కొన్ని రోజుల క్రితం మరణించిన తెనాలి హెడ్ కానిస్టేబుల్ మాకు మిత్రుడు. 1996 – 97 లో రెడ్ హిల్స్ లోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్ కి వచ్చినప్పుడే నాకు పరిచయం. సరదా మనిషి. మంచి కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఆయన గత జీవితం గురించి మాకేమీ తెలీదు. సింపుల్ మనిషి. చాలా ప్రాక్టికల్. కూతురు, కొడుకు, భార్య… నా కుటుంబం అంటూ చాలా బాధ్యతగా ఉండే పోలీసోడు. ఆయన ఖాకీ బతుకులు పుస్తకానికి వెనక అట్ట మీద నేను ఒక పేరా రాశానని నాకు గుర్తు లేదు. విజయవాడ నుంచి సీనియర్ జర్నలిస్ట్ అక్బర్ పాషా ఆ పుస్తకం కవర్ పేజీ, బ్యాక్ కవర్ పంపినప్పుడు చదివితే అది నేనే రాశానని తెలిసింది. మోహన్ ముందు మాట, నేను రాసిన వెనక మాట చదవండి.
*** *** ***
పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని ఏకంగా నవల రాయటమేమిటి?
రాస్తే గీస్తే ఏ చిన్న కథో, కవితో, మరీ ముచ్చటపడితే ఏ నవలికో రాయొచ్చుగానీ మరీ ఇంత నవలా? ఇంత నవల రాయటానికి ఏముంటుంది వాళ్ళ జీవితాల్లో? వాళ్ళు రోబోల్లాంటి వాళ్ళు.
Ads
స్విచ్ వేస్తే తిరిగే యంత్రాల్లాంటి వాళ్ళు.
యంత్రాల గురించి ఏం రాస్తాం.
హూ! అర్థం లేని వృథా శ్రమ.
ఈ దేశంలోని ఏ రచయితకూ, కళాకారుడికీ ఈ ఆలోచన రాకేనా కానిస్టేబులు గురించి రాయంది? కొంతమంది గురించి రాయకూడదు.
దళితుల్ని గురించి రాయకూడదు.
స్త్రీల గురించి రాయకూడదు.
భ్రష్టుల్ని గురించి రాయకూడదు.
వాళ్ళలా ఉండాలంతే.
రాయడమంటే వాళ్లకు కొంత మేలు చేసినట్టే గదా! అలాగే పోలీసుని గురించి కూడా. ఒకవేళ రాస్తే ఏ పోలీసు ఉన్నతాధికారి గురించో రాయాలి – అదీ లోతుకు పోకుండా. అంతేగాని, ఇదేంటి, ఇలా పోలీసు కానిస్టేబుల్ హృదయంలో కలం ముంచి.. ఇలా… ఇంత సైజు! అబ్బే. ఈ దేశంలోని మేధావులెవ్వరూ ఈ పనిని హర్షించరు గాక హర్షించరు…”
మీకూ ఇలాంటి అభిప్రాయమే వుంటే ఈ నవల పేజీలు తిప్పటం కూడా వేస్ట్.
అలా కాకుండా, ‘వెయ్యి మంది మేధావులకన్నా హృదయమున్న ఒక వ్యక్తి వల్ల ఈ సమాజానికెంతో మేలు జరుగుతుంద’నే సత్యాన్ని అంగీకరిస్తున్నవాళ్ళయితే ఈ నవల చదవటానికుపక్రమించండి. కరకు ఖాకీ దుస్తుల వెనక వున్న హృదయ స్పందనను ఆలకించండి.
*** *** ***
మోహన్ రావు నవలకి ఆర్టిస్ట్ మోహన్ రాసిన ముందు మాట చదవండి ఇక….
ఆర్టిస్ట్ కీ పోలీస్ కీ లింకేమిటి ?
తెనాలి పోలీసోడికి హైదరాబాద్ లో బొమ్మలేసుకునే వాడికి లింకేమిటి? ఓ రోజు పొద్దుటే స్టుడియోకి ఫోన్ వచ్చినపుడు ఇదే అనిపించింది. గంటసేపట్లో ఫోన్ మనిషి దిగాడు. పోలీసంటే మేం కార్టూన్లలో గీసినట్లు బుర్రమీసాలూ, బొర్రా, యూనిఫాం, బూట్లు టకటకలాడించుకుంటూ ఉంటాడనుకుంటాం గదా. ఈ మనిషి వెరీ ఆర్డినరీ గెడకర్ర. చూడ్డానికి బావున్నాడు. నోట్లో వేలుపెడితే కొరకలేనంత మంచి బాలుడు రాము టైపు. నా బొమ్మలు చాలాకాలంగా చూస్తున్నాననీ, అదిగా ఇదిగా ఉంటాయనీ ఇరవయ్యేళ్లుగా ఫలానా పత్రికలు చదువుతున్నాననీ, వాటి ముఖచిత్రాలు చూస్తున్నాననీ ఆ రకంగా బోలెడు పరోక్ష పరిచయం, అభిమానం ఉందని చెప్పకొస్తున్నాడు. ఓ కె. ఎలాటి అభ్యంతరం లేదు. కానీ నేను తెనాలి వెళ్లి ఇరవయ్యేళ్లు దాటిపోయింది. అక్కడి పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, హైదరాబాద్ లో గానీ బొమ్మలెయ్యడం తప్ప మరెలాంటి క్రైమ్ టాలెంట్ లేనోన్ని. నా దగ్గరికి పోలీసెందుకు రావాల? ఇంతకీ సంగతి చెప్పండన్నాను. మెల్లగా ఓ తెనాలి బ్రాండ్ రెక్సిన్ హేండ్ బాగ్ లోంచి దిండులాంటి పుస్తకం తీశాడు. ఇది నా నవల అన్నాడు. జడుసుకున్నాను. సూర్యరాయాంధ్ర నిఘంటువుకీ, అండ్ క్వయట్ ఫ్లోస్ ది డాన్ నవలకి మధ్యలో ఉన్నట్టుంది. పట్టుకున్న వెంటనే ఆఖరి పేజీ చూశా. 800 చిల్లర ఉంది. టెర్రర్. ఇలా కవిత్వాలూ, కథలూ, నవల్లూ తెచ్చినాళ్లందరిదీ ఒకటే స్టోరీ. అది అచ్చయిన వెంటనే సకల ప్రపంచమూ బాంబు పడ్డట్టు షాక్ అయి లేస్తుందనుకుంటారు. ఈ దెబ్బకి ‘నేను’ అంటే ఏంటో ముందు సాహిత్య ప్రపంచానికీ, తర్వాత ప్రజలందరికీ పూర్తిగా తెలిసొస్తుందనుకుంటారు. పాఠకులొచ్చి ‘సార్ ఫలానా నాలుగు లైన్లు రాసింది మీరేనాండీ’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవాలి. సమీక్షలొస్తాయి. సూపర్ స్టార్ అవడం ఖాయం. కానీ ఒకటే అడ్డు. ఈ ఆర్టిస్టుగాడు అదంతా చదవాలి. దాని ప్రాణం (లేకపోయినా) పట్టుకోవాలి. (బాగా లేకపోయినా) బాగా పొగడాలి. అర్ధం చేసేసుకుని అర్జెంట్ గా అత్యద్భుత అట్ట వేసెయ్యాలి. మళయాళ మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలోపలి చిలకలోనే ఉన్నట్లు అంతా అట్టలోనే ఉంది. అదయ్యేవరకూ హైదరాబాద్ లాడ్జిలో తిష్టవేయాలి. మీటర్ తిరుగుతుంటుంది. ఈ కళాసృజనలో ఏమాత్రం లేటు జరిగినా లాడ్జి బిల్లు చివర్లో కట్టడానికేం మిగల్దు. తిరుగు టపా ఛార్జిల సంగతి చెప్పక్కర్లేదు. ఇలా చాలామంది మిత్రుల బిల్లులు కట్టిన అపారమైన అనుభవం సారం పిండిన నేను గంభీరంగా ఎక్కడ దిగారని అడిగా. సికింద్రాబాద్ లాడ్జిలో అన్నాడు. చచ్చాను. అర్భకుణ్ణి. ఈ 800 పేజీల చాటభారతం చదవడం ఎన్ని జన్మలకి, మహామహా టాల్స్టాయ్, డాస్టావిస్కీలవే సరిగ్గా చదవకుండా నిరక్షరాస్య చిత్రకార్స్ గా మిగిలినోణ్ణి. చేతిలో ఉన్న బొమ్మల బకాయీలు తీరడానికే చాల రోజులు పడుతుంది. ఊళ్లో ఉన్నవాళ్లే వచ్చి పీకలమీద కూచోడం, కాలర్ పట్టుకోడం – పులిమీద పుట్రలా ఈ పోలీసు దౌర్జన్యం. ఎలా ? మా క్రైమ్ రిపోర్టర్ ఎవడికన్నా ఫోన్ చేస సికింద్రాబాద్ లాడ్జి మీద రైడింగ్ చేయించి, ఈ పోలీస్ రచయితని తెనాలి తరిమేస్తేగానీ ఈ జీవితానికి శాంతి లేదనిపించింది. అయినా ప్రశాంత చిత్తముతో – చదవడానికి చాల టైమ్ పడుతుందనీ, అమాంతంగా ఆవిష్కరణ సభలు ప్లాన్ చేసుకోడం ఆరోగ్యానికి భంగకరమని ఉద్భోదించాను.
అలాటిదేం లేదన్నాడు. వాళ్ళ ఊళ్ళో చిన్న టిక్కి లెటర్ ప్రెస్లో ఏడాది పాటూ కంపోజిటర్లు దీన్ని చేశారన్నాడు. తన జీతం బతుకూ చెప్పాడు. ఈ పుస్తకం పంపకం ఎట్లా ఏం చేయాలి అని కూడా అడుగుతున్నాడు. ఇతను చిన్నవాడే కాదు చాల చితకవాడని అర్థమయింది. ముందు ఆ సంగతి చూడండని తెలిసిన పిల్ల పబ్లిషర్ దగ్గరకి పంపాను. డిస్ట్రిబ్యూషన్లో కమిషన్ లు పోగా పుస్తకం రేటు పెట్టడం లాటి మాటలు విని గందరగోళంగా తిరిగొచ్చాడు. అట్ట వెయ్యడానికి ఖర్చెంత అవుతుందో, అదో బెంగ. సాయంత్రం మళ్లీ వచ్చాక టీలూ, కబుర్లూ. మాకులాగా సిగరెట్లూ వేషాలూ ఏంలేవు. మోహన్ రావు చాల పద్ధతి మనిషి. తండ్రి ఉద్యోగం, తన ఉద్యోగం ఏకరువు పెట్టాడు. చాల ఇంటరెస్టింగ్ గా ఉంది. అవన్నీ ఓ పోలీస్ రాయడంలో న్యూస్ మేకింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. కానీ ఉన్న ఉద్యోగం ఊడితేనో, అదే చిక్కు. ఏదేనా పేపర్లో ఇది నవల అనీ, సాహిత్య సంబంధమైనదనీ ఒక్కముక్క వస్తే ముందుముందు తనేదన్నా కష్టాల్లో పడినా ఇది ఆదుకుంటుందన్నాడు. ఇది నవలే గనకా, ఖాయంగా క్రియేటివ్ వర్క్ గనకా ఆ మాత్రం ఏ పత్రికలోనన్నా రాయించగలననీ, అవసరమయితే నేనే రాసేయగలననీ ధీమా ఇచ్చా. రాత్రికి నవలలో కొంతవరకూ చదివా. మొదటి రచన అయినా సరే నాకేం కష్టమనిపించలేదు. నేరేటివ్ సాఫీగా నడిచిపోయింది. కొన్ని పేజీల తర్వాత అసలెలా రాశాడు అనే స్పృహే లేకుండా సాగింది. నాకు తెలీని, ఎన్నడూ పట్టించుకోని ప్రపంచం కావడం – ఏమో కారణాలు చెప్పలేనుగానీ పేజీలు దొర్లిపోయాయి. ప్రథమ వీక్షణంలో మోహన్రావుని చూసిన జడుపు పోయింది. బుక్కు అచ్చయ్యి అందరూ చదివితే బాగుండనిపించింది.
మర్నాడు మళ్లీ కబుర్లు. నా దగ్గరకొచ్చే జర్నలిస్టుల్ని, ఆర్టిస్టులని పరిచయం చేశా. కొందరు రచయితల దగ్గరకి తీసికెళ్లా. మోహన్ రావుకి కొంత ధీమా వచ్చినట్టుంది. ఊరెళ్లి కొంతకాలానికి వచ్చాడు. సగానికి పైగా చదివి కవర్ డిజైన్ పూర్తి చేశాను. ఈలోగా నాకిచ్చిన డమ్మీ కాపీని చాలామంది మిత్రులు చదివారు. మెచ్చుకున్నారు. ఓ ఆదివారం అనుబంధం కవర్ స్టోరీలో ఈ నవలలోని కొన్నిభాగాలు వచ్చాయి. ఒక్క రివ్యూలో ఇది సాహిత్యమే సుమా అని ఒక్క ముక్క రావాలనుకున్న మోహనరావుకి పెద్దపెద్ద సమీక్షలొచ్చాయి. సంపాదకీయాలొచ్చాయి. బొత్తిగా టైమ్ స్పేర్ చేయలేననుకున్నవాడ్ణీ తెనాలి ఆవిష్కరణ సభకెళ్లోచ్చా. మళ్లీ విజయవాడ సభకీ వెళ్లా. ఇదంతా నవల బలమే. తర్వాత ఈ నవల దుమారం తెలుగు తీరాలు దాటి హిందూ, ఔట్ లుక్, వీక్, టెలిగ్రాఫ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంకా దేశమంతా ఎన్నో పత్రికలకు చేరింది. అమెరికా తెలుగువారు సకాలంలో జోక్యం చేసుకుని ముఖ్యమంత్రికి మెసేజ్ లిచ్చారు. అదంతా చరిత్ర. ఇది రెండో ఎడిషన్ వస్తుందంటే బుక్ నేనే రాసినట్టు బోల్డు బడాయిగా ఫీలయిపోతున్నా. తెనాలి పోలిసోడికీ, హైదరాబాద్ ఆర్టిస్టుగాడికి లింకులు గొలుసులు గొలుసులుగా చుట్టుకున్నాయనీ, ఇవి ఇలాకాక మరోలా ఉండవనీ అర్థమయింది.
– Taadi Prakash………. 9704541559
Share this Article