.
ఇది పదేళ్లు గుర్తుండిపోయే సినిమా అని బచ్చల మల్లి గురించి హీరో నరేష్ చెప్పుకున్నమాట… మీడియా మీట్లలో, ప్రమోషన్ మీట్లలో ఎలాగూ తప్పదు ఇలాంటి విశేషణాలు వాడటం… కానీ అది వింటున్నప్పుడే కాస్త నవ్వొచ్చింది… ఎందుకంటే..? పదేళ్లు గుర్తుండిపోయే సినిమాలు అసలు గత పదేళ్లలో ఏమొచ్చాయని..!
సగటు తెలుగు హీరో అంటే ఎలా ఉండాలి..? అల్లరి చిల్లర చేష్టలు, కాస్త విలనీ షేడ్స్ ఉండే గుణం, అసాంఘిక శక్తులుగా చిత్రీకరణ… అలా ఉంటేనే జనానికి కనెక్టవుతుందనే భ్రమ కావచ్చు… మరీ ఈమధ్య రఫ్, రస్టిక్, నెగెటివ్ షేడ్స్, ప్రత్యేకించి ఫుల్లు తాగడం, మూర్ఖంగా బిహేవ్ చేయడం… ఇదే కదా ట్రెండ్… పుష్ప, యానిమల్, దసరా ఎట్సెట్రా…
Ads
ఎస్, అల్లరి నరేష్‌గా పిలవబడే జూనియర్ నరేష్ పాత్ర ఇదే బచ్చల మల్లిలో… ఐతే అలాంటి పాత్రలు కొందరికే సూటవుతాయి… నరేష్ తెరపై కనిపించగానే మనకు తన కామెడీ పాత్రలు, ఆ మంచి టైమింగు డైలాగులు, నటన గుర్తొస్తాయి… తనను ఓ ఇంటెన్స్, సీరియస్ పాత్రలో చూడటం ఇంకా జనానికి అలవాటు కాలేదు…
తను ఏదో తక్కువ చేశాడని కాదు… తన వంతు సీరియస్ ప్రయత్నం తను చేస్తున్నాడు, తన సీనియారిటీ కూడా ఉపయోగపడుతోంది… ఎన్నాళ్లు కామెడీ వేషాలు, ఆమధ్య చేసిన నాంది వంటి పాత్రలు నాలుగు గుర్తుండిపోయే సీరియస్ కేరక్టర్స్ చేద్దామనే సంకల్పం, ప్రయత్నం మంచిదే… (అప్పట్లో గమ్యంలో చేసిన గాలి శ్రీను వంటివి తనకు కరెక్టు సరిపోతాయేమో…) కానీ సంకల్పమే సరిపోదు కదా… చాలా జతకలవాలి… అఫ్‌కోర్స్, ఇందులో కూడా ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు బాగా చేశాడు…
బచ్చల మల్లి బేసిక్ స్టోరీ లైన్ మంచిదే… కానీ దాన్ని బలంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు మంగదేవి సుబ్బు విఫలమయ్యాడు… అంతా పైపైన పెరిఫెరల్‌గా సాగిపోతుంది కథనం… 2000, 1990, 1980 లలోకి వెళ్తూ ఉంటుంది కథనం కానీ ఎక్కడా సినిమాను పైకి లేపే హై సీన్లు లేకుండా పోయాయి… హీరోయిన్ అమృత అయ్యర్ సో సో…
కామెడీ రక్తికట్టలేదు… నిజానికి రావు రమేష్ బాగా చేయగలడు, చేశాడు కానీ ఓవరాల్ సినిమా ప్రజెంటేషనే పేలవంగా ఉంటే తనొక్కడూ ఏం చేయగలడు… రోహిణి, హరితేజ, అచ్యుత్ కుమార్‌లను మరింత వాడుకునే చాన్స్ ఉండేది…
ఇలాంటి హీరో కేరక్టర్లను తీసుకున్నప్పుడు బలమైన జస్టిఫికేషన్ ఉండాలి… లోతైన భావోద్వేగాలు కుదరాలి… అసలు ఇన్ని పాటలు అవసరం లేదు సినిమాలో… ఈ సినిమాకు పెద్ద విశ్లేషణలు, సమీక్షలు కూడా అక్కర్లేదు… నరేష్ శ్రమ ఉంది కానీ లోపించింది దర్శకత్వపు మెరుపులు మాత్రమే..!! సారీ నరేష్, పదేళ్లు కాదు, పది రోజులు థియేటర్లలో నడవాలని ఆశిద్దాం…
#allarinaresh , #bachalamalli , #amritaiyer , #juniornaresh
Share this Article