రండి అబ్బాయిలూ రండి!
ఇంటిపని కోర్సు చదవండి!
——————-
బెటర్ లేట్ దేన్ నెవర్. ఇప్పటికే చాలా ఆలస్యమయినా, ఇన్నాళ్లకయినా అయినందుకు సంతోషించాలి. దశాబ్దాలుగా హోమ్ సైన్స్ డిగ్రీ అమ్మాయిలకే పరిమితం. ఇకపై అబ్బాయిలకు కూడా హోం సైన్స్ డిగ్రీల్లో ప్రవేశం కల్పిస్తూ మార్పులు చేశారు. హోమ్ సైన్స్ అన్న పేరు కూడా మార్చి కమ్యూనిటీ సైన్స్ అని మారుస్తున్నారు. మంచిదే. మహిళలకు మిలటరీలో సమాన హోదా ఇవ్వడానికి ఏడు దశాబ్దాలు పట్టిందని మొన్ననే సర్వోన్నత న్యాయస్థానం బాధపడింది. అలాగే భవిష్యత్తులో మరో ఏడు దశాబ్దాలు అయ్యాక- మగవారికి హోం సైన్స్ లో ప్రవేశం కల్పించడానికి ఇన్నేళ్లు పట్టిందా అని సుప్రీం కోర్టు పశ్చాత్తాప్పడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికయినా ఆ పని చేసినందుకు సంతోషించాలి. నిజానికి హోం సైన్స్ కోర్సు మహిళలకే అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళలను అవమానించినట్లే. మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బెంగళూరు నుండి చికాగో దాక పదహారు గంటల నాన్ స్టాప్ విమానాన్ని మొత్తం మహిళలే నడిపి, మళ్లీ తిరిగి వచ్చారు. అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు. నిలిచి గెలిచారు. గెలిచి చూపించారు.
Ads
అలాంటి ధీరోదాత్తులయిన మహిళామణులను వంటింటికే పరిమితం చేశారు. మగవాడు గరిట పట్టుకోవడం మహా నేరమన్నట్లు పురుషాధిక్య భావజాలం అలవాటు చేసింది. ఇంకానా ఇకపై చెల్లదు. విశ్వ పురుషులారా! రండి వంటింటికి. పట్టండి గరిటె. చెయ్యండి వంట. వడ్డించండి విస్తట్లో. కడగండి బొచ్చెలు. ఊడవండి ఇల్లు. ఉతకండి బట్టలు. చెయ్యండి ఇంటి పని. మెళకువలు కావాల్సి వస్తే చదవండి హోం సైన్స్ డిగ్రీ!
“ఆడుతు పాడుతు పనిచేస్తుంటే
అలుపు సొలుపేమున్నది?
ఇద్దరమొకటై చేయి కలిపితే
ఎదురేమున్నది?మనకు కొదవేమున్నది?”………………. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article