.
( రమణ కొంటికర్ల ) గుకేష్ విజయంతో… ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇప్పుడు అభినందనలను తన బ్యాగులో వేసుకుంటోంది. ఇంతవరకూ ఎవ్వరూ సాధించని రికార్డును 18 ఏళ్లకే సాధించి… ప్రపంచ చదరంగాన్నే ఆశ్చర్యపర్చిన గుకేష్ కు.. నాల్గున్నర కోట్లకుపైగా ఆదాయపన్ను విధించడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పరపతి అమాంతం పెరిగిపోయింది. కేవలం వ్యక్తిగత దూషణలు, వ్యక్తులపై మాత్రమే సెటైర్స్ అధికంగా కనిపించే సోషల్ మీడియా సైట్స్ లో… ఇప్పుడు ఆదాయపన్ను వంటి విభాగానికీ స్థానం దక్కడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించే మాజీ భారత కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ నాల్గు కోట్ల రూపాయల ధర కంటే… ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టబోతున్నందుకు గుకేష్ బాధపడతాడో, లేదో తెలియదుగానీ… ప్రపంచ చదరంగంపై ఆయన విజయాన్ని చూసి మురిసిన యావత్ దేశం మాత్రం నివ్వెరబోతోంది.
గతవారం డిఫెండింగ్ ఛాంపియన్ చైనీయుడు డింగ్ లిరెన్ పై ఇంతవరకూ ఎవ్వరూ సాధించని విధంగా 18 ఏళ్ల వయస్సులో సాధించిన విజయంతో… గుకేష్ పేరు భారత చెస్ లో ట్రైల్ బ్లేజర్ గా ఖ్యాతికెక్కింది. అందుకుగాను, గుకేష్ కు మూడు మ్యాచులకు కలిపి ఇండియన్ కరెన్సీ రూపంలో చూస్తే… 11 కోట్ల 34 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.
Ads
పన్నుల రీత్యా చూస్తే.. 30 శాతం ట్యాక్స్ కడితే… సుమారు 3 కోట్లకుపైగానే ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది. అదనపు పన్నులు కూడా కలిపి అది కాస్తా 4 కోట్ల 67 లక్షల రూపాయలవ్వడంతో… 2025లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఎం.ఎస్. ధోనీకి దక్కిన 4 కోట్ల కంటే ఎక్కువేనంటూ కొత్త కొత్త ప్రాబబులిటీస్ తో లెక్కలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
తమిళనాడు ప్రభుత్వం గుకేష్ కు ప్రకటించిన 5 కోట్ల రూపాయల్లోనూ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుందా నిర్మలా దీదీ అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీంతో గుకేష్ ప్రైజ్ మనీపై ట్యాక్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ ఇష్యూగా చర్చకొస్తోంది.
ఏమవుతుంది… భారత చట్టాల ప్రకారమే ట్యాక్స్ పడుతుంది… ఆ ట్యాక్సే రేపు ఫ్రీబీస్ రూపంలో.. ప్రజలకు ఉచితాలందించేందుకు ఉపయోగపడుతుందని.. కొందరు సెటైరికల్ గా ప్రభుత్వాల విధానాల్ని వెటకారం చేస్తుంటే… మరికొందరు మాత్రం ఇంకొకరు కష్టపడి సంపాదించింది, సాధించింది.. ముక్కూమొకం తెలియనివారెవ్వరికో ఉచితాలకు వాడటం ఏమాత్రం అనుచితమైంది కాదంటున్నారు.
పూర్తిగా పన్ను మినహాయింపివ్వాలన్న డిమాండ్స్ తో పాటు… గుకేష్ లాంటివాళ్లు ఇండియాలో ఉంటే ఇంతే.. గుర్తింపు లేకపోగా.. ఇదిగో సాధించింది, సంపాదించింది ఇలా ప్రభుత్వాలు ట్యాక్సుల రూపంలో దోచేస్తాయంటున్నారు. ఆమె ఎవ్వరినీ వదిలేలా లేరు.. ఆమె ఆకలి చల్లారేలా లేదంటూ ఆర్థికమంత్రి సీతారామన్ టార్గెట్ గా ట్రోలింగ్స్ కొనసాగుతూనే… ఇంకోవైపు, గుకేష్ పై విపరీతమైన సానుభూతి పెరుగుతోంది.
మనదేశంలో సచిన్, ధోనీ, కోహ్లీ, పీటీ ఉష, గుకేష్ వీరెవ్వరూ టాప్ మోస్ట్ ప్లేయర్స్ కాదు… అందరికన్నా పెద్ద ప్లేయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటూ వెటకారాలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరేమో తప్పేంటని ప్రభుత్వ విధానాల్ని సమర్థిస్తున్నవారూ ఉన్నారు.
ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసిందాంతోనే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటివన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని.. భారతీయ పౌరుడిగా ట్యాక్స్ కడితే తప్పేంటనే కౌంటర్ అటాక్ కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వానికనుకూలంగా నడుస్తోంది.
ఓవైపు కార్పోరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తూ.. బ్యాంకులకు కన్నాలు పెట్టి పారిపోయే వైట్ కాలర్ నేరగాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తే పట్టించుకోనివారు.. కార్పోరేట్ శక్తులకు పన్ను మినహాయింపులిస్తున్నవారు… ఎందరో పన్ను ఎగవేతదారులు కోట్లల్లో ఎగ్గొడుతున్నా దశాబ్దాలుగా వారినేమీ చేయలేనివారు… గుకేష్ వంటి దేశం కోసం సాధించినవారిని పన్నుల రూపంలో వేధించడమేంటంటూ మొత్తంగా సోషల్ మీడియాలో భారత ప్రభుత్వ తీరుపైనే ఓ విస్తృత చర్చకు తెరలేచింది.
గతంలో సచిన్ టెండూల్కర్ 29 సెంచరీలు సాధించి డాన్ బ్రాడ్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసిన సమయంలో… ఫార్మూలా వన్ రేసర్ మైకేల్ షూ మాకర్ చేతుల మీదుగా అప్పటి స్పాన్సర్ ఫియట్ కంపెనీ గిఫ్ట్ కూ గుకేష్ లాగే భారీ మొత్తంలో ట్యాక్స్ కట్టాల్సి ఉండేది.
75 లక్షల ఫెరారీకి కారుకు.. కోటి 13 లక్షలపైన ట్యాక్స్ కట్టాల్సివస్తే.. దానికోసం సచిన్ ఆర్జీ పెట్టుకుంటే అప్పటి ప్రభుత్వం మాఫీ చేసింది. అదే పద్ధతిలో ఇప్పుడు గుకేష్ ట్యాక్స్ కూడా మాఫీ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.
భారతదేశంలో 15 లక్షలకు పైగా ఆదాయం కల్గి ఉంటే… దానికి 30 శాతం ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ వర్త్ 5 కోట్ల కంటే ఎక్కువైతే… 37 శాతం పన్ను, వాటికి తోడు 4 శాతం విద్య, ఆరోగ్య సెస్ వంటివి కలుపుకుని మొత్తంగా 42 శాతం పన్నులు కట్టాల్సిందే.
ఈ విషయాలపై గుకేష్ మాత్రం తానేం అంత ఇబ్బంది పడటంలేదన్నట్టే చెబుతున్నారు. తానెప్పుడూ చెస్ ఆటను డబ్బుతో ముడిపెట్టి చూడలేదంటున్నారు. తనకున్న అభిరుచి, చెస్ ఛాంపియన్ కావాలన్న పట్టుదల ముందు ఆ డబ్బు విషయం పెద్దగా పట్టించుకోవడంలేదు గుకేష్. తమ కుటుంబం కూడా అన్నిరకాల అనుభవాలనూ ఎదుర్కొంది.. ప్రస్తుతం మేం హ్యాపీగానే ఉన్నామంటాడు గుకేష్.
మొత్తంగా 3 కోట్ల పన్నులకుగాను.. అదనపు పన్నులు కూడా కలుపుకుని ఇప్పుడు గుకేష్ సుమారు 4 కోట్ల 67 లక్షల రూపాయల పన్నును కట్టాల్సి ఉన్న తరుణంలో.. ఆయన పన్ను విషయంలో మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, భారత ఆర్థికమంత్రిత్వ శాఖ అసలు స్పందిస్తుందా…? ఒకవేళ స్పందిస్తే.. అది ఎలా ఉండబోతోందన్న ఒకింత ఉత్కంఠ కూడా సర్వత్రా కనిపిస్తోంది.
.
గతంలో సచిన్ ఇష్యూలో ఫెరారీ ఇన్వాల్వ్ ఐపోయి ఆ పిచ్చి టాక్స్ అన్నీ తనే భరించినట్టు ఒక మిత్రుడి వివరణ…
Share this Article