.
. ( రమణ కొంటికర్ల ) . ….. బినాకా గీత్ మాల.. 1970వ దశకంలో ఒక ఊపు ఊపిన రేడియో కార్యక్రమం. భారత్ తో పాటు, పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ వంటి చోట్లా ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పర్చుకున్న రేడియో షో. అదే సమయంలో 1975-77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో ఇందిర కుటుంబానికీ, సుప్రసిద్ధ గాయకుడు కిషోర్ కుమార్ మధ్య తలెత్తిన వివాదంతో.. ఏకంగా కిషోర్ కుమార్ పాటలపై కఠినమైన నిషేధాజ్ఞలు ప్రకటించి కూడా వార్తల్లో నిల్చింది.
ఆ తర్వాత కిషోర్ కుమార్ స్వరం కేవలం రేడియోలో ఎందరో ఎదురుచూసే బినాకా గీత్ మాలలోనే కాదు.. సినిమాల్లో వినిపించొద్దు, ఇతర ప్రైవేట్ ఆల్బమ్స్ పైనా ఆయన పేరు కనిపించొద్దు.. దూరదర్శన్ లోనూ ఆయన పాడిన పాటలు ప్రసారం కావొద్దు.. అదిగో అంతలా కొనసాగింది ఆ నిషేధం.
Ads
తాజాగా ఈ వివాదాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చించి.. నాటి ఇందిరాగాంధీ కుటుంబీకులు వ్యవహరించిన తీరును సభ ముందుంచే ప్రయత్నం చేయడంతో నాటి ఆ వివాదం మళ్లీ ఇప్పుడు తెరపైకొచ్చింది
ప్రస్తుతం శ్రీలంక బ్రాడ్ క్యాస్టింగ్ కార్పోరేషన్ గా ఉన్న రేడియో సిలోన్ మాత్రమే అప్పుడు అంతర్జాతీయ ప్రసారసంస్థగా ఉండేది. ఆ సమయంలో 1952లో ప్రారంభమైన బినాకా గీత్ మాల… భారతీయుల హృదయాలకు అత్యంత దగ్గరైన గీతాల కార్యక్రమంగా బహుళ ప్రజాదరణ పొందింది.
దానికి తోడు, భాయీ ఔర్ బహెనో అంటూ హోస్ట్ అమీన్ సయాని మెస్మరైజ్డ్ వాయిస్ తో.. సందర్భోచిత వ్యాఖ్యానంతో బినాకా గీత్ మాల కార్యక్రమం నాల్గు దశాబ్దాలపాటు శ్రోతలను ఉర్రూతలూగించింది. బస్తాలకు బస్తాలు ఉత్తరాలతో పోస్టల్ డిపార్ట్ మెంట్ పడ్డ ఇబ్బందులు కూడా బినాకా గీత్ మాల ప్రసారంలో ఓ నోస్టాల్జియానే.
అంతేకాదు, ప్రముఖ సంగీత దర్శకులు, పాటల రచయితలంతా ఎన్ని పనులున్నా బినాకా గీత్ మాల ప్రసారమయ్యే బుధవారం సాయంత్రానికి తమ చెవులను ఆల్ ఇండియా రేడియో వైపు రిక్కారించాల్సిందే! ఎందుకంటే ఒక్కోపాటను అమీన్ సయానీ విశ్లేషించే తీరుతో.. వినడానికి మాత్రమే వీనులవిందు కాకుండా ఆ పాట అర్థాన్ని, విలువను పట్టి చూపించేవి అమీన్ సయానీ మాటలు.
అలా ప్రతీ బుధవారం సాయంత్రం బినాకా గీత్ మాల కేవలం ఒక హిందీ గీతాల కార్యక్రమంగానే కాకుండా… ప్రాంతాలు, సరిహద్దులు, భాషలన్న పట్టింపుల్లేకుండా ఎల్లలు లేని ఖ్యాతిని మూటగట్టుకుంది. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా గుర్తింపు పొందిన బినాకా గీత్ మాల… కిషోర్ కుమార్ ధిక్కారస్వరంతో 70ల్లో ఒక్క కుదుపుకు లోనైంది.
కిషోర్ కుమార్ పై నిషేధం!
1970ల్లో కిషోర్ కుమార్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఎక్కడ చూసినా స్టేజ్ షోస్ నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా రేడియాలో, దూరదర్శన్ లో కిషోర్ దా పాటలే మార్మోగేవి. కానీ, చాలామంది చీకటి రోజులని విమర్శించే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన 1975 కాలం.. బినాకా గీత్ మాలాకు బ్యాడ్ డేస్ తెచ్చింది. ముఖ్యంగా సుప్రసిద్ధ గాయకుడిగా ఒక ఊపు ఊపుతున్న కిషోర్ కుమార్ పాటల పరంపరకు ఒక ఆకస్మిక విరామమేర్పడింది.
ఇందిర చిన్న కుమారుడైన సంజయ్ గాంధీ హవా నడుస్తున్న రోజులవి. ఆ సమయంలో ఇందిర ప్రభుత్వం సంజయ్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ గా పేర్కొనే పేదరిక నిర్మూలన, నాణ్యమైన జీవితాన్ని పేద ప్రజలందరికీ ఇవ్వాలన్న ఉద్ధేశంతో ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ను చేపట్టింది. ఆ సమయంలో దాన్ని ఇందిర ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకువెళ్లేందుకు బాలీవుడ్ వైపు చూసింది.
ప్రముఖులతో మాట్లాడించడం, వాటి కార్యక్రమాలకు సంబంధించిన గీతాలను రాయించి, పాడించాలని నిర్ణయించుకున్నారు. రాజకీయంగా వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సంజయ్ గాంధీ అప్పటికే టాప్ మోస్ట్ సింగర్ గా, బినాకా గీత్ మాలతో మరింత ప్రజలకు చేరువైన కిషోర్ కుమార్ తో పాటలు పాడించాలనుకున్నాడు.
అందుకోసం ఢిల్లీలోని ప్రసార మంత్రిత్వశాఖలో అప్పుడు సీనియర్ అధికారిగా ఉన్న ముజఫర్ హుస్సేన్ బర్నీ నుంచి కిషోర్ కుమార్ ఓరోజు ట్రంక్ కాల్ అందుకున్నాడు. కానీ, తనకు నచ్చితేనేగానీ ఏదీ చేయని కిషోర్ అందుకు ససేమిరా అన్నాడు.
స్వభావరీత్యా కొంత మొండితనముండటంతో.. కిషోర్ కుమార్ ను అప్పటి ఆల్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధినేత జీ. పీ. సిప్పీ, జాయింట్ సెక్రటరీ అయిన సీ. బీ. జైన్ వంటివారు కూడా బతిమాలారు. కానీ, కిషోర్ అనే మొండిఘటం మాత్రం తలొగ్గలేదు.
ఇదే విషయాన్ని ఓసారి కిషోర్ కుమార్ ప్రీతీష్ నందికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. వారెందుకు వస్తారో నాకు తెలుసు.. నేను చేయగల్గిన పనిని ఇంకెవ్వరూ చేయలేరు.. అలా అని, నాకిష్టం లేని పనిని, ఎవరో ఆదేశిస్తే, ఇంకెవరో ఆజ్ఞాపిస్తే నేను చస్తే పాడనంటూ చెప్పుకొచ్చారు కిషోర్.
ప్రేమతో, గౌరవంతో ఎలాంటివారికైనా వంగే నేను… నా తలపై కాలు పెట్టాలని యత్నిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ నాడు ఎమర్జెన్సీతో అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఇందిరనే ధిక్కరించాడు కిషోర్ కుమార్.
ఈ విషయాలన్నీ అనిరుధ్ భట్టాఛార్జీ, పార్ఠీవ్ ధర్ రచించిన.. కిషోర్ కుమార్: ది అల్టిమేట్ బయోగ్రఫీలో పేర్కొన్నారు. అప్పటికే అవసరమైతే వీధుల్లో హార్మోనియం జబ్బకు వేసుకుని అడుక్కున్నా మంచిదేగానీ.. ప్రభుత్వం చెప్పిన పాటలు మాత్రం పాడొద్దన్నంత గట్టిగా కిషోర్ కుమార్ తీర్మానించుకున్నాడు.
కిషోర్ మంకుపట్టును నాటి ఇందిర ప్రభుత్వం కూడా జిద్దుగా తీసుకుంది. విద్యాశరణ్ శుక్లా నేతృత్వంలోని ప్రసార మంత్రిత్వశాఖ ఆల్ ఇండియా రేడియోతో పాటు, దూరదర్శన్ లో కిషోర్ పాటలను ఎక్కడా ప్రసారం చేయొద్దని మూడు నెలల పాటు నిషేధం విధించింది.
అంతేకాదు, కిషోర్ పాటల రికార్డుల అమ్మకాలను కూడా అడ్డుకునేందుకు గ్రామఫోన్ రికార్డ్ కంపెనీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను నాటి hmv కంపెనీ శిరసావహిస్తే.. పాలిడోర్ కంపెనీ మాత్రం ప్రతిఘటించింది.
కానీ, బినాకా గీత్ మాల కౌంట్ డౌన్ షోలపై కిషోర్ పాటల్లేని ప్రభావం అమితంగా కనిపించింది. శ్రోతలు మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూనే ఉన్నారు. బినాకా గీత్ మాలలో బాలీవుడ్ పాటల రారాజు కిషోర్ పాటల్లేకపోవడం చర్చనీయాంశమైంది.
మరోవైపు ప్రైవేట్ షోలల్లోనూ కిషోర్ ను బహిష్కరించాలంటూ రహస్య ఆదేశాలూ జారీ అయ్యాయి. లత, ఆశాభోంస్లేతో కలిసి పాడిన ఎన్నో డ్యూయెట్స్ ప్రసారాన్ని ఆపేసి.. సింగిల్ ఫిమేల్ ట్రాక్స్ మాత్రమే ప్లే అయ్యేవి. మొత్తంగా కిషోర్ కుమార్ పై ఇందిర ప్రభుత్వ కక్షసాధింపు కూడా నాటి ఎమర్జెన్సీ తీవ్రతను పట్టిచూపేదే.
అలాంటి నిషేధం ఒకవైపు కొనసాగుతుంటే.. కిషోర్ అప్పటికే పాటలు పాడిన సినిమాలను మాత్రం చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అలా సినిమా హాళ్లు క్యూలతో నిండిపోయి.. ఎమర్జెన్సీకి, నాటి ఇందిర ప్రభుత్వానికి తిరుగుబాటుకు ప్రతీకలా ఓ నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది.
రాజ్యసభలో షా చర్చ!
2024, డిసెంబర్ 17వ తేదీన మంగళవారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాటి ఎమర్జెన్సీ కాలంలో ఇందిర ప్రభుత్వ వ్యవహారాన్ని ఉటంకిస్తూ కిషోర్ కుమార్ వంటి ఒక కళాకారుడిపై ఎలా కక్షసాధింపు చేసిందో దుయ్యబట్టాడు.
తానూ బినాకా గీత్ మాల వినేవాడినని.. ఓరోజు సడెన్ గా ఆగిపోవడం.. కిషోర్ పాటలు మాయమైపోవడంతో ఆ తర్వాత తెలుసుకుంటే ఇందిరాగాంధీతో కిషోర్ కు ఏర్పడ్డ విభేదాలే కారణమని తెలిసిందని చెప్పుకొచ్చారు షా. అలా నాడు ఇందిర ఎంత నియంతృత్వంగా వ్యవహరించిందో మళ్లీ సభలో చర్చకు పెట్టి.. బినాకా గీత్ మాల.. అందులో కిషోర్ పాటల నిషేధాన్ని మరోమారు తెరపైకి తెచ్చారు.
నాటి బాలీవుడ్ స్పందన!
ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి హిందీ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కానీ, మెల్లిగా కిషోర్ కుమార్ పక్కన చేరింది. సంగీత దర్శకుడు కళ్యాణ్ జీ ప్రభుత్వానికీ, కిషోర్ కు మధ్యవర్తిత్వం వహించారు.
అయితే, తాను కిషోర్ కుమార్ కోసం మధ్యవర్తిత్వం చేయలేదని.. అందువల్ల కిషోర్ ప్రభావితమయ్యేది తక్కువేనని.. కానీ, ఆయన్ను నమ్ముకున్న నిర్మాతలు ఎలాంటి తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం సరికాదనే తానో ముందడుగు వేసినట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కిషోర్ సోదరుడు అశోక్ కూడా జోక్యం చేసుకుంటే.. ఇందిర దిమ్మదిరిగే వ్యంగ్యాన్ని విసిరింది. అశోక్ కుమార్ ఇందిరను సంప్రదిస్తే బహుత్ గానా గాయా.. అబ్ జరా ఆరామ్ ఫర్మాయే అంటూ నాడు ఇందిర ఇచ్చిన సమాధానం అశోక్ ను విచారానికి గురిచేసింది.
ఆ సమయంలో కిషోర్ విశ్రాంతి తీసుకుంటూనే.. మరోవైపు అప్పుడప్పుడూ కొడుకు అమిత్ తో కలిసి తన పుట్టిన ఊరు ఖాండ్వాలో ఉంటూ భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు పర్యటనలను పెట్టుకున్నాడు. కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వరకూ పర్యటిస్తూ దొరికిందే ఛాన్స్ అన్నట్టు సేదతీరాడు. ఆ సమయంలో రవీంద్ర సంగీత్ లో సాధన చేస్తూ, కొత్త ప్రయోగాలపై దృష్టి సారించారు.
కిషోర్ పాటలపై నిషేధాజ్ఞలు కొనసాగిన సమయంలో బినాకా గీత్ మాల పై కొంత ప్రభావం కనిపించిన మాట వాస్తవమేనని.. దాని హోస్ట్ అమీన్ సయానీ కొన్ని ఇంటర్వ్యూలలో అంగీకరించాడు. రాజకీయాలు రేడియో షో బినాకా గీత్ మాలను ప్రభావితం చేసినప్పటికీ.. ప్రజలకు ఏర్పడిన ఎమోషన్ బాండ్ తో.. 1990ల వరకూ ఆ రేడియో షో సూపర్ హిట్ గానే నడిచినట్టూ ఆయన చెప్పుకొచ్చారు.
నిషేధం ఎత్తివేత!
కిషోర్ కుమార్ ఓ సారీ చెబితే సరిపోతుంది. కానీ, మొండోడు. అవసరమైతే నేను పాడటం మానేస్తానుగానీ.. నాకిష్టం లేని పాటలు నేను పాడనంటే పాడనని భీష్మించాడు. ఆయన పాటలతో కనెక్టైన జనం ఆయన గొంతును ఎలాగోలా వింటూనే ఉన్నారు. అదంతా కూడా నాటి ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వానికి నిశ్శబ్ద తిరుగుబాటులానే అనిపించేది.
ఏ ప్రసారశాఖా మంత్రి విద్యాచరణ్ శుక్లానైతే నిషేధం విధించారో.. ఆయనే మళ్లీ కిషోర్ పై నిషేధం ఎత్తివేతకు మూల కారణమయ్యాడు. కిషోర్ పుట్టిన ఊరు ఖాండ్వాలో విద్యాచరణ్ శుక్లాకు సంబంధాలున్నాయి. ఆ బంధమే మళ్లీ చర్చలకు తెరతీసింది.. కలిపింది. ఆయన నచ్చజెప్పాడు.
అలా 1976, జూన్ 14వ తేదీన కిషోర్ ప్రభుత్వానికి సహకరించడానికి ఒప్పుకోవడంతో.. నాటి జూన్ 16 నుంచి నిషేధం ఎత్తివేశారు. నిషేధం ఎత్తేసాక ఆల్ ఇండియా రేడియో కిషోర్ పాడిన దుఖీ మన్ మేరే అనే పాటను సింబాలిక్ గా మొదటి పాటగా ప్లే చేసింది. అలా దేశవ్యాప్తంగా మళ్లీ కిషోర్ గొంతు AIRలో వినిపించడంతో ఆ గొంతుతో కనెక్టైనవారెందరిలోనో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది.
ప్రభుత్వం చెప్పింది చేసి తీరాల్సిందేనన్న మాటను నిరాకరించడంతో కిషోర్ కు సమస్యలెదురవ్వొచ్చుగానీ.. స్వేచ్ఛ కల్గిన ఓ కళాకారుడిగా మాత్రం కిషోర్ పేరు మార్మోగింది.
అలా ఆల్ ఇండియా రేడియో సేవలను 1988లో వివిధ భారతి కింద మార్చేశాక… బినాకా గీత్ మాల పేరు కూడా సిబాకా గీత్ మాలాగా మారిపోయింది. 1990ల వరకూ కొనసాగిన బినా కా గీత్ మాలా భారతీయ సినీ సంగీత శ్రోతలతో ఓ ఉద్వేగభరితమైన బంధాన్నేర్పర్చుకోగా.. ఎమర్జెన్సీ సమయంలో కిషోర్ పై నిషేధం మాత్రం ఓ వివాదాస్పద చీకటి ఘట్టంగా నిల్చిపోయింది.
Share this Article