.
== పాపులారిటీతో దివాలా తీసిన కంపెనీ ==
సాధారణంగా ఏదైనా కంపెనీ బ్రాండ్ పేరు అతి తక్కువ సమయంలో ఎక్కువమందికి పరిచయం అయితే, దాని ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తుల సేల్స్ పెరిగితే ఆ కంపెనీ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకుపోతుంది.
Ads
కాని ఒక కంపెనీకి అలా వచ్చిన పేరు, పెరిగిన సేల్స్ భవిష్యత్తులో ఆ కంపెనీ దివాలా తీసి, ఏకంగా కంపెనీని మూసేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నిజంగా అదే జరిగింది కేటిఎం అనే బైక్ కంపెనీ విషయంలో.
కేటిమ్ బైక్ అంటే యువకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. తక్కువ బరువు ఉండటం, ఇన్స్టాంట్ పిక్ అప్, సులభంగా హ్యాండ్లింగ్ చేయడానికి, రోడ్లతో సంబంధం లేకుండా ఎటువంటి దారిలో అయినా నడిపించడానికి అనువుగా ఉండటం వలన టీనేజ్ యువకుల్లో ఈ బైక్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ బైక్ కి ఉన్న ఫీచర్లు స్టంట్స్ చేయడానికి అనువుగా ఉండటమే క్రేజ్ కి అసలైన కారణం. దీంతో ఈ బైక్ అమ్మకాలు కూడా తక్కువ కాలంలోనే దూసుకు పోయాయి.
ఈ కెటిఎం బైక్ కొనుగోలు చేసిన యువకులు రోడ్ల మీద ప్రమాదకర విన్యాసాలు చేయడం దేశవ్యాప్తంగా సాధారణ విషయంగా మారింది. దీంతో ఈ బైక్ కి ఒకవైపు పాపులారిటీతో పాటు చప్రి బైక్ అనే పేరు కూడా స్థిరపడింది.
జుట్టును పిచ్చి పిచ్చిగా కత్తిరించుకుని, రకరకాల రంగులు వేసుకుని, పొట్టి ప్యాంట్లు ధరించి, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని, రోడ్ల మీద విన్యాసాలు చేసే జులాయి యువకులను హిందీలో చప్రి అంటారు. ఇలాంటి యువకులు కెటిమ్ బైకులను ఉపయోగించి రోడ్ల మీద విన్యాసాలు చేస్తుండటం వలన దీనికి “చప్రి బైక్” అనే పేరు వచ్చింది, ఇది బ్రాండ్ నెమ్ అపఖ్యాతి పాలవడానికి కారణం అయ్యింది.
ఒకవైపు తక్కువ సమయంలోనే ఈ కేటీఎం సేల్స్ విపరీతంగా పెరిగితే, అదే సమయంలో ఈ బైకుతో రోడ్ల మీద విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడే యువకుల సంఖ్య కూడా పెరిగింది. ప్రమాదాల్లో అంగ వైకల్యం పొందడమే కాకుండా ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు.
2015లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక యువకుడు ఈ కేటిఎం బైక్ మీద ప్రమాదానికి గురై నేటికీ జీవచ్చవంలా మంచానికే పరిమితం అయ్యాడు. ఆ యువకుడికి ఈ బైక్ కొనివ్వకండి అని ఆతని తండ్రికి సలహా ఇస్తే, నాకున్న డబ్బుకు ఈ బొచ్చుగాడి సలహా నేను వినడం ఏంటని అనుకుని నా మాటలను పట్టించుకోలేదు. అది వేరే విషయం అనుకోండి.
కాలం సాగుతూ ఈ బైక్ కి మార్కెట్లో చప్రి బైక్ అనే పేరు స్థిరపడటం, బైక్ ల వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉండటం వలన తల్లిదండ్రులు ఈ బైక్ కొనడానికి ఒప్పుకోక పోవడం, స్టంట్స్ చేయడానికి తప్ప సగటు ఫ్యామిలీ మ్యాన్ నడిపించడానికి ఉపయోగపడని ఈ బైక్ సేల్స్ క్రమంగా పడిపోయాయి.
కేటీఎం ప్రస్తుతం అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల, అధిక ఉత్పత్తి, తగినంత ఆదాయం లేకపోవడం, మరియు విఫలమైన ఎలక్ట్రిక్ బైక్ ప్రాజెక్ట్ వంటి అంశాల కలయిక కారణంగా ఆర్థికంగా పతనం అయి దివాలా అంచుకు చేరింది.
కంపెనీ దివాలా తీయకుండా ఉండటానికి ఆర్థిక పునర్నిర్మాణం మరియు సురక్షిత ఫైనాన్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలు విఫలమైతే దివాలా తీయడం ఖాయం…. – నాగరాజు మున్నూరు
Share this Article