.
. ( రమణ కొంటికర్ల ) .. … ప్రతీ ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ చేసుకుంటున్నాం. దానికి సరిహద్దుల్లో మన సైనికులెంత కారణమో… అసలా మొత్తం ఎపిసోడ్ లో ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేసిన ఓ వ్యక్తి అంతకంటే కీలకం.
సదరు గొర్లకాపరి 58 ఏళ్ల వయస్సులో మృతి చెందడంతో బార్డర్ లోని సైనికవర్గాలతో పాటు.. పలువురు అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇంతకీ పాక్ పై విజయభేరి మ్రోగించిన భారత విజయం వెనుక ఉన్న తాషి నాంగ్యాల్ కథేంటి..?
Ads
1999లో ఏం జరిగింది…? తాషి నాంగ్యాల్ కారకుడెలా అయ్యాడు…?
1991 యుద్ధం తర్వాత భారత్, పాక్ మధ్య చాలాకాలంపాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. సియాచిన్ గ్లేసియర్ పైన నియంత్రణ సాధించేందుకు ఇటు భారత్, అటు పాక్ రెండు దేశాలూ తమ సైన్యాలను ఎత్తైన మంచుకొండల్లో మోహరించి ఔట్ పోస్టులు కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
1998లో ఇరుదేశాలూ అణుపరీక్షలు చేయడంతో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కానీ, 1999లో ఒక సానుకూల అడుగు పడింది. ఇరుదేశాల మధ్య లాహోర్ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య కశ్మీర్ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు కుదిరిన ఎంఓయూనే లాహోర్ ఒప్పందం.
కానీ, అది పాకిస్థాన్. సందు దొరికితే అటాకింగ్ కు రెడీ. అలాంటి బుద్ధితో ద్వైపాక్షిక శాంతి ఒప్పందాలను తోసిరాజని.. 1999లో మళ్లీ పాక్ దళాలు ఎల్వోసీ దాటి భారత్ లోకి ప్రవేశించాయి. కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. కానీ, భారత సైన్యం పాక్ కుట్రలను తిప్పి కొట్టింది.
అప్రమత్తమైన భారత్ పాక్ ఏ మాత్రం ఎదురివ్వని రీతిలో ఏకంగా రెండు లక్షలకు పైగా సైనికులను కదనరంగంలోకి దింపింది. వీరోచితంగా పోరాడిన నాటి సైనికులు పాక్ ను పరారయ్యేలా చేశారు. అదే మనం ప్రతీ ఏటా జూలై 26న జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివస్. 1999 మే నుంచి జూలై మధ్య ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది.
ఇదంతా సరే, రెండు లక్షలకుపైగా సైనికుల వీరోచిత పోరాటాలే విజయ్ దివస్ గా జరుపుకోవడానికి ప్రధాన కారణమన్నదీ నిజమే. కానీ, అసలు ఇండియన్ ఆర్మీకి ఆ ఉప్పందించింది లడాఖ్ కు చెందిన ఓ గొర్ల కాపరి. అతనే తాషి నాంగ్యాల్.
తాషి నాంగ్యాల్ గొర్లమందలో కొన్ని గొర్లు తప్పిపోయాయి. వాటిని వెతికే క్రమంలో బటాలిక్ పర్వత శ్రేణిపై నుంచి ఎవరో కొందరు అపరిచిత వ్యక్తులు బార్డర్ దాటి వస్తున్నట్టు గమనించాడు. పైగా వారి బట్టలు, వారి గడ్డాలు, వారి చేతుల్లో ఆయుధాలతో కొంత అనుమానాస్పదంగా కనిపించేసరికి… నాంగ్యాల్ సందేహపడ్డాడు.
ఆ వెంటనే అక్కడున్న ఔట్ పోస్ట్ ఆర్మీ అధికారులకు సమాచారమిచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన ఆర్మీ ఉన్నతాధికారులకు పరిస్థితి తీవ్రతను వివరించింది. ఇంకేం, ఏకంగా వేల మంది సైనికులు కదనరంగంలోకి దూకారు. లేకపోతే, సరిహద్దులు దాటి ఇండియన్ ఆర్మీ తేరుకునేలోపే జరగాల్సినంత బీభత్సం, నష్టం జరిగేది. అలా జరక్కుండా కాపాడాడు కాబట్టే.. ఈ శుక్రవారం డిసెంబర్ 20 తేదీ కన్నుమూసిన నాంగ్యాల్ కు పెద్దఎత్తున ఇండియన్ ఆర్మీ నివాళులర్పించింది.
ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ X లో తాషీ నాంగ్యాల్ కు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడింది. దేశానికి ఆయన సేవ అమూల్యమైందని ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది. నాంగ్యాల్ పేరు విజయ్ దివస్ జరుపుకున్నన్ని రోజులు భారత్ లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని పేర్కొంది. వారి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్.
ఈ ఏడాది 2024 జూలైలో జరుపుకున్న 25వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలో కూడా.. ఇండియన్ ఆర్మీ ఆహ్వానం మేరకు వెళ్లి.. తన కూతురు సెరింగ్ డోల్కర్ తో కలిసి నాంగ్యాల్ పాల్గొన్నాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లోని గార్కాన్ ఆర్యన్ వ్యాలీలో నివశించేవాడు నాంగ్యాల్. ఆయన మృతిపై ఇండియన్ ఆర్మీతో పాటు, స్థానిక బీజేపీ ముఖ్య నేత జమ్యాంగ్ సెరింగ్ కూడా X లో తన సంతాపాన్ని ప్రకటించాడు.
అలా ఓ సామాన్య పౌరుడైన నాంగ్యాల్ తన దేశభక్తిని చాటుకుని, దాయాది శత్రుదేశస్థుల నుంచి భారత్ ను రక్షించడంలోనూ, విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు గనుకే ఆ సామాన్యుడి గురించి ఈ ముచ్చట…
Share this Article