.
విద్యార్థులు కొట్టారు… మనోవేదనతో టీచర్ కన్నుమూశాడు
(The Sad incidet of a Teacher)
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజాష్ అహ్మద్ టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. పక్కనే తొమ్మిదో తరగతి నుంచి విపరీతమై అల్లరి వినిపిస్తోంది. ఆయన ఆ తరగతికి వెళ్లి వాళ్లని మందలించాడు. వారిలో ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్లిద్దరూ బాగా అల్లరి చేస్తున్నారని గుర్తించి వారిలో ఒకరిపై దెబ్బ వేశారు. అదే తన ప్రాణం తీస్తుందని ఆయన ఊహించలేదు.
Ads
దెబ్బ పడ్డ వెంటనే ఆ విద్యార్థి, అతని సోదరుడు ఆయనపై తిరగబడ్డారు. మరో విద్యార్థి సైతం వారికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి అహ్మద్‌పై దాడి చేశారు. ఆ కవలల్లో ఒకరి వద్ద కడియం ఉంది. దాంతో ఆయన ఎడమ కన్ను మీద కొట్టాడు. ఆయనకు గాయం కావడంతోపాటు కళ్లజోడు పగిలిపోయింది. ఉపాధ్యాయుడు. అందరికీ పాఠాలు చెప్పే మనిషి. చుట్టూ పిల్లల మధ్యే తనపై దాడి జరిగితే తట్టుకోగలడా? నొప్పి కన్నా ఎక్కువగా అవమానం ఆయన్ని బాధించింది.
అప్పటికే తోటి ఉపాధ్యాయులు వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఆ విద్యార్థులతో ఆయనకు క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ అహ్మద్ దాన్ని తిరస్కరించారు. ‘సారీ’ అనే రెండక్షరాల పదం తన ఆవేదనను చల్లార్చలేదని ఆయనకు తెలుసు. వెళ్లి స్టాఫ్ రూంలోని కుర్చీలో కూర్చున్నారు. మళ్లీ లేవలేదు. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనోవేదనతో గుండె ఆగి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పే ఓ ఉపాధ్యాయుడికి దక్కిన గౌరవం, జరిగిన సన్మానం ఇది.
అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమిటంటే, తొమ్మిదో తరగతి చదివే ఆ పిల్లలకు గంజాయి అలవాటు ఉందని సమాచారం. అయితే పోలీసులు దీన్నింకా ధ్రువీకరించడం లేదు. వాళ్లు క్లాసులో కూడా రౌడీల్లాగే ఉంటారని, అలాగే ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడతారని తోటి విద్యార్థులు చెప్తున్నారు.
ఇప్పుడు పిల్లల చదువుల మీద వాళ్ల తల్లిదండ్రులకు పెద్ద ఆశలేం లేవు. తమను ఉద్దరిస్తారన్న పిచ్చి ఊహలు అసలే లేవు. తమ మీదకు కేసులు, కోర్టు గొడవలు తేకపోతే చాలురా దేవుడా అన్నట్లు ఉన్నారు. ఇంటర్ వచ్చేదాకా వాడు గంజాయి బారిన పడకపోతే గొప్ప. డిగ్రీ దాటేదాకా పోలీసులకు చిక్కకపోతే గొప్ప. ఎవర్నీ అత్యాచారం చేయకుండా ఉంటేనో, హెచ్‌ఐవీ రాకుండా ఉంటేనో మహా గొప్ప.
మనదేశంలో 35 శాతం హెచ్ఐవీ కేసుల్లో బాధితుల వయసెంతో తెలుసా? 15–24. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. రాన్రానూ మైనర్ల నేరాల సంఖ్య పెరుగుతూ ఉంది. గంజాయి అమ్మకాలు, కొనుగోలులో కూడా వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
మీ పిల్లలు వాళ్ల స్కూళ్లలో, కాలేజీల్లో ఎలా ఉంటున్నారో గమనించుకోండి. భావిభారత రౌడీలు మీ ఇంట్లో నుంచే వెళ్తున్నారేమో ఓ కంట కనిపెట్టండి. ఇక ఉపాధ్యాయుల సంగతి, వాళ్ల ప్రాణాలకు బడిలో రక్షణ లేదని తేలిపోయింది… – విశీ (వి.సాయివంశీ)
Share this Article