.
పార్థసారథి పొట్లూరి…. తాను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిటినీ వాడుకున్నాడు ఏకనాథ్ షిండే!
చర్చల పేరుతో ఢిల్లీ వెళ్లి తిరిగి ముంబై రాగానే తన స్వంత జిల్లా సతారాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు షిండే!
Ads
డిల్లీలో నేనే మఖ్యమంత్రిగా కొనసాగుతాను, లేదంటే నా కొడుకు శ్రీకాంత్ షిండేను ఉప ముఖ్యమంత్రిని చేస్తే, నేను మంత్రివర్గంలో ఎలాంటి పదవి తీసుకోను అని మెలిక పెట్టాడు! అమిత్ షా ఒప్పుకోలేదు!
మళ్ళీ డిల్లీ పిలిస్తే వెళ్ళాడు షిండే! నేను ఉప ముఖ్యమంత్రిగా పనిచేయలేనని, మహారాష్ట్ర ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు అమిత్ షాతో! అమిత్ షా నచ్చచెప్పినా ఢిల్లీలో సరే అని, ముంబై కివచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు నన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి, నేరుగా సతారా వెళ్లిపోయాడు ఆరోగ్యం బాగాలేదు అంటూ!
ఇక స్థానిక ప్రభుత్వ డాక్టర్లు సతారాలోని షిండే ఇంటికి వెళ్లి పరీక్షలు చేసి వైరల్ జ్వరం అని విశ్రాంతి అవసరం అని ప్రకటించారు! నిద్రాహారాలు మాని ఎన్నికల సభల్లో పాల్గొనడం వల్ల వైరస్ సోకింది అని ప్రచారం చేసుకున్నాడు! ఆరోగ్యం బాగాలేదు అని అనిపించినపుడు ముంబైలోనే ఉండి చికిత్స చేసుకోవచ్చు కదా?
చివరి అస్త్రం! కృష్ణదేవానంద గిరి స్వామి, ద్వారక సూర్య పీఠాధిపతి!
సదరు కృష్ణాదేవానంద స్వామి వారు షిండే ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు! ఇంతవరకు బాగుంది! సరే! ఎవరి ఇష్టం వారిది. స్వయం ప్రకటిత పీఠాధిపతులకి కొదువ లేదు మనదేశంలో!
అక్కడితో ఆగకుండా విలేఖరుల సమావేశంలో సదరు పీఠాధిపతి మాట్లాడుతూ షిండే ఆరోగ్యం బాగాలేదు అని తెలిసి పరామర్శించడానికి వచ్చాను అన్నారు. అంతటితో ఊరుకోకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాధ్ షిండే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటూ, నేను కూడా ముఖ్యమంత్రిగా ఉంటేనే ధర్మం నిలబడుతుంది అని భావిస్తున్నాను అంటూ సెలవిచ్చారు స్వామీజీ!
Well, సదరు స్వయం ప్రకటిత పీఠాధిపతికి రాజకీయ ఉద్దేశాలు ఉండడం సబబేనా? షిండే ఏది చెప్పమంటే అదే చెప్పారు! షిండే డ్రామాలో భాగంగా షిండే ఫోన్ చేస్తే వచ్చారు స్వామీజీ! ఇది పరోక్షంగా మోడీ , అమిత్ షాలని సెంటిమెంట్ తో కొట్టడం అన్నమాట! కానీ ఇవేవీ మోడీ, అమిత్ షాలని ప్రభావితం చేయలేదు!
చివరికి డిసెంబర్ 5 న ముంబై ఆజాద్ మైదాన్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని బిజెపి అధ్యక్షుడు ప్రకటించినా షిండే లెక్క చేయలేదు! డిసెంబర్ 4 న విలేఖరులు షిండేను ఒక ప్రశ్న వేశారు, రేపు ప్రమాణ స్వీకారం ఉంది కదా, మీరు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని… దానికి షిండే బదులు ఇస్తూ రేపటిదాకా సమయం ఉంది కదా? అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకూ అంటూ దాట వేశాడు!
నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారానికి షిండే వస్తాడో రాడో అని సందేహాలు ఉన్నాయి! చివరికి ప్రమాణ స్వీకారానికి షిండే వచ్చినా ముభావంగా ఉన్నాడు తప్పితే ఎలాంటి సంతోషం కనపడలేదు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఏకనాథ్ షిండే వల్ల ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు !
షిండేకి రాజకీయ అధికార దాహం ఎక్కువే అనడానికి ఇది ఒక ఉదాహరణ: నిన్న ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాద్ షిండే, అజిత్ పవార్ లు కలిసి విలేఖరులతో మాట్లాడారు!
విలేఖరులు షిండేను మీరు సాయంత్రం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అని అడిగినప్పుడు షిండే సమాధానం చెప్పేలోపు అజిత్ పవార్ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఉప ముఖ్యమంత్రిగా అన్నాడు నవ్వుతూ… దానికి బదులుగా షిండే మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడం అజిత్ పవార్ కి అలవాటే అన్నాడు కొంచెం వ్యంగ్యంగా!
షిండే అజిత్ పవార్ ను ఉద్దేశించి అన్నది 2019 లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున… ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా మద్దతు ఉపసంహరించుకోవడం వలన ఫడ్నవీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! తరువాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా, NCP తరుపున అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు!
అఫ్కోర్స్! ఉద్ధవ్ ఠాక్రేకి మద్దతు పలికినట్లుగా తనకి కూడా మద్దతుగా నిలిచి బీజేపీ తనను ముఖ్యమంత్రిగా కొనసాగించి ఉండేది అన్న అక్కసు షిండే వ్యాఖ్యలతో బయటపడ్డది! అజిత్ పవార్ కి ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ ఉంటూ తన ఉనికిని కాపాడుకోవడం ఎలాగో తెలుసు!………
Share this Article