……. By………… Gottimukkala Kamalakar……… డాడ్, ఆర్యూ మ్యాడ్…? జలుబుందని ఆవిర్లూ, అమృతాంజనాలూ, సెట్రిజిన్లూ, పసుపునీళ్లూ వాడుతూ ఐస్‌క్రీం తింటానంటారేంటీ…? పైగా తమరు తినడం కోసం నాకు ఆఫర్ చేస్తున్నారు. ఆ డబ్బా ఓపెన్ చేసినా ఊరుకోను. దాన్ని ఆజిటీజ్ గా ఫ్రిడ్జ్ లోపల పెట్టండి అన్నాడు మా సుపుత్రుడు……. నేచురల్స్ నుండి తెప్పించుకున్న టెండర్ కోకోనట్ ఐస్‌క్రీం అరకిలో డబ్బా నన్ను చూసి వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది. ఉసూరుమంటూ రిఫ్రిజిరేటర్ లోపలెట్టేసి హాల్లో చీదుకుంటూ కూర్చున్నాను.
****
మూడో తరుగతి నుంచి ఐదో తరుగతి దాంక మా వూర్లో నే సదువుకుంటున్నప్పుడు ఎండకాలం సెలవులల్ల పాలయిస్క్రోటు కోసం నేను, మా దోస్తులందరం కండ్లల్ల వత్తులేసుకోని సూశేటిది.
మా నెల్లపెల్లి పక్కన పస్నూరు అని ఇంకో ఊరుంటది. ఆ ఊరుకెంచి కొత్తకోంటి కృష్ణయ్య సైకిలు మీద ఐస్క్రోటులు తెచ్చేటిది. “ఐయీస్ క్రేయ్య్…!” అంటూ ఓ విచిత్రమైన అరుపుతో సైకిలు గంట గణగణగణగణ మ్రోగిస్తూ వచ్చి మా ఊరు నడిమిట్ల ఉన్న మల్లయ్య దేవుని గుడి కాడ స్టాండేసుకోని ఆగేటిది. ఎర్రటి అంగీ, ఖాకీ లాగూ, నల్లని వళ్లూ, స్లిప్పర్లూ…! మీద ఓ కాశీతువ్వాలు. తన చెమట కారుతున్న మొహాన్నీ, నీళ్లు కారుతున్న ఐస్క్రోటుల డబ్బాని ఆ తువ్వాలుతో తుడిచేవాడు.
జనం మూగేదాకా గంట గణగణలూ, ఐయీస్ క్రేయ్య్ అనే పొలికేకలూ ఆగేవి కాదు.
ఎర్రయిస్క్రోటు ఐదు పైసలు. పాలయిస్క్రోటు పది పైసలు. ఆ పాలయిస్క్రోటు చివర్లో నాలుగైదు సేమియా వర్మిసెల్లి పోచలుండేవి. మహారుచికరం అవి..!
మా నాన్న జేబులోనో, మా అమ్మ పోపులపెట్టెలోనో, మా నానమ్మ ఇనుప సందుకలోనో ఓ పావలా నా అదృష్టానికి దాదాపుగా రోజూ దొరికేది. ఆ పావలా తో రెండు పాలయిస్క్రోట్లు, ఒక ఎర్రయిస్క్రోటు కొనుక్కుని దోస్తులతో పంచుకు తినేవాణ్ని. రైతులు అర్ధశేరు వరిధాన్యానికి ఓ ఎర్రైసూ, శేరుకి ఓ పాలైసూ తీసుకునేవాళ్లు.
మూతి ఎంత ఎర్రగా ఐతే అంత నాణ్యమైన ఐస్క్రోటు అనుకునేవాళ్లం. ఆ రంగు నాన్నకి కనిపించొద్దని అంగీకి మూతి తుడుచుకుని ఇంటికి వెళ్లేవాణ్ని. అంగీ పాడైనందుకు అమ్మ చెవులు మెలేసేది. మూతిని చూసి నాన్న మూతి పగలేసేవాడు. ఐనా ఐస్క్రోటు తినడం మానలేదు.
మాకో సంవత్సరం పాటు సైకిల్ మీద వచ్చి ఐస్క్రోటులమ్మిన కొత్తకోంటి కృష్ణయ్య ఊర్లో ఓ పాత ఇల్లు కొని ఓ చిన్న కిరాణా షాపు పెట్టాడు. ప్రస్తుతం తను కృష్ణయ్య సేఠ్..!
*****
చదువుకోవడానికి మేం నల్గొండకి విజయం చేసాం. అక్కడ వెంకటేశ్వర టాకీస్ ముందు మిర్చీ బజ్జీలూ , చారీ మిఠాయి కొట్టులో కచోరీలూ ఎన్నున్నా నాకు ఐస్‌క్రీం వ్యామోహం తగ్గలేదు. సొంతంగా కొనుక్కుతిన్న పుల్ల ఐస్‌క్రీములు లెక్కకు మిక్కిలి. వాటి పుల్లలని వంటి చెరుకుగా వాడితే, బహుశా ఓ ఐదురోజుల పెళ్లి చేయొచ్చు.
హైస్కూలుకి వచ్చేసరికి ఆడపిల్లలు కొందరు స్నేహితులై నాజూగ్గా ఐస్‌క్రీములు తినడం అలవాటైంది. పెప్సీలని పాలిథిన్ ట్యూబుల్లో ఐస్క్రీములొచ్చాయి. అప్పుడే వెనీలా, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ ఫ్లేవర్ల మత్తు పట్టేసింది. అర్ధరూపాయకో పెప్సీ.
ఇంటర్లో ఉన్నప్పుడనుకుంటా…! వాల్స్ ఎమ్మెన్సీ మింగేస్తుందని తెలియని క్వాలిటీ కంపెనీ ఐస్‌క్రీం వచ్చింది.ఓసారి ఆర్రూపాయలు పెట్టి నాన్న ఓ రైన్ బో ఐస్‌క్రీం కొనిచ్చారు. అందులో అడ్డమైన సమస్త రంగులన్నీ నిండి ఉన్నాయి. అంత ఖరీదైన ఐస్‌క్రీం తిన్న ఆనందంలో కడుపునిండి ఆ తెల్లవారి నేను పళ్లు తోముకోలేదు. భోజనమూ చేయలేదు. ఆ ఇరవైనాలుగ్గంటలు నేను అంబానీలకన్నా ఐశ్వర్యం అనుభవించాను.
హైదరాబాద్ వచ్చాక కాలాఖట్టా ఐస్ గోలాలూ, సాఫ్టీ డెన్ లో కేక్ కలిపిన ఐస్‌క్రీములూ, బోలెడు తిన్నాను. మా పిల్లల స్కూల్ దగ్గరికి వెళితే పిల్లల వ్యాన్ మేట్సందరికీ తలా ఒక కార్నెటో కొనిపెట్టేవాణ్ని. తద్వారా బాలల కళ్లళ్లో ఆనందం చూస్తూ నేనూ ఓ కార్నెటో సమర్పయామి అనిపించేవాణ్ని. పిల్లలు ఇంటికి రాగానే వాళ్లమ్మతో చెప్పేవాళ్లు. ఏం పిల్లాడికే ఆస్తమా ఉందో..? ఎందుకిప్పించావంటూ మా ఆవిడ వేడివేడిగా ఫ్రైస్క్రీములు పెట్టేది. అన్నట్టు మేం ఫ్రైడ్ ఐస్‌క్రీములు కూడా తిన్నాం…!
పెళ్లిళ్లకెళితే ఐస్‌క్రీమూ, స్వీట్లూ, సలాడూ, పెరుగన్నం మన ప్రాధామ్యాలు.
మధ్యరాత్రుళ్లు మూడొచ్చి కారు తీసి రోడ్లమీద ఐస్‌క్రీం బండ్లకోసం తిరిగిన/ తిరగబోయే రోజులు నచ్చాపనచ్చలు.
క్రీమ్ స్టోన్ వచ్చి ఐస్‌క్రీం తినే నాగరికతను కూకటివేళ్లతో సహా పెకిలించి మార్చేసింది. వాడు క్రీమ్ కొడుతున్నాడో, ఖీమా కొడుతున్నాడో ఓ పట్టాన అర్ధమై ఛావదు. పైగా చావుమేళం పేర్లు. డెత్ బై చాకొలేట్ అంటాడు. పిల్లలు ” ఐ వాంటె హాజెల్‌నట్ అండ్ హనీసిరప్ ఇన్ డెత్ బై చాకొలెట్” అంటారు. నా కర్ధం కాదు. నాకోసం “తమ్మీ, ఓ సీజనల్ ఫ్రూట్ ఇన్ వెనీలా ఐస్‌క్రీం తీస్కరా..!” అంటాను. పిల్లలు వాళ్ల ఐస్‌క్రీమో రెండు స్పూన్లు నాదో నాలుగు స్పూన్ల చొప్పున తినేస్తారు.
*****
ప్రస్తుతం కొరోనా కదా…! మనుషులతో ఆడుకోవడం మార్కెట్‌కి అలవాటే కాబట్టి, పసుపు ఫ్లేవర్, దాల్చిన చెక్క ఫ్లేవర్, పెప్పర్ ఫ్లేవర్ ఐస్క్రీములొస్తున్నాయట…! ఆరోగ్యానికి మంచివట..! ఆల్కహాల్ కలిపిన ఐస్‌క్రీములు చూశాం..! ఇవి వంటింటి మసాలా ఫ్లేవర్ల ఐస్‌క్రీములు సరికొత్త సంజీవనులు అన్నమాట. ఈ జలుబు తగ్గగానే, టెండర్ కోకోనట్ ఐస్‌క్రీమ్ డబ్బాకి టెండర్ పెడతాను. చిన్నప్పుడు మా నాన్న చెబితేనే ఐస్క్రోటు తినడం మానలేదు. పెద్దయ్యాక నా కొడుకు చెబితే వింటానా….??
Share this Article