కింగ్ కావాలనుకుని… అది కాస్తా అందకుండాపోయిన కసిలో… కింగ్ మేకరై.. ఇక ఆ గేమే బహుత్ మజాగా ఉందని ఆస్వాదించే ఓ విలనీహీరో కథ తాండవ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా 9 ఎపిసోడ్లతో మొదటి సీరిస్ గా వచ్చిన ఈ తాండవ్ స్క్రీన్ ప్లేను చాలా విశ్లేషణలు కొట్టిపారేసినప్పటికీ.. సమకాలీన రాజకీయాల్లోని వెలుగు, నీడలు… తమ నీడను తామే నమ్మలేని పరిస్థితుల్లో నాయకుల కుర్చీలాటను పట్టిచూపించే ఓ ప్రయత్నమే తాండవ్. సమర్ ప్రతాప్ సింగ్ గా సైఫ్ అలీఖాన్, అనురాధా కిషోర్ గా డింపుల్ కపాడియా, దేవకీనందన్ గా టిగ్మాన్షూ ధూలియా, శివశేఖర్ గా మహ్మద్ జీషన్ అయూబ్, గుర్పాల్ చౌహాన్ గా సునీల్ గ్రోవర్, మైథిలీ శరణ్ గా గౌహార్ ఖాన్, ప్రొఫెసర్ జిగర్ సంపత్ గా డినోమోరియా, సనా మీర్ గా కృతికా కామ్రా, రీచా అవస్థిగా కృతికా అవస్థి వంటివారు కీలకపాత్రల్లో… అలీ అబ్బాస్ జాఫర్ సృష్టే తాండవ్.
అప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ మూడోసారి కూడా అధికారంలోకొచ్చాక ఎందరి కళ్లో ప్రధానిపీఠంపై పడినప్పుడు పార్టీలో కనిపించే అంతర్గత సంఘర్షణే తాండవ్. అంతకుమించి కుటుంబ రాజకీయాలు నేటి పాలిట్రిక్స్ లో ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో… తన తర్వాత అధికారం కొడుకుదేననుకుని మురిసే తండ్రి… ఇంకెన్నాళ్లు తన తండ్రే ప్రధానిగా ఉండటం.. మళ్లీ అధికారంలోకొస్తామో, లేదో.. ఈసారే తండ్రి సీటే కొట్టేస్తే పోలా అని తండ్రినే అకోనైట్ అనే విషగుళికను మందులో కల్పి ఇచ్చి భార్యతో కలిసి చంపే కొడుకు… ఓవైపు ఏదో తప్పుచేశానన్న అపరాధభావం.. ఇంకోవైపు రాజకీయాల్లో ఇవన్నీ సహజమనే పోకడ.. అదిగో అక్కడి నుంచే నేటి విషమయమైన.. తమ నీడను కూడా తాము నమ్మలేని రాజకీయాలను చూపించే యత్నంతో మొదలవుతుంది తాండవ్.
Ads
ఇక జేఎన్టీయూ తరహా స్టూడెంట్స్ పాలిటిక్స్… అధికారపార్టీకి వ్యతిరేకంగా రైతుల ధర్నాలు… ఆ క్రమంలో నేతలు ఆడే రాజకీయక్రీడ… ఇవే తాండవ్ లో ప్రధాన ఘట్టాలుగా కనిపించగా… తండ్రిని చంపి సీటును కొట్టేయాలనుకున్న కొడుకుని.. ఓ హ్యాకర్ ద్వారా తనకందిన ఓ చిన్న సమాచారంతో బ్లాక్ మెయిల్ చేసి తండ్రికి అత్యంత సన్నిహితంగా మెదిలిన అనురాధా కిషోర్ ప్రధాని సీటెక్కడం… అక్కడి నుంచి సమర్ ప్రతాప్ సింగ్ వర్సెస్ అనురాధా కిషోర్ గా సాగే పొల్టికల్ డ్రామా తాండవ్. ఇందులో భాగంగా ప్రధాని పీఠంపై ఆశలు పెంచుకుని నిరాశపడే గోపాల్ దాస్ గా నటించిన కుముద్ మిష్రా… సమర్ ప్రతాప్ సింగ్ కు నమ్మిన బంటుగా కర్మ, క్రియ తానయ్యే గుర్పాల్ గా నటించిన సునీల్ గ్రోవర్, సమర్ ప్రతాప్ సింగ్ భార్య పాత్రలో కేవలం లుక్స్ తోనే జీవించిన ప్రతాప్ సింగ్ భార్య అయేషా పాత్రలో సారా జేన్ డయాస్, అనురాధా కిషోర్ పాత్రలో నటించిన డింపుల్ కపాడియాకు సపోర్టింగ్ గా మైథిలీ శరణ్ గా నటించిన గౌహార్ ఖాన్ వంటి క్యారెక్టర్స్ అదనపు ఆకర్షణ.
అయితే మొత్తంగా ప్రధాని పీఠాన్ని అధిరోహించడం కంటే కూడా ప్రధాని పీఠాన్ని శాసించే కింగ్ మేకర్ గేమ్ లోనే మజా ఉంటుందని తెలుసుకునే సమర్ ప్రతాప్ సింగ్ పాత్ర చివరి డైలాగ్స్ తో తాండవ్ లో నేటి సమకాలీన రాజకీయాలను కళ్లకట్టే ప్రయత్నమే ఈ వెబ్ సీరిస్. అయితే హిందూదేవుళ్ల విషయంలో చిత్రీకరించిన సీన్స్ వంటివాటితో తాండవ్ వివాదాల సుడిగుండంలోనే చిక్కుకోవడం..ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా పైల్ కాగా… ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కూడా ఫిర్యాదు చేసినవారిలో ఉండటంతో ఈ వెబ్ సీరిస్ వివాదాలతో మరింత క్రేజును మాత్రం దక్కించుకుందని చెప్పకతప్పదు.
రైతుల ధర్నాలు.. విద్యార్థుల ఆందోళనలను నేటి సమకాలీన రాజకీయాలతో విడగొట్టి చూడలేకపోయినా… వాటిని సీరిస్ స్క్రీన్
ప్లేలో… కథనం నడిపిస్తున్న తీరులో ఒక క్రమశిక్షణాయుతమైన ఆర్డర్ కనిపించకుండా.. అతుకుల బొంతలగా కనిపిస్తుంటుంది. స్టూడెంట్ యూనియన్ నాయకులు రైతుల ధర్నాకు మద్దతు తెలపడానికి గల నేపథ్యమేంటనే అంశాలను పట్టిచూపించడంలో.. ఆందోళనలకు కారణమేంటన్నవి ఎస్టాబ్లిష్ చేయడంలో… కళాశాల ప్రొఫెసర్లను రాజకీయ గూడుపుఠాణీలో భాగస్వామ్యం చేయడంలో మాత్రం ఒక స్పష్టత కరువైందనిపిస్తుంది ఈ సీరిస్ చూసినప్పుడు. అంతేకాదు ఢిల్లీ వంటి రాజధానిలో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్రపతి భవన్ సమీపంలో ఓ హ్యాకర్ ఇచ్చే సమాచారం కొరకు.. బదులుగా ఇచ్చే డబ్బుల బ్యాగును ఓ చెత్త కుండీలో వేయడం.. అక్కడే తమకు కావల్సిన సమాచారాన్ని పొందడంవంటివి కొంత కృతకంగా కనిపిస్తాయి. ఏదేమైనా.. సమకాలీన రాజకీయాలను చూపించాలనే తపన మాత్రం అలీ అబ్బాస్ జాఫర్ ప్రయత్నంలో కనిపిస్తుంది………… By…. రమణ కొంటికర్ల
Share this Article