.
అయిపోయింది… సద్దుమణిగింది… వేడి చల్లారింది… అల్లు అర్జున్ ఇక రొటీన్ తన జీవితంలోకి వచ్చేశాడు… ఇండస్ట్రీ ప్రముఖగణం ఆ ఇంటి ముందు వరుస కట్టింది… ఓదార్పు కోసం… పరామర్శ కోసం… సంఘీభావం కోసం… కానీ..?
అసలు ఆ అరెస్టు ఎందుకు జరిగింది..? కనీసం బన్నీ ఒక్క రోజైనా జైలులో ఉండాల్సిందే అని ఎవరు సంకల్పించారు..? ఈ ప్రశ్న మిగిలే ఉంది…
Ads
అబ్బే, అది రాజ్యధర్మం, తనకన్నా ఎవరూ మించిపోకుండా తనే బ్యాలెన్స్ చేస్తుంది… చట్టం కదా, తన పని చేస్తుంది… అని ఒక వాదన… సూత్రరీత్యా వోకే… కానీ రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు నుంచి అటు కదిలిందీ అంటే దానికి ఓ కారణం ఉంటుంది…
ప్రత్యేకించి కులం, పార్టీ విపరీతంగా ప్రభావం చూపించే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నంబర్ వన్ స్టార్‌ను అంత అల్లాటప్పాగా అరెస్టు చేసి, కటకటాల్లోకి తోయడానికి రేవంత్ రెడ్డి అంత ఆలోచనారహితుడు కాడుగా…
ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది, బయటికి చెప్పబడే శుష్క కారణాలు, డొల్ల విశ్లేషణలకు మించి ఇంకేదో ఉంది..? ఎస్, ఏపీ ప్రభుత్వ ముఖ్యులతో రేవంత్‌రెడ్డికి సత్సంబంధాలున్నాయి… నో డౌట్… అల్లు అర్జున్ అరెస్టు యథాలాపంగా, రొటీన్ ప్రొసీజర్ మేరకు జరిగింది మాత్రం కాదు…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న అల్లు అరవింద్‌కు, ఈరోజు బన్నీకి ఫోన్ చేసి, ధైర్యంగా ఉండండీ అని చెప్పాడట… చిరంజీవి, నాగబాబు తదితరులు బన్నీ ఇంటికి వెళ్లి… క్యూ కట్టిన బోలెడు మంది స్టార్లు, సినీ ప్రముఖుల్లాగే మద్దతుగా నిలిచారు… చిరంజీవికి సాక్షాత్తూ బావమరిది కొడుకే కదా… మరి పవన్ కల్యాణ్ ఏమైనా ఫోన్ చేశాడా..? తెలియదు… ప్రత్యేకించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చక్రధారి లోకేష్ కాల్ చేశాడా..?! తెలియదు..!
కేటీయార్, హరీష్ సత్వర ఖండన వెనుక రీజన్ ఉంది… జగన్ ఖండన వెనుకా అదే రీజన్ ఉంది… లక్ష్మిపార్వతి పిచ్చి కామెంట్ ఏమీ చేయలేదు, చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించింది… వైసీపీ శిబిరంలో, బీఆర్ఎస్ శిబిరంలో అదే భావన బలంగా ఉంది… ఏవో ఆధారాలు కనిపించే ఉంటాయి…
అయితే అర్జున్‌ను టార్గెట్ చేసింది ఎవరు..? అశ్వినీ వైష్ణవ్ సహా కేంద్ర మంత్రుల దాకా ఖండించారంటే కేవలం పార్టీ స్పర్థ కాదు… యథాలాపం కాదు, యాదృచ్ఛికమూ కాదు… కానీ తేలేవరకూ మిస్టరీయే…
ఎస్, అల్లు అర్జున్ ఏ పార్టీ మనిషి కాడు… అల్లు అరవింద్ కూడా ప్రస్తుతం ఏ పార్టీతోనూ రాసుకుని పూసుకుని తిరగడం లేదు… కానీ తను వైసీపీ నంద్యాల కేండిడేట్‌కు ప్రచారం చేశాడు, కారణాలేమైనా సరే… పుష్ప2 తరువాత తన స్టామినా, తన ఇమేజీ, తన స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయాయి… ఏకు మేకవుతున్నాడు… మెగా శిబిరంలో లేడు, కూటమి ప్రభుత్వంతోనూ కుదరదు…
సరే, ఏపీలో ఎవరో ముఖ్యులకు ఎక్కడో మండుతున్నదీ అనుకుందాం… సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళ దుర్మరణం సంఘటన ఓ చాన్స్ కల్పించినట్టుంది… పావులు చకచకా కదిలినట్టున్నాయి… అంతా వోకే, మరి రేవంత్ రెడ్డికి వచ్చే పొలిటికల్ ఫాయిదా ఏమిటి..? గుండు సున్నా… పైగా కౌంటర్ ప్రొడక్ట్…
బన్నీ మామ కుటుంబం తనకూ బంధువులే అంటున్నాడు… ఆయన కాంగ్రెస్ మనిషే అంటున్నారు… మరి ఎక్కడ కొట్టింది తేడా..? ఎక్కడో తన పేరు చెప్పలేదు, హర్టయ్యాడు వంటివి శుష్క విశ్లేషణలు, పరిణత నాయకులు అలాంటి చిన్న విషయాలకు టెంప్ట్ కారు… మరేమిటి..? రేవంత్‌ను అల్లు అర్జున్ అరెస్టు వైపు ప్రోద్బలం చేసిన కారణాలు ఏమిటి..?
చిరంజీవికి, అల్లు అరవింద్‌కు, అల్లు అర్జున్‌కు ఏదో క్లారిటీ వచ్చింది… వాళ్ల తదుపరి కార్యాచరణ ఏమిటో తెలియదు… బన్నీ కూల్‌గా కనిపిస్తాడు గానీ లోలోపల చాలా ఆలోచనపరుడు… మొండి… పైగా ఇప్పుడు బలమైన పొజిషన్‌లో ఉన్నాడు… కానీ ఏం చేయగలడు..? అది కాలం చెబుతుంది…!! అందుకే ఈ ఫోటోకు చాన్నాళ్లు పని ఉంటుందనేది..!!
బీజేపీ పికప్ చేస్తుందా..? సనాతన ధర్మ సారథి, తమ భాగస్వామిని కాదని అడుగు వేస్తుందా… అసలు తను ఇప్పుడు సినిమాల్ని వదిలి ఒక పార్టీ పల్లకీ మోస్తాడా… బోలెడు ప్రశ్నలు…!
Share this Article