.
మల్లన్న మహారాజు (మంగోలియన్ జానపద కథ) – డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక ఊరిలో మల్లన్న అని ఒక యువకుడు వుండేటోడు. వాడు చానా పేదోడు. పని చేస్తే తిండి లేదంటే లేదు. వానికి ముందూ వెనుకా నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా చిన్నప్పుడే స్వర్గానికి నిచ్చెన వేసుకొని ఎక్కేశారు. దాంతో ఒక్కడే ఊరి చివర ఒక పాడుబడిన కొట్టంలో ఒంటరిగా వుండేవాడు. వాన్ని పట్టించుకునేటోళ్ళు, పలకరించేటోళ్ళు ఎవ్వరూ లేరు.
Ads
ఆ కొట్టం పక్కనే ఒక దట్టమైన అడవి వుంది. ఆ అడవిలో ఒక టక్కరి నక్క వుంది. అది చానా తెలివైంది. ఎంతటోన్నయినా సరే మాటలతో ఇట్టే బోల్తా కొట్టించేది. ఉపాయాల పుట్ట అది.
ఒకసారి ఆ అడవికి నలుగురు భయంకరమైన వేటగాళ్ళు వచ్చారు. కనబడిన ఏ జంతువునూ వదలకుండా పట్టి బంధించసాగారు. వాళ్ళ చేతికి చిక్కి చావకుండా బతికి బైట పడ్డం అంత సులభం కాదు.
ఈ నక్కకు ఆ వేటగాళ్ళు అడవిలోకి వచ్చింది తెలీదు. దాంతో ఎప్పటిలాగే ఆహారం కోసమని పొదల్లోంచి బైటికొచ్చింది. అంతే… వేటగాళ్ళు దాన్ని చూశారు. నలుగురూ నాలుగువైపులా దాన్ని చుట్టుకున్నారు. నక్క ప్రాణభయంతో వాళ్ళ మీది నుంచి ఎగిరి అవతలికి దుంకి చించుకోని ఉరకడం మొదలు పెట్టింది. కానీ వాళ్ళు వదుల్తేనా.
రాళ్ళు, బాణాలు, కట్టెలు, కత్తులు తీసుకొని దాని మీదకు సరసరసర విసురుతా వెంట పడ్డారు. ఒక కత్తి సక్కగా వచ్చి దాని వీపులో దిగింది. సర్రున రక్తం కారిపోతా వుంది. అది శక్తినంతా కూడగట్టుకొని మరింత వేగంగా వురకసాగింది. అంతలో దానికి అడవి బైట వున్న ఆ యువకుని కొట్టం కనబడింది. సర్రున దాంట్లోకి దూరింది.
నక్కను చూస్తానే మల్లన్న అదిరిపడ్డాడు. “యేయ్… ఫో… ఇక్కన్నుంచి” అంటూ కొట్టడానికి మూలనున్న కట్టె తీసుకున్నాడు. అంతలో ఆ నక్క కళ్ళలోంచి నీళ్ళు కారిపోతా వుంటే “మిత్రమా… నేను ఏ పాపం చేయక పోయినా నలుగురు వేటగాళ్ళు నన్ను చంపడానికి వెంట పడ్డారు. ఇప్పటికే ఒంట్లో వున్న శక్తి అంతా తగ్గిపోయింది.
ఇంక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. ఎట్లాగయినా సరే నన్ను కాపాడు. బతికిస్తావో బలిస్తావో అంతా నీ దయ” అంటూ వాని కాళ్ళ మీద పడింది. ఒంటినిండా రక్తం కారిపోతావున్న ఆ నక్కను చూస్తే మల్లన్నకు చాలా జాలి కలిగింది. దాంతో ఆ నక్కను ఇంట్లో అటక మీద దాచిపెట్టి ఏమీ ఎరుగని నంగనాచి లెక్క మట్టసంగా బైటకొచ్చి కూచున్నాడు.
అంతలో ఆ నక్కను వెదుకుతా ఆ వేటగాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు మల్లన్నని చూస్తా “ఒక నక్క మా చేతి నుండి తప్పించుకోని ఇటువైపు వచ్చింది. నువ్వేమయినా చూశావా” అని అడిగారు. దానికి మల్లన్న “కొంచెం గూడా తడుముకోకుండా “నక్కో కుక్కో సరిగా చూడలేదు గానీ… ఇంతకు ముందే కుడివైపు ఒక జంతువేదో విల్లు నుండి వెలువడిన బాణంలా సర్రున దూసుకుపోయింది. దాని ఒళ్ళంతా ఎర్రగా రక్తం కారిపోతా వుంది ఏదో దెబ్బ తిన్నట్లు” అన్నాడు.
వెంటనే ఆ వేటగాళ్ళు “అలాగా… ఐతే అది మేం వేటాడుతా వున్న నక్కనేలే. ఇంక ఎక్కువ దూరం పారిపోలేదు. రక్తం కారీకారీ ఎక్కడో ఒకచోట స్పృహ తప్పి పడిపోతాది. పదండి” అంటూ కుడివైపు దూసుకుపోయారు.
వాళ్ళట్లా పోవడం ఆలస్యం ఆ యువకుడు అటక మీది నక్కను కిందికి దించి, ఒళ్ళంతా శుభ్రంగా కడిగి, నెమ్మదిగా నొప్పి తెలీకుండా కత్తి తీసి, ఆకుపసరు పూసి కట్టు కట్టాడు. తాను తినకుండా, ఉన్నదంతా దానికి కడుపు నిండా పెట్టాడు. వారం రోజుల పాటు కన్నబిడ్డలా కాపాడాడు. దాంతో దాని గాయం మొత్తం తొందరగా తగ్గిపోయి మునపటిలా చలాకీగా తిరగసాగింది.
“మిత్రమా… ఈ ప్రపంచంలో ప్రాణాలకన్నా విలువైనది ఏదీ లేదు. నీ ఋణం తీర్చుకోలేనిది. అందుకే నీకు కనీవినీ ఎరుగనంత గొప్ప సహాయం ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. మన అడవికి అటువైపు ఒక పెద్ద రాజ్యముంది. అక్కడ ఒక పెద్ద ధనవంతుడున్నాడు. ఆయనకు పాలరాయిలాంటి చూడ ముచ్చటయిన ఒక చక్కని కూతురుంది. నువ్వు వూ అను. మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తా. మీ ఈడుజోడు అదిరిపోయేలా వుంటుంది” అనింది.
దానికి మల్లన్న నవ్వుతూ “వింటున్నా గదా అని మాటలు కోటలు దాటియ్యకు. రోజు మార్చి రోజు వేసుకోవడానికి రెండు అంగీలు లేని నేనెక్కడ… ఒక రోజు కట్టిన చీర జీవితంలో మరొక రోజు కట్టని ఆ ధనవంతుని కూతురెక్కడ. భూమీ ఆకాశం ఎక్కడైనా కలుస్తాయా” అన్నాడు.
నక్క నవ్వి “అదంతా నాకొదిలేయ్. నేను ఏం చెబితే అది మారు మాట్లాడకుండా నువ్వు చెయ్యి చాలు. మూడునెల్లు తిరిగేసరికి మూడుముళ్ళు వేయించకపోతే చూడు” అంది.
“సరే… చూద్దాం… కొండకు దారం కడదాం. వస్తే కొండ, పోతే దారం. అంతేగదా” అన్నాడు అంగీకరిస్తూ.
నక్క సక్కగా పక్క రాజ్యంలోని ధనవంతుని దగ్గరికి పోయింది. వంగి నమస్కారం చేస్తా “దొరా… నాది అడవికి అటుపక్కన వుండే రాజ్యం. తూనికలు, కొలతలు వేయడం నా వృత్తి. మా రాజ్యంలో మల్లన్న అనే కోటీశ్వరుడు వున్నాడు. ఆయన దగ్గర లెక్కబెట్టలేనంత సంపద వుంది. దాన్ని కొలిచి లెక్క చెప్పమని నాకు కబురు పంపాడు. మీ దగ్గర వెండి, బంగారం తూచడానికి పనికొచ్చే చాలా పెద్ద తక్కెడ వుందంట కదా. అందుకే మీ దగ్గరికి వచ్చా. దయచేసి దానిని ఒక పది రోజులు అరువు ఇవ్వండి” అని అడిగింది.
నక్క మాటలు విన్న ఆ ధనవంతునికి కోటీశ్వరునితో పరిచయం చేసుకోవాలి అనిపించింది. దాంతో తన దగ్గరున్న తక్కెడ పదిమంది మనుషులతో తెప్పించి ఇచ్చాడు. నక్కదాన్ని ఒక పెద్ద ఎద్దులబండిలో వేసుకొని బైలుదేరింది. ఊరి బైటకు పోగానే ఎవరూ లేనిది చూసి ఇసుక, రాళ్ళు వేసి తక్కెడ బాగా గీతలు పడేలా తోమింది.
తరువాత మల్లన్న ఇంటికి పోయి “ఎందుకు?, ఏమిటి? అని ఎదురు ప్రశ్నించకుండా నీ దగ్గరున్నదంతా అమ్మి నాకు కొన్ని వెండి ఇటుకలు కొనివ్వవా” అని అడిగింది. మల్లన్న సరేనని వున్న ఇల్లూ, అందులోని వస్తువులు వచ్చిన కాడికి అమ్మితే నాలుగు వెండి ఇటుకలు వచ్చాయి. వాటిని నక్క చేతిలో పెడతా “నీ మాట మీద నమ్మకంతో వున్న ఇంటిని గూడా అమ్మేశా. నీట ముంచినా నువ్వే, పాల ముంచినా నువ్వే… జాగ్రత్త” అన్నాడు.
నక్క చిరునవ్వు నవ్వి “నా ప్రాణాలు నిలబెట్టిన దేవునివి, నీకు మేలు చేయకపోతే ఈ బతుకెందుకు. కొద్ది రోజులు ఆగు జరిగేది చూద్దువు గానీ” అనింది.
నక్క వారం రోజులు అక్కడే వుండి తిరిగి తక్కెడను బండి మీద వేసుకొని ధనవంతుని ఇంటికి బైలుదేరింది. తక్కెడ తిరిగిస్తూ “దొరా… ఏడు పెద్ద పెద్ద గదుల నిండా, అడుగు తీసి అడుగు వేయడానికి సందు లేకుండా, బంగారం, వెండి కుప్పలు కుప్పలుగా పడున్నాయి. వారం రోజుల పాటు ఆగకుండా పని చేస్తే గానీ వాటి లెక్క తేలలేదు. తూచీ తూచీ చేతులు పడిపోయాయి. మీ తక్కెడ గూడా వాటి రాపిడికి బాగా గీతలు పడింది.
ఇక్కడికొచ్చాక చూస్తే ఇంకేముంది ఆ తక్కెడ గొలుసుల్లో ఈ నాలుగు వెండి ఇటుకలు ఇరుక్కొని కనిపించాయి. మీరు చేసిన సహాయానికి గుర్తుగా వీటిని మీరే వుంచుకోండి” అంటూ వాటిని ఆ ధనవంతుని చేతిలో పెట్టింది.
ధనవంతునికి తళతళలాడే ఆ వెండి ఇటుకలను, గీతలు పడ్డ ఇనుప తక్కెడను చూస్తే నక్క మాటలు నిజమే అనిపించాయి. దాంతో మల్లన్న గురించి తెలుసుకుందామని వివరాలు అడిగాడు. నక్క చిరునవ్వుతో “దొరా… ఆయనకు కోట్లకు కోట్ల ధనముంది గానీ నా అనేటోళ్ళు ఎవరూ లేరు. చక్కని చందమామలాగుంటాడు.
ఇంకా పెండ్లి కాలేదు. నువ్వు వూ అంటే చెప్పు మీ ఇంట్లో పెళ్ళీడుకొచ్చిన చక్కదనాల చుక్క వుంది గదా. ఇద్దరికీ మూడుముళ్ళు వేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టించేస్తా” అనింది.
ఆ ధనవంతుడు ఆలోచనలో పడి “పెళ్ళంటే మాటలు కాదు గదా… అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు. ముందు ఒకసారి ఆ అబ్బాయిని, వాళ్ళ ఆస్తిపాస్తులని చూడాలి. ఆ తరువాతే ఏదైనా” అన్నాడు.
దానికా నక్క “సరే దానికేముంది. నేను వెళ్ళి ఆ అబ్బాయిని మీ అమ్మాయిని చూడ్డానికి ఒప్పించి, పెళ్ళిచూపులకు ఒక్కన్నే తీసుకొస్తా. మర్యాదలకు లోటు చేయకండి” అని చెప్పి బైలుదేరింది.
నక్క సక్కగా మల్లన్న దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి “రేపే పెళ్ళిచూపులు. తయారవు. పొద్దున్నే పోదాం” అనింది.
ఆ మాటలకు మల్లన్న విచారంగా “కట్టుకోవడానికి తళతళ మెరిసే మంచి బట్టలు లేవు. వేసుకోడానికి ధగధగ మెరిసే బంగారు హారాలు లేవు. పూసుకోడానికి ఘుమ్మని సువాసనలొచ్చే సుగంధ ద్రవ్యాలు లేవు. ఎక్కి రావడానికి సర్రున దూసుకుపోయే మేలుజాతి గుర్రాలు లేవు. ఎలా వచ్చేది. ఈ మాసిపోయిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన ఒంటితో” అన్నాడు.
ఆ మాటలకు నక్క నవ్వి “అవన్నీ నేను చూసుకుంటాగా. నాతో బైలుదేరు. నన్ను నమ్ము” అనింది. వాడు సరేనని తరువాత రోజు పొద్దున్నే నక్కతో బైలుదేరాడు. పక్క రాజ్యానికి చేరుకోడానికి ఇంకో మైలు దూరం వుందనగా నక్క మల్లన్నను ఆపి ఒక బురద గుంట చూపిస్తా “నువ్వు పోయి అందులో దుంకు. బురద బట్టలతో ఆ బండ మీద కూర్చో. నేను ఒక గంటలో నీక్కావలసినవన్నీ తీసుకొస్తా” అనింది. వాడు మారు మాట్లాడకుండా అట్లే చేశాడు.
నక్క పరుగుపరుగున ధనవంతుని ఇంటికి పోయింది. కాబోయే అల్లున్ని వెంటబెట్టుకొస్తాదనుకుంటే ఒక్కతే రావడం చూసి “అదేంది ఒక్కదానివే వుత్త చేతులతో వూగులాడుకుంటా వచ్చావు. మా సంబంధం నచ్చలేదా” అన్నాడు.
దానికానక్క “అదేం కాదు. మీ కూతురు ఎంత పెద్ద గులువంతురాలో తెల్పి డబ్బుదేముంది… గుణం ముఖ్యంగానీ అని టకీమని ఒప్పేసుకొని బైలుదేరాడు. కానీ మీ రాజ్యానికి వచ్చే దారంతా ఒకటే గుంతలు, పెద్ద పెద్ద రాళ్ళు. ఊరి దగ్గరికి వచ్చే ముందు గుర్రం చూసుకోక ఒక గుంతలో కాలేసింది. అంతే దాని కాలు మెలిక పడి మా మల్లన్న కాస్తా బురదగుంతలో పడిపోయాడు.
గుర్రం భయపడి పారిపోయింది. దాంతో ఈ మురికి బట్టలతో పెళ్ళిచూపులకు వెళితే అందరూ కిందామీదా పడి నవ్వుతారు. మరలా మంచి ముహూర్తం చూసుకొని ఇంకోసారి వద్దాం అన్నాడు. కానీ నేను ఇంతదూరం వచ్చి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం ఏం మర్యాద. కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. ఇప్పుడే కొత్తబట్టలు తీసుకొస్తా” అంటూ ఒప్పించి, పరుగు పరుగున వచ్చా. వెంటనే మీకు కాబోయే అల్లునికి కొత్త బట్టలు, కొత్త గుర్రం, సుగంధ ద్రవ్యాలు, బంగారు హారాలు భటులతో బండి మీద పంపించండి. స్నానం చేపించి తీస్కోనొస్తాను” అనింది.
దానికా ధనవంతుడు అలాగేనంటూ నక్క చెప్పినట్టే అన్నీ పంపించాడు. మల్లన్న సంబరంగా అక్కడుండే చెరువులో స్నానం చేసి తళతళలాడే కొత్తబట్టల మీద, ధగధగలాడే బంగారు హారాలు ధరించి, ఘుమ్మని వాసన కొట్టే ఖరీదైన గంధాలు పూసుకొని, మేలుజాతి గుర్రం మీద రయ్యిమని రాజకుమారుని లెక్క వెలిగిపోతా బైలుదేరాడు.
అప్పుడు నక్క “చూడు రాజభవనంలో చాలా జాగ్రత్త. ఆ ధనవంతుని భవనాన్ని వింతగా తిరిగి తిరిగి కిందికీ మీదికీ చూడొద్దు. నీవు వేసుకున్న బట్టలవైపు పదేపదే సంబరంగా చూసుకోవద్దు. అందరి ముందూ విందులో పెద్దగా చప్పుడు చేస్తూ లొట్టలేసుకుంటా తినొద్దు… హుందాగా అచ్చం రాజకుమారుని లెక్క వుండు” అని చెప్పింది.
కానీ ఆ ధనవంతుని భవనంలోకి అడుగు పెట్టగానే అన్నీ మరిచిపోయాడు. ఇంద్రభవనం లెక్క వుంది. అంతా పాలరాయే. అడుగు తీసి అడుగేస్తే జారిపోయేటట్లున్నాయి. అడుగుకొక సేవకుడు వంగి వంగి సలాములు చేస్తున్నాడు. ఎక్కడ చూసినా గోడలకు ఖరీదైన చిత్రపటాలు. పాలరాతి విగ్రహాలు కనబడుతున్నాయి.
మల్లన్న వాటిని వింతగా, పట్టిపట్టి చూస్తా లోపలికి వచ్చాడు. తన ఖరీదైన బట్టల వైపు మాటిమాటికీ సంబరంగా చూసుకుంటా ముందుకు అడుగులు వేస్తా వున్నాడు. విందులో జీవితంలో ఎప్పుడూ తినని మధురమైన వంటలు వడ్డించారు. వాటిని లొట్టలేసుకుంటా కడుపు నిండా తినసాగాడు. అది చూసి ఆ ధనవంతునికి అనుమానమొచ్చింది.
నక్కను పక్కకు పిలిచి “నిజం చెప్పు. వీనిని చూస్తే చానా పేదవాడిలాగా, తిండికి మొహం వాచిన వానిలాగా, జీవితంలో ఎప్పుడూ కొత్త బట్టలు వేసుకోని వానిలాగా కనబడుతున్నాడు. నిజంగా నీవు చెప్పినట్లు కోటీశ్వరుడేనా” అన్నాడు.
దానికి నక్క నవ్వి “దొరా… ఎంతమాట. నీ రాజభవనం ఆయన ఇంటి కాలిగోటికి కూడా సరిపోదు. అందుకే ఎక్కడయినా ఒక్కటయినా ఖరీదయిన వస్తువు ఇంట్లో కనబడుతుందా అని పట్టి పట్టి చూశాడు. ఆయనేమో సన్నగా తాటిచెట్టులా వుంటాడు. మీరు పంపిన బట్టలేమో బాగా లూజుగా జారిజారి పోతున్నాయి. అందుకే పాపం మాటిమాటికీ అవి సరిపోయాయా లేదా, బాగున్నాయా లేదా అని చూసుకుంటా వున్నాడు.
ఇంక తిండి అంటారా… రోజుకు నచ్చినవి పది తింటే వదిలేసేవి వంద వుంటాయి. అట్లాంటిది ఇక్కడ కేవలం అరవైఆరు కూరలు గూడా పెట్టలేదు. వాటిలో చానా నచ్చకపోయినా, బాగాలేవు అంటే బాగుండదు గనుక మర్యాద కోసం లోపల్లోపల బాధపడతా, బలవంతంగా గుర్రం ఎండుగడ్డి తిన్నట్లు, పళ్ళు పటపటలాడించుకుంటా తిన్నాడు” అని చెప్పింది.
ఆ మాటలకా ధనవంతుడు సంబరపడతా “నువ్వు మల్లన్న గొప్పతనం గురించి చెబుతా వుంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతా వున్నాయి. కాబోయే అల్లుడి రాజభవనం ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఉవ్విళ్లూరుతోంది. ఒక్కసారి అవన్నీ చూసి అక్కడే పెళ్ళి ముహూర్తం పెట్టేసుకుంటాను. ఎప్పుడు రమ్మంటావ్” అన్నాడు.
దానికా నక్క “మంచి పనికి అర నిమిషమైనా ఆగకూడదంటారు. రేపు పొద్దున్నే బైలుదేరండి. నేను ముందుగా పోయి ఏర్పాట్లన్నీ చేసొస్తా” అని అడవిలో ఎట్లెట్లా రావాల్నో గుర్తులు చెప్పింది.
ఆ అడవిలో గంగులని ఒక పెద్ద గజదొంగ వున్నాడు. వాడు దేశవిదేశాలలో కొల్లగొట్టిన సంపదంతా తెచ్చి అడవిలో ఒక అద్భుతమైన భవనాన్ని కట్టుకున్నాడు. అటు అరవై ఆరు ఊర్లలో గానీ, ఇటు అరవై ఆరు ఊర్లలో గానీ అంత అద్భుతమైన భవనం వుండదు. అడుగడుగునా బంగారు తోరణాలు, రత్నాల కంబళ్ళు పరిపించాడు. వేయిమంది పనివాళ్ళు వాని కింద వుండేవాళ్ళు. వాడు గజదొంగ అని బైటి వారికి ఎవరికీ తెలీదు. ఓడలలో విదేశాలకు పోయి వ్యాపారం చేస్తుంటాడని అందరూ అనుకునేవాళ్ళు. నక్క ఆ ధనవంతునికి చెప్పిన గుర్తులు ఆ భవనానివే.
నక్క అడవిలో పోతావుంటే ఒక పెద్ద గొర్రెల మంద అడ్డం వచ్చింది. ఎంత కాదన్నా పదివేలకు పైన్నే గొర్రెలుంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతా ఎవరివి ఈ గొర్రెలు అని కాపరులను అడిగింది. వాళ్లు అడవిలో వుండే గజదొంగ గంగులువి అన్నారు.
దానికా నక్క “రేయ్… పక్కనే వున్న రాజు పెద్ద సైన్యంతో ఆ గజదొంగ గంగులుని పట్టి చంపడానికి అడవిలో తిరుగుతా వున్నాడు. ఇవి గజదొంగ గంగులువి అని ఎవరికన్నా చెప్పారనుకో ముందు మిమ్మల్ని, ఆ తరువాత మీ యజమానిని నరికి ముక్కలు చేస్తాడు. కాబట్టి ఎవరన్నా అడిగితే మల్లన్న మహారాజువి అని చెప్పండి.
ఆయన రాజుగారికి మంచి మిత్రుడు. దాంతో మిమ్మల్ని ఏమీ అనడు” అని చెప్పింది. వాళ్ళు ‘సరే’ అన్నారు. నక్క పోతావుంటే ఈ సారి పెద్ద ఆవుల మంద ఎదురొచ్చింది. వాళ్ళకు గూడా ఇంతకు ముందులాగే చెప్పి సక్కగా గజదొంగ గంగులు భవనానికి చేరుకుంది.
అది గంగులుతో “నువ్వు పెద్ద దొంగవన్న విషయం పక్క ఊరి మహారాజుకు తెలిసిపోయింది. దాంతో పెద్ద సైన్యాన్ని తీసుకొని నిన్ను చంపడానికి మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నాడు. జాగ్రత్త” అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి బెదిరించింది.
దాంతో గజదొంగ గంగులు భయంతో వణికిపోతా “నక్కలకు నలభై ఆరు ఉపాయాలు తెల్సంటారు. ఎలాగైనా ఈ ఆపద నుంచి బైటపడే ఉపాయం చెప్పు. నీకు నీ అంత బరువు బంగారం కానుకగా ఇస్తా” అన్నాడు.
అప్పుడా నక్క కాసేపు ఆలోచించినట్లు నటించి “నువ్వు పోయి ఎవరికీ కనబడకుండా ఆ పెద్ద పీపాలో దాచి పెట్టుకో.
కాసేపటికి ఇక్కడికి రాజు రాగానే ఈ భవనం, ఈ సంపదలు ఎవరివని ఇక్కడి సేవకులను అడుగుతాడు. వాళ్ళు ఇవన్నీ గజదొంగ గుంగులువి అని చెబితే ఇంకేమన్నా వుందా… నిన్ను, నీ సేవకులను పట్టుకొని ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలు కింద నరికేస్తాడు. కాబట్టి ఎవరైనా వచ్చి ఈ భవనం ఎవరిది అని అడిగితే మల్లన్న మహారాజుది అని చెప్పమను. ఆయన రాజుగారికి కాబోయే అల్లుడు. దాంతో ఎవరినీ ఏమీ చేయకుండా వెళ్ళిపోతాడు” అని చెప్పింది.
దాంతో ఆ గజదొంగ గంగులు అలాగే అని సేవకులందరికీ చెప్పి రహస్యంగా ఆ పెద్దపీపాలో దాచిపెట్టుకున్నాడు. నక్క “ఎందుకైనా మంచిది ఈ కత్తి తీసుకో. ఎవరైనా నీ మీద దాడి చేస్తే తిరిగి వాళ్ళ మీద దాడి చేయొచ్చు” అంటూ వానికి ఒక పెద్ద కత్తి ఇచ్చింది.
ధనవంతుడు సేవకులతో గుర్రాల మీద పెళ్ళి ముహూర్తం పెట్టుకోవడానికి తరువాత రోజు పొద్దున్నే బైలుదేరాడు. దారిలో గొర్రెల మంద కనబడింది. ఒకటి కాదు రెండు కాదు వేలకు వేలు వున్నాయి. అంత పెద్ద గొర్రెల మంద జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దాంతో వాటి కాపరులను పిలిచి “ఎవరిదీ గొర్రెల మంద. ఇంత పెద్దగా వుంది” అని అడిగాడు.
వాళ్ళు వినయంగా “దొరా… ఈ గొర్రెల మంద మా యజమాని మల్లన్న మహారాజుది” అని చెప్పారు. ఆ మాటలు విని ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఇంకొంచెం దూరం పోగానే ఆవుల మంద ఎదురయ్యింది. కనుచూపుమేరా ఆవులే సముద్రంలాగా కనబడుతున్నాయి. అది గూడా “మల్లన్న మహారాజుదే” అని తెలుసుకొని “ఆవులూ, గొర్రెలే ఇన్ని వుంటే నా అల్లుని ఇల్లెంత అద్భుతంగా వుంటుందో… నా కూతురు చానా అదృష్టవంతురాలు, మంచి గడప తొక్కబోతోంది” అనుకున్నాడు.
అడవి మధ్యకు రాగానే గజదొంగ గంగులు భవనం కనబడింది. తన భవనం కన్నా పదింతలు పెద్దగుంది. తెల్లగా వెలుగులు విరజిమ్ముతా వెన్నెలతో పోటీ పడుతోంది. లోపలంతా బంగారపు గోడలు, రత్నాల తివాచీలు, అడుగడుగునా అతి విలువైన పాలరాతి శిల్పాలు. అవన్నీ చూస్తా ఆశ్చర్యంగా అక్కడి సేవకులని “ఈ అద్భుతమైన రాజభవనం, విలువైన సిరిసంపదలు ఎవరివి” అని అడిగాడు. వాళ్ళంతా వినయంగా “దొరా… ఇవన్నీ మీకు కాబోయే అల్లుడు మల్లన్న మహారాజువి” అని చెప్పారు.
అప్పుడు నక్క ఎదురొచ్చి ఆ ధనవంతున్ని లోపలికి పిలుచుకుపోయింది. నూటా అరవై ఆరు వంటకాలతో పెద్ద విందు భోజనం పెట్టించింది. ఇల్లంతా చూపించాక “దొరా… నీక్కాబోయే అల్లునికి ముందూ వెనుకా ఎవరూ లేరు గదా… దాంతో అతన్ని చంపి ఈ సంపదలన్నీ దోచుకోడానికి ఒక గజదొంగ చాలా రోజుల నుండి ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తా వున్నాడు.
ఎలాగైనా సరే నువ్వే నీ అల్లున్ని కాపాడుకోవాలి. ఇందాకే అందరి కన్నుగప్పి ఇంట్లోకి దూరి అదిగో అక్కడున్న ఆ పీపాలో రహస్యంగా దాచి పెట్టుకున్నాడు. జాగ్రత్త” అని చెప్పింది.
ఆ ధనవంతుడు చిరునవ్వు నవ్వి “కత్తి విద్యలో నన్ను ఓడించే మొనగాడు ఈ చుట్టుపక్కల ఎవ్వడూ లేదు. నువ్వేం భయపడకు. ఇప్పుడే వాని అంతు తేలుస్తా” అంటూ కత్తి తీసుకొని పీపా దగ్గరికి పోయి మూత తెరిచాడు. వెంటనే గజదొంగ గంగులు కత్తితో ఆ ధనవంతున్ని చంపడానికి మీదికొచ్చాడు.
కానీ ధనవంతుడు ముందే సిద్ధంగా వున్నాడు గదా… దాంతో ఆ దొంగ కత్తి ఎత్తేలోగా వాన్ని పొడిచి కైలాసానికి పంపించేశాడు. ఇంకేముంది ఆ సంపదలకంతా మల్లన్న అధిపతి అయిపోయాడు. ధనవంతుని కూతురితో అంగరంగ వైభోగంగా పెండ్లి జరిగింది.
నక్క మల్లన్న దగ్గరికి వచ్చి “నీకు మాటిచ్చినట్లే నిన్ను గొప్పింటి అల్లుడిని చేసి మాట నిలబెట్టుకున్నా. ఇంక వెళ్ళాస్తా. పిల్లా పాపలతో హాయిగా కలకాలం కాలు మీద కాలేసుకొని బ్రతుకు. కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎవరికీ చెప్పకు. మనసులోనే పెట్టుకో” అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయింది.
***************************
Share this Article