అత్త సొమ్ము!
కోడలు దొంగతనం!!
———————
ఈనాడులో తగిన ప్రాధాన్యంతో అచ్చయిన వార్త ఇది. ఆలోచనాపరులు సీరియస్ గా తీసుకోవాల్సిన వార్త ఇది. అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతున్నా ఆ భారాన్ని తగ్గించుకోలేకపోతున్న దుస్థితికి అద్దం ఈ వార్త. తన పెళ్లి కోసం తల్లి దండ్రులు చేసిన లక్షల అప్పులను తీర్చడానికి దారి తప్పి దొంగగా మారి మనముందు ముద్దాయిగా బోనులో నిలుచున్న అమ్మాయి వార్త ఇది. ఆ అమ్మాయి మీద సానుభూతి పుట్టేలా అర్థవంతంగా వార్తను మలిచారు.
Ads
ఆ అమ్మాయి ఇలా పోలీసులకు దొరికి దీనంగా మనం చదివే వార్తగా మారి ఉండవచ్చు. ఆ అమ్మాయి, ఆమెకు వంతపాడిన ఆమె తల్లి…ఇద్దరిదీ తప్పే. అక్షరాలా నేరమే. కానీ- ఈ నేరానికి శిక్ష మనందరికీ కూడా పడాల్సిందే. ఎందుకంటే ఆ నేరంలో మనకూ భాగముంది కాబట్టి. ఆ నేరాలను మనం కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి.
ఉన్నా, లేకున్నా పెళ్లి న భూతో న భవిష్యతి అన్నట్లు జరిపించాలి. పెళ్లి కొడుకు జీవితంలో ఇంకెప్పుడూ నయా పైసా సంపాదించడు కాబట్టి- జీవితాంతం కూర్చుని తినడానికి వీలుగా కట్నకానుకలు ఇవ్వాలి. కారివ్వాలి. ఇల్లివ్వాలి. నగదు ఇవ్వాలి. అమ్మాయిని పుట్టింటికి పంపినప్పుడల్లా చేతగాని అల్లుడు బతకడానికి చేతనయిన సాయం చేయాలి. ఖర్మకాలి అల్లుడు ఇల్లరికం వస్తే కన్న కొడుకుకు పస్తు పెట్టి, అల్లుడికి మస్తుగా పెట్టాలి. అల్లుడు వ్యసనపరుడయితే ఆ వ్యసనాలకు అవసరమయిన అండదండలు భార్య, లేదా భార్య ఇంటివారు భరించాలి. వెన్నెముక లేని అల్లుడిని నిలబెట్టడానికి అత్తింటివారందరూ వెన్నెముకల్లేనివారు కావాలి.
ఈ వార్తలో అమ్మాయి- అత్త మామల మనసు దోచాలనే మొదట అనుకుని ఉంటుంది. అయితే అనాదిగా అత్తా- కోడళ్లు ఉప్పు నిప్పు. ఒక తరం ప్రయత్నించినా అత్త మనసు దోచవచ్చన్నది అయ్యే పని కాదు. తన పెళ్లికి అమ్మా నాన్నలు చేసిన ముప్పయ్ లక్షల అప్పు ఈ అమ్మాయిని వెంటాడుతోంది. బాధపెడుతోంది. గిల్టీగా ఫీలయ్యింది. అత్త మామల మనసు కంటే- ఇల్లు దోచి తల్లిదండ్రులను రుణ విముక్తులను చేయాలనుకుంది. సమాజంలో ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. ఇది అలాంటిది కాకపోవచ్చు. ఏవేవో ఇతరేతర విషయాలు ప్రశ్నలుగా మిగిలిపోయే అత్తవారింటి దొంగతనమిది.
అత్త సొమ్ము కోడలు దొంగిలించి…ఆ అత్త కొడుకుతో హాయిగా కాపురం చేయాలనుకున్న ఒక అమాయకురాలి దొంగతనమిది. తన పెళ్లికి చేసిన అప్పులను తనే తీర్చడానికి బాధ్యతగా ఒకమ్మాయి చేసిన దొంగతనమిది. మొత్తంగా సమాజం చేయనిచ్చిన దొంగతనమిది. సమాజమే సమాధానం చెప్పుకోవాల్సిన దొంగతనమిది. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడానికి వీల్లేకుండా…అత్త సొమ్మును కోడలు దోచిపెట్టిన దొంగతనమిది.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article