.
రామాయణం… వందల కళారూపాల్లో ప్రదర్శింపబడిన కథ… అనేక దేశాల్లో… ఇండియాలో అనేక సినిమాలు తీశారు… వాటిని జనరంజకంగా తీయడంలో తెలుగువాడే మొనగాడు…
ఆమధ్య వచ్చిన ఆదిపురుష్ అత్యంత తీవ్ర నిరాశను మిగిల్చింది… బోలెడు విమర్శలు… దర్శకుడు ఓం రౌత్ పూర్తిగా హీరో ప్రభాస్‌ను, నిర్మాతల్ని, ప్రేక్షకులందరినీ తప్పుదోవ పట్టించాడు… అన్నింటికీ మించి ఆ గ్రాఫిక్స్ అత్యంత నాసిరకం…
Ads
తరతరాలుగా రాముడు, సీత, రావణుడు పాత్రలు ఇలా ఉంటాయి అని ప్రేక్షకుల మెదళ్లపై కొన్ని రూపాలు ఫిక్సయిపోయి ఉన్నాయి… అలాగే వానరులు, జాంబవంతుడు, జటాయువు వంటివి కూడా… వాటికి భిన్నంగా దర్శకుడు కొత్తగా చూపాలనుకున్నప్పుడు జాగ్రత్తలు అవసరం…
నాకిష్టమైంది నేను తీస్తా అంటే కుదరదు… పైగా వందల కోట్ల ఖర్చును చూపిస్తున్న సినిమాలు… ఆ ఖర్చులో నిజమెంతో, దందా ఎంతో తెలియదు గానీ… ఇప్పుడు 850 కోట్లతో మరో రామాయణం… నితిశ్ తివారీ దర్శకుడు… 2026లో ఫస్ట్ పార్ట్, 2027లో సెకండ్ పార్ట్ రిలీజయ్యే దీనిపై బాగా ఆసక్తి నెలకొని ఉంది… కారణాలు ఏమిటంటే..?
రణబీర్‌కపూర్ రాముడు, మన సాయిపల్లవి సీత… కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్ రావణుడు… అంతేకాదు, వినిపించే వార్తలను బట్టి హనుమంతుడిగా సన్నీ డియోల్… లారా దత్తా కైెకేయి, షీబా చబ్బా మంథర… రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ… నాటి టీవీ రాముడు అరుణ్ గోవిల్ ఇందులో దశరథుడు… రవి దూబే లక్ష్మణుడు…
ఇళయరాజా సంగీతం… యశ్ సహనిర్మాత… ప్రఖ్యాత గ్రాఫిక్స్ సంస్థ DNEG సాంకేతిక సహకారం… తారాగణం, సాంకేతికగణం టాప్ రేంజ్… భారీ ఖర్చు… కానీ సన్నీడియోల్ చేసిన ఒకటీరెండు వ్యాఖ్యలు సినిమాపై ఆదిపురుష్ బాపతు సందేహాలను లేవనెత్తుతోంది…
‘‘అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తరహాలో ఉంటుంది’’ అన్నాడు… ఆదిపురుష్‌ను జనం తిరస్కరించడానికి కారణాల్లో వానరసేనను చూపించిన తీరు కూడా ఒకటి… చింపాజీలకు ఎక్కువ, గొరిల్లాలకు తక్కువ బాపతు ఏవో జీవులను… ఏదో యానిమేటెడ్ సీరీస్ నుంచి యథాతథంగా కాపీ చేసి పేస్ట్ చేసినట్టుగా ఓం రౌత్ పిచ్చి ప్రయోగం ఏదో చేశాడు…
ఇప్పుడు కూడా కొంపదీసి ఈ నయా ఓం రౌత్ అలియాస్ నితిశ్ తివారీ కూడా అలాంటి గ్రాఫిక్ ప్రయోగాలు ఏమైనా చేస్తున్నాడా వానరసేన మీద అనేది డౌట్… అవతార్ సినిమాలో పండోరా గ్రహవాసుల్లా వానరుల్ని చూపిస్తారా అని ప్రేక్షకలోకం అనుమానపు చూపులు చూస్తోంది ఇప్పుడు…
రామాయణాన్ని కొత్తగా చెప్పాలని అనుకుంటే తప్పేమీ లేదు… కాకపోతే ఓసారి ఆదిపురుష్ అనే నాసిరకం ఉత్పత్తికి కారణాలేమిటో థరోగా స్టడీ చేసి, కాస్త జాగ్రత్తగా తీయాలి… ప్రజల్లో ముద్రించుకుపోయిన రూపాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి… లేదంటే..? ఏముంది..? 850 కోట్ల ప్రాజెక్టు… రిలీజు నాటికి మూడు సున్నాలూ నిండుతాయేమో..!! జాగ్రత్త..!!
Share this Article