.
అవసరమేనా ఈ విగ్రహ వివాదం? – ఎన్.వేణుగోపాల్
అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ ఇటు ప్రతిపక్షమూ అదే ప్రధానమైన, జీవన్మరణ సమస్య అన్నట్టు ఆ అనవసర వివాదం మీద చర్చోపచర్చలు చేస్తుంటాయి.
Ads
అలా వివాదంగా మార్చిన అంశాన్ని ఒక భావోద్వేగం స్థాయికి పెంచి, ఆ వివాదం మీద సమాజం రెండుగా చీలిపోయేలా చేయడానికి పాలక, ప్రతిపక్షాలు రెండూ ప్రయత్నిస్తుంటాయి. అక్కడ రెండు పక్షాలూ తోడు దొంగలే. ఈ క్రమంలో ఈ వివాదాన్ని పెంచడానికి, చిలవలు పలవలు చేయడానికి సాహిత్య, కళారంగాలను, సామాజిక మాధ్యమాలను కూడా పాలకవర్గాలు వాడుకుంటాయి.
ఆ వివాదంలో చిక్కి, ఆ వివాదపు అగ్నికి ఆజ్యం పోస్తున్న ప్రతి ఒక్కరికీ తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియకపోవచ్చు. మరొక కొత్త వివాదం వచ్చేవరకూ సమాజం అసలు విషయాలు ఆలోచించకుండా ఈ వివాదంలో తలమునకలు కావాలనే పాలకుల కోరిక మాత్రం నెరవేరుతుంది.
తాజాగా మొదలైన, సాగుతున్న తెలంగాణ తల్లి వివాదం ఇటువంటిదే. తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొదలై ఏడాది గడిచినా పాలన సక్రమంగా లేదు. ఇప్పటికీ గత పాలకుల మీద ప్రతీకార రాజకీయాలు తప్ప తమదైన పాలనా విధానం లేదు. ఆ ప్రతీకారం కూడా మాటలలో, ప్రతీకలలో సాగుతున్నది గాని, వాస్తవంగా గత అధికారపక్షం ప్రజలకు చేసిన మోసాలను సరిదిద్దడంలో లేదు.
ఎన్నికల ప్రణాళికలోనూ, అదనంగానూ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. విపరీతమైన అవినీతి జరుగుతున్నదని పుకార్లు వినిపిస్తున్నాయి. పాత ప్రభుత్వం చేసిన రుణ భారానికి అదనపు రుణ భారం చేర్చడం, కార్పొరేట్లకు రాష్ట్ర వనరులను అప్పజెప్పడం, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి రుణాలు తేవడం, పోలీసు రాజ్యాన్ని యథాతథంగా నడపడం వంటి ఎన్నో ప్రజలు చర్చించవలసిన కీలకమైన సమస్యలు ఉండగా, పెరిగి పోతుండగా తెలంగాణ తల్లి వివాదాన్ని సృష్టించడం అసలు సమస్యల మీద చర్చను పక్కదారి పట్టించే ఉద్దేశపూర్వక వ్యూహమే.
ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ కావాలనే ఆకాంక్ష మొదలైనప్పటి నుంచీ తెలంగాణ తల్లి భావన మొదలయింది. 1969 ఉద్యమ కాలంలోనే వరంగల్ నుంచి ‘జనని’ పేరుతో తెలంగాణ కవిత్వ, గేయాల సంకలనం వెలువడింది. ఆ సంకలనంలో అప్పటి ఉద్యమ నాయకుడు నెల్లుట్ల జగన్మోహన్ రావు ప్రోత్సాహంతో ఆయన తమ్ముడు ఎన్ కె రామారావు రాసిన తెలంగాణ జాతీయగీతం కూడా ఉంది. ఆ చరిత్ర తెలుసునో లేదో గాని, 1990ల మధ్య నుంచి ప్రారంభమయిన మలిదశ ఉద్యమంలో కూడా చాలా మంది తెలుగుతల్లి భావనను అవహేళన చేసి తెలంగాణ తల్లి అనే ఆలోచన చేశారు, చిత్రకళా, శిల్ప రూపాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
ఈ తెలంగాణ తల్లి వివాదంలో అధికారపక్ష వాదనలు, ప్రతిపక్షాల వాదనలు, ఆటో ఇటో సమర్థించే బుద్ధిజీవుల వాదనలు అన్నీ ఎంతో కొంత లోపభరితంగానే ఉన్నాయి. స్థూలంగా సమాజం ఇది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు నిర్లిప్తంగా ఉంది. అధికారికంగా గుర్తింపు పొందినా పొందకపోయినా తెలంగాణ తల్లి అనే భావన ఉద్యమ సమయంలో తలెత్తి, మార్పులు, చేర్పులతో అనేక రూపాలు పొంది, అందరూ ఆమోదించిన ఒక నిర్దిష్ట రూపానికి చేరి ఉన్నది గనుక దాన్ని హఠాత్తుగా మార్చడం ఉచితమూ కాదు, సమర్థనీయమూ కాదు.
ఆ నిర్ణయం సముచితమైనది కావాలంటే మార్పుకు కారణాలను విస్పష్టంగా, కచ్చితంగా, ఒప్పించేటట్టుగా ముందుకు తేవాలి, విస్తృతమైన చర్చకు పెట్టాలి. పాత ప్రభుత్వం ఒక రూపం ఇచ్చింది గనుక దాన్ని మార్చడమే మా లక్ష్యం అనేది సరైన వాదన కాదు. నిజానికి ప్రభుత్వం బహిరంగంగా, పారదర్శకంగా ఎటువంటి చర్చ జరపకుండానే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఆలోచనను రహస్యంగా కొనసాగించి, డిసెంబర్ 9న సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది.
అధికార పక్ష చర్య ఎంత అప్రజాస్వామికంగా, దొంగచాటుగా, అభ్యంతరకరంగా ఉన్నదో ప్రతిపక్ష వాదనలలోనూ అన్ని అభ్యంతరకర అంశాలున్నాయి. వారికి తాము తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం మీద అంత ప్రేమ ఉండి ఉంటే, పది సంవత్సరాల పాలనలో ఆ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందరో, నగరంలోని మరొక ప్రధాన కూడలిలోనో ప్రతిష్ఠించకుండా ఆపినదెవరు?
ఇప్పుడు తల్లికి అధికారిక అనుమతి కావాలా అని తెలివైన ప్రశ్న వేసినట్టు ఎదురు ప్రశ్న వేస్తున్నారు గాని, ఆధునిక ప్రభుత్వాలలో ప్రతి ప్రభుత్వ కార్యమూ చిహ్నమూ అధికారిక ఉత్తర్వుల ద్వారానే ఉనికిలోకి వస్తాయి. ఆ చిహ్నం తరతరాలుగా ప్రజల వ్యవహారంలో ఉన్నప్పటికీ అది జాతి చిహ్నం అని ప్రభుత్వం లాంఛనప్రాయమైన ఉత్తర్వు ఇస్తుంది. జెండా, జంతువు, పువ్వు, అధికార ముద్ర అన్నీ అట్లా వచ్చేవే. తెలంగాణ తల్లి అనేది అటువంటి చిహ్నం కాకపోయినా, అది భావోద్వేగాలతో కూడినది మాత్రమే అయినా దానికి కూడా అధికారిక గుర్తింపు అవసరమే.
కారణమేమిటో తెలియదు గాని తెలంగాణ జాతీయ గీతం విషయంలోనూ, తెలంగాణ తల్లి విషయంలోనూ అటువంటి అధికారిక గుర్తింపు ఇవ్వడానికి తెలంగాణ తొలి ప్రభుత్వం పది సంవత్సరాలు వెనుకాడింది. రాజకీయ పార్టీ కార్యాలయంలో పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే రాజకీయ పార్టీ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా అధికారికంగా ప్రకటించలేకపోయింది.
రాష్ట్రమంతటా ప్రజలు, ఉద్యమ సంఘాలు, కొన్ని చోట్ల రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయా పట్టణాల్లో స్థాపించాయి గాని ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా పూనుకోలేదు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోవడం, పాత తెలంగాణ తల్లికి ఉన్నట్టుగా కిరీటం, భారీ ఆభరణాలు లేకపోవడం, పట్టు చీర కాకుండా సాదా చీర ఉండడం వంటి అభ్యంతరాలు కూడా వస్తున్నాయి గాని ఇవన్నీ పైపై అంశాలే తప్ప అసలు విగ్రహ అవసరం, వ్యవహారంలో ఉన్న విగ్రహాన్ని మార్చవలసిన అవసరం అనేవి మౌలికాంశాలు.
ఆశ్చర్యకరంగా తెలుగు తల్లి విగ్రహాన్ని సృష్టించినది తెలంగాణ బిడ్డ అయిన సుప్రసిద్ధ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. ఆ విగ్రహం మామూలుగా హిందూ దేవాలయాలలోని శిల్ప శాస్త్ర సూత్రాలను, ప్రతిమ లక్షణాలను అనుసరించి, దైవత్వం ఉట్టిపడేట్టుగా తయారు చేయాలనే కళాకారుల ఆలోచనను బట్టి తయారయింది.
ఒక సెక్యులర్ ప్రభుత్వానికి అటువంటి విగ్రహం ఉండవచ్చునా, ఉన్నా అలా ఒక మత దేవతల ప్రతిమ శాస్త్ర లక్షణాలను బట్టి ఉండవచ్చునా అనే ప్రశ్నలు అప్పుడు తలెత్తలేదు. తెలుగు తల్లి విగ్రహం వద్దు, తెలంగాణ తల్లి విగ్రహం కావాలి అనే ఉద్యమక్రమపు వేడిలో అస్తిత్వ ప్రకటన ఉండినంతగా కళా దృష్టి ఉన్నట్టు లేదు. ఉద్యమక్రమంలో భిన్నమైన ఆలోచనలు తెలంగాణ తల్లి రూపాన్ని భిన్న కోణాల నుంచి ఆలోచించాయి. ఇప్పుడు తెలుస్తున్నదాన్ని బట్టి ఐదారు రూపాలు వచ్చాయి.
ఉద్యమక్రమంలో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఒకే నాయకత్వం స్థిరపడింది కాబట్టి ఆ నాయకత్వపు రూపమే అంతిమ రూపంగా మారిపోయింది. ఆ విధంగా రూపొందిన తెలంగాణ తల్లికి కిరీటమూ, ఆభరణాలూ, మిరుమిట్లు గొలిపే వజ్రాలూ, భారీ పట్టుచీర, ఒకచేతిలో బతుకమ్మ, ఒక చేతిలో కంకులూ అన్నీ సమకూరాయి గాని, కనీసం తెలుగు తల్లికి ఉండినటువంటి గాంభీర్యమూ, ఉదాత్తతా, శిల్ప లక్షణాలూ, తెలంగాణ భౌగోళిక స్ఫురణా ఉండవలసినంత లేకుండా పోయాయి.
అసలు తెలంగాణ తల్లి అనే భావన ఎందుకు, ఎట్లా వచ్చింది? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన ఆధునిక భావన కన్నా ఎక్కువగా ఇప్పటికీ ప్రజలలో దేశమంటే మట్టి అనే భావనలే ఉన్నాయి. పుట్టిన మట్టిని తల్లిగా భావించడం ప్రపంచంలో చాలా దేశాలలో ఉంది. అందువల్లనే మాతృభూమి అనే భావన ఉంది (కొన్ని యూరపియన్ దేశాలలో పితృభూమి భావన కూడా ఉంది).
ఒకసారి దేశాన్ని తల్లి అనుకున్నాక ఆ తల్లికి ఒక రూపం ఉండాలనే ఆలోచన ఉంటుంది. మనదేశంలో విభిన్న రాష్ట్రాలు చారిత్రకంగా విభిన్న జాతులకు చెందినవి గనుక భారత మాత భావనను ఆమోదిస్తూనే అంతకు ముందరి జాతి- ఉపజాతి మాత భావనలు కూడా కొనసాగాయి.
బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడానికి ఉద్యమం ప్రారంభించిన ఆంధ్ర మహాసభ తెలుగుతల్లి భావనను ముందుకు తెచ్చింది. 1940లలో ఒక సినిమా కోసం శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగు తల్లికీ మల్లెపూదండ పాట ఆ తెలుగు తల్లి భావనను మరింత విస్తరించింది.
ఆ రూపం తప్పకుండా మెరుగు పరచవలసిందే. మార్పులూ చేర్పులూ చేయవలసిందే. కాని ఇప్పుడు జరిగిన పని అది కాదు. ఇప్పుడు పాత రూపం కన్నా అన్యాయమైన రూపం తయారై కూచుంది. పైగా, ఇప్పుడు తన రూపాన్ని విమర్శించగూడదని రాజ్యపు ఆదేశాలతో సహా వస్తున్నది. మామూలుగా తల్లి రూపం అర్ధనిమీలిత నేత్రాలతో, దయగా, సంతోషంగా, వరదాయినిలా ఉండాలంటారు. ఇప్పుడీ తల్లి మాత్రం నన్ను విమర్శిస్తే శిక్షిస్తా అని బెదిరింపుతో వస్తున్నది. అదే విషాదం.
ఈ సందర్భంగా, చలం ఎప్పుడో 1940ల్లోనో, 50ల్లోనో రాసిన ఒక రచనలోని భాగం గుర్తొస్తున్నది: “భరతమాత… తెలుగుతల్లి… పాకిస్తాన్ మాత. ఎక్కడుంది? భరత మాత. రష్యా పిత. అమెరికా అత్త. చైనా తాత. పెరూ మరదలు… ఏనాటికయినా నవ్వుకోరా, మట్టిని పట్టుకొని గంతులేసిన కాలాన్ని చూసి… నిజంగా చెప్పు ఈ పద్యాల మాటలకేం గాని, ఆ మట్టిని చూసి నీకు తల్లిలా అనిపించిందా?
మరి తెలుగు జాతి? జాతి… జాతి… ఏం మనుషులైనాక ఏదో ఒక బాష ఉండదూ… ఎక్కడో ఓ చోట పుట్టరూ? ఏదో ఓ తిండి తినరూ? ఏదో మాతట. వీళ్లకి స్తన్యం ఇస్తోందట. ఒళ్లో ఉయ్యాలలు ఊపుతోందట. ఏడుస్తోందట. ఉన్న మనుషులు చాలరూ ఏడవటానికి? లేని మాతల్నీ, అక్కల్నీ కల్పించుకొని ఎందుకా ఏడుపులు?” చలం తర్వాత ఎనబై ఏళ్లకు సమాజం ముందుకు పోయిందా, వెనక్కి పోతున్నదా? (ప్రజాతంత్ర (prajatantranews.com) లో పోస్ట్ చేసిన వ్యాసం) (ఎం,వి.రమణ ఫేస్‌బుక్ వాల్ నుంచి స్వీకరణ)
Share this Article