ఐనా మనకెందుకులే… ఎవడు ఆత్మహత్య చేసుకుంటేనేం..? కుటుంబాలతో సహా పరలోకాలకు పయనం కడితేనేం..? అప్పులే కదా ఆఫ్టరాల్… పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు… మనం బంగారు తెలంగాణ కోసం చప్పట్లు కొడదాం… మన పాత కష్టాలన్నీ మరచి, మన పాత గోసలను మరచి, పాలకులకు ఆహాఓహో అని డప్పులు కొడదాం…. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనే ఓ భ్రమాత్మక నినాదాన్ని భుజాన మోద్దాం, నయా నియంతల పల్లకీలు మోద్దాం… దిక్కుమాలిన కౌలు రైతులు… ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడిచిందీ అన్నట్టు… ఎవడ్రా మిమ్మల్ని కౌలుకు సాగు చేయమన్నది..? మా కేసీయార్ చెప్పిండా..? మా కేటీయార్ చెప్పిండా..? మీకెవడ్రా గుర్తింపునిచ్చేది..? అసలు మీకెందుకురా, ప్రభుత్వ సాయాలు… ఎరువులు ఇవ్వం, విత్తనాలు ఇవ్వం, రైతుబంధు అసలే ఇవ్వం, భూమి ఎవడి పేరిట ఉంటే వాడికి… అసలు వాడికి వ్యవసాయం అనే పదం తెలియకపోయినా సరే, వేలకువేలు సాయం చేస్తాం… మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు అడిగితే మర్యాద దక్కదు… చివరకు చస్తే పరిహారమూ దక్కదు… పోతేపోయారు, మిమ్మల్ని ఎవడురా పట్టించుకున్నది…
బొచ్చెడు పథకాలు మన బొంతపురుగు పత్రికల నిండా పరుచుకుంటయ్…. వాటిని నెమరేస్తూ పత్రికాధిపతులు అజీర్ణంతో బాధపడుతూ ఉంటారు… మన జర్నలిస్టులకు ఆ వార్తలంటేనే చిరాకు… పాసు బుక్కులు దేనికి..? ధరణి సైట్లు దేనికి..? అసలు కౌలు రైతు అంటేనే ఓ నిషిద్ధ పదం కదా… అప్పట్లో తెలంగాణ అంటే చంద్రబాబు మండిపడినట్టు, నిషేధించి కొరడా పట్టుకున్నట్టు… ఇప్పటి పాలకులేం తక్కువ..? కౌలు అంటే తోలు తీసుడే… తాట ఒలుసుడే… ఎవడ్రా మిమ్మల్ని రిస్క్ తీసుకుని, లీజు తీసుకుని, ప్రాణాలకు పణంగా పెట్టి వ్యవసాయం చేయాలని చెప్పింది… ఎంచక్కా సర్కారు ఇచ్చే రేషన్ బియ్యం తిను… ఆ పింఛన్ తీసుకుని కల్లోగంజో తాగి బతుకు… కష్టమొస్తే చావు… అంతే తప్ప వ్యవసాయం చేయడం ఏమిట్రా అసలు..?
Ads
వందలు కాదు, వేలల్లో ఆత్మహత్యలు… సో వాట్… మన బంగారు తెలంగాణ ధగధగల నడుమ మిమ్మల్ని ఎవడురా చూసేది..? దిక్కుమాలిన వెలుగు పురుగుల బతుకులూ మీరూనూ… మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్సీలు, మా ఎంపీలు, మా మంత్రులు… మా నేతల సొల్లు కబుర్లు… రైతు వేదికలు, నియంత్రిత సాగు విధానాలు… దేశానికే తిండి పెడుతున్నాం మేం… కానీ మాకే తిండి కరువై సామూహికంగా ఉరిపెట్టుకుంటున్నాం… అయితేనేం… మేం మారం..? మా డప్పులు తక్కువ చప్పుళ్లు చేయడానికి వీల్లేదు… మా పత్రికలు, మా వందిమాగధులు, మా మేధావులు.., ఒకప్పుడు జైతెలంగాణ అని జనం కోసం ఎలుగెత్తిన గొంతులు, తమ వెన్నెముకల్ని అటకల మీద పారేసి, ఆత్మల్ని మూసీలో నిమజ్జనం చేసేసి, తమ పోస్టుల కోసం, తమ సుఖాల కోసం, తమ సంపాదన కోసం… మమ్మల్ని కీర్తిస్తుంటే, మా పాదాల మీద పాకుతూ ఉంటే… ఆహా, ఎంత సుఖం..? పాలకుడా, నీకు జోహార్… (ఒరేయ్.., నీ అయ్య, నీ అవ్వ, ఆ పొలం బురదలో బతుకులీడుస్తూనే మిమ్మల్ని సాకారుర …)
నువ్వు ప్రధానివి కావాలి… తప్పకుండా కావాలి… ఈ స్వర్ణ కాంతుల స్థితి దేశమంతా పాకాలి… దేశం వెలిగిపోవాలి…మనం బాగుండాలి, మన సర్కారు ఉద్యోగులు బాగుండాలి, చాలు… ఇంకా సందేహాలుంటే బుర్ర నిండా బొచ్చెడు జ్జానం కిక్కిరిసిపోయిన మా మల్లన్నను అడగండి… అవునూ, అసలు కౌలును నిషేధిస్తే బెటరేమో… ఈ దిక్కుమాలిన రైతుల్ని జైళ్లలో పారేస్తే బెటరేమో… బయట వదిలేస్తే చస్తారు… కౌలును నిషేధించే చట్టాల్ని అర్జెంటుగా తీసేకొస్తే బెటరేమో… పనిలోపనిగా మోడీ తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాల్ని మాత్రం మనం వ్యతిరేకించాల్సిందే… అంతే… అంతే… కౌలు రైతుల పిల్లలు బతికి ఉండటానికి వీల్లేదు… వీల్లేదు… కారుణ్య మరణాలకూ ఓ చట్టం తీసుకొస్తే బాగుంటుందేమో…!! అవునూ, రైతుబంధు రెట్టింపు చేస్తే ఎలా ఉంటుందోయ్…!! ఆ డప్పు చప్పుళ్ల నడుమ ఒక్క చావు డప్పూ వినిపించకూడదు… ఎంత నామర్దా, ఎంత నామోజీ… ఇది కచ్చితంగా ప్లాన్ చేయాల్సిందే…!!!
Share this Article