . బాగానే ఆడింది . బాగా ఆడటానికి ముఖ్యంగా కారణం బాల సుబ్రమణ్యం సంగీత దర్శకత్వం , కొత్త నటి జ్యోతి పెద్ద పెద్ద కళ్ళు.
ఆ కళ్ళను అద్భుతంగా చూపిన ఇషాన్ ఆర్య , ఆరుద్ర జాలాది పాటలు , బాల సుబ్రమణ్యం సుశీలమ్మ శైలజ గాత్రం , యంవియల్ డైలాగులు , ఆయన సామెతలు , పొడుపు కధలు , వగైరా .
ముత్యాలముగ్గు సంగీతలాగా పెద్ద పెద్ద కళ్ళతో మొదటి సినిమా అయినా జ్యోతి చాలా అందంగా , చిలిపిగా , బాగా నటించింది . హీరో మోహన్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా . ఇతర పాత్రల్లో రాళ్ళపల్లి , సాక్షి రంగారావు , కాకరాల , చాలామంది జూనియర్ ఆర్టిస్టులు , కొత్త వారు నటించారు . వీళ్ళందరితో పాటు ఓ రామచిలుక కూడా నటించింది . అదీ బాగానే నటించింది . నటింపచేశారు .
ఈ సినిమా ఆడటానికి ముఖ్య కారణమయిన పాటల్లో ఓ గొప్ప పాట , ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ చుట్టూ చెంగావి చీరె కట్టాలే చిలకమ్మా … ఆరుద్ర వ్రాయగా బాల సుబ్రమణ్యం పాడారు . అలాగే మరో పాట , టైటిల్సుతో పాటు వస్తుంది . వేగుచుక్క పొడిచింది వేకువ కాబోతుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది . దీన్నీ ఆరుద్ర వ్రాయగా బాల సుబ్రమణ్యం పాడారు .
జాలాది వ్రాసిన పాట కో అంటే కోయిలమ్మ కోకో చిత్రీకరణ బాపు మార్కులో బాగుంటుంది . వంశీ గుర్తుకొస్తాడు . జాలాది వ్రాసిందే మరో శ్రావ్యమైన పాట సందె పొద్దు అందాలున్న చిన్నదీ ఏటి మీద తేలాడుతున్నది చిత్రీకరణ చాలా అందంగా ఉంటుంది . సుశీలమ్మ , బాల సుబ్రమణ్యంలు పాడారు . ఆరుద్ర వ్రాసిన మరో పాట ఏమిటిది ఏమిటిది ఏదో ఏదో తెలియనిది సుశీలమ్మ పాడారు . ఆయన వ్రాసిందే మరో పాట వస్తాడే నా రాజు వస్తాడే . శైలజ పాడింది . శ్రావ్యంగా ఉంటుంది .
యాభై ఏళ్ళ కింద గ్రామాలలో ఉండే వాతావరణాన్ని , కట్టుబాట్లను , మూఢాచారాలను చూపే సినిమా ఇది . ఆనాటి పురుషాధిక్య వాతావరణం , స్త్రీని లోకువగా చూసే బుద్దులు బాగా చూపారు . ఊరిని రక్షించడానికి కన్నెపిల్లే ఎందుకు దిశ మొలతో తిరగాలి !?
అస్ఖలిత బ్రహ్మచారిని ఎందుకు తిప్పకూడదు ? చాలామందికి కోపం వచ్చేస్తుంది ఇలా రేషనల్ గా మాట్లాడితే . ఈ చర్చను వదిలేద్దాం . వందల సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది . మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని సింహాలను బలి ఇస్తారా !!
తర్వాత కాలంలో భారతీరాజాయే ఈ సినిమాను హిందీలో కూడా తీసారు . అసలీ సినిమాకు రైలు సందేశం అనే టైటిల్ పెట్టాలి . రైలు ఆఖరి బోగీ హీరోహీరోయిన్ల మధ్య సందేశాలను నడుపుతుంది . మొత్తం మీద చూడతగ్గ సినిమా . It’s a musical , visual , message-oriented movie . యూట్యూబులో ఉంది . పాటల్ని మాత్రం అసలు మిస్ కాకండి . అలాగే జ్యోతి కళ్ళు కూడా . అందమే ఆనందం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. ( — దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article