.
. ( – పంతంగి శ్రీనివాస రావు ) .. … సైలెంట్ గా OTT లోకి వచ్చి, వీక్షక సంచలనాలను నమోదు చేస్తున్న ఒక భావోద్వేగ భరిత చిత్రం ‘ నరుడి బ్రతుకు నటన ‘. హీరో కమల్ హాసన్ అభిమాని, కమల్ హాసన్ మూవీలోని ఒక పాటలోని ఒక చిన్న వేదాంత బిట్ ఈ చిత్రానికి ‘ టైటిల్ ‘ కావడం యాదృచ్చికమో ఏమో గానీ, స్టోరీకి తగిన టైటిల్ ఇది. ముందుగా అనుకున్న ‘ నట సామ్రాట్ ‘ టైటిల్ కంటే ఇదే హార్ట్ టచింగ్ టైటిల్ నిస్సందేహంగా.
విడుదలకు ముందే 60 అవార్డులు సాధించి, ప్రతిష్ఠాత్మక ‘ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘ కు ఎంపిక కావడంతోనే తెలుస్తోంది ఇదొక ‘ ఫీల్ గుడ్ మూవీ ‘ అని.
Ads
తనకు తాను ఎక్కువగా ఊహించుకుని, ఆడిషన్స్ లో భంగపడిన సినిమా పిపాస కలిగిన సత్య అనే ఒక యువకుడు, అనేక ట్రోల్స్ ను ఎదుర్కొని, చివరకు కేరళ చేరి ఒంటరి ప్రయాణం ఆరంభిస్తాడు. అతనికి స్థానిక భాష తెలియని ప్రాంతంలో, తన లవర్ కోసం కష్టంగా తెలుగు భాషను ఔపోసన పట్టిన మరో మలయాళీ యువకుడు డి.సల్మాన్ పరిచయం అవుతాడు. వీరిద్దరూ కలిసి చేసే జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు చోటు చేసుకుంటాయి.
కొంత సీరియస్ నెస్, కొంత హ్యాపీ నెస్, స్వేచ్చగా విహరించే తెంపరితనం. సల్మాన్ ఎంతటి అమాయకడంటే, తన పేరుతో కూడిన తన లవర్ పేరు బస్టాండ్ లో తనే రాసుకునెంత. ఆ విధంగా, తన ప్రేమను తానే బ్రేక్ చేసుకుంటాడు.
వీరికి తోడు గర్భం భరించే ఒక ‘ లేఖ ‘ అనే యువతి, వీరికొక కల్మషం ఎరుగని ఒక నేస్తం. అయినా, ఆమెపై సత్య మనస్సు పడతాడు. బయటకు చెప్పుకోలేక కలలు కంటుంటారు.
అతను కనే మధురమైన కలలకు, వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. చివరకు తన ప్రియ మిత్రుడితో చెప్పకుండానే, అతనితో జర్నీ విరమించుకుంటాడు.
ఒక రచయితగా ‘ ది జర్నీ విత్ సల్మాన్ ‘ అనే తన అనుభవాలతో ఒక బుక్ రాసి, దానికో ప్రశస్తిని తెచ్చి పెడతాడు సత్య. ఆ పుస్తకం వైరల్ ఆయిందనేదానికి నిదర్శనంగా తిరుపతి నుంచి వచ్చిన ఒక యువకుడు సల్మాన్ ను కలవడం. ఇక్కడ డైరెక్టర్ సమయస్ఫూర్తి బాగుంది.
క్లైమాక్స్ లో పక్షిలా రెక్కలు కట్టుకుని హీరో ఎగిరిపోవడం, ప్రయాణాల్లో పదనిసలు ఉంటాయని ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు.
OTT లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి కథ అందించిన రిషికేశ్వర్ యోగినే దర్శకత్వం వహించాడు. అయితే, అతని దర్శకత్వంలో రెండు అనవసర సన్నివేశాలు ఉన్నాయి. ఒక పసి పాపపై అంతటి ఘోరమైన అత్యాచారం, ఆ పాప ఆ అత్యాచారం తనకు తానే ఎలా జరిగిందో వివరించడం.. ఈ సన్నివేశం కథకు ఆ తర్వాత కనెక్ట్ కాలేదు కనుక అనవసరం అనుకుంటాను.
అలాగే, కారులో వెళ్ళేటప్పుడు సల్మాన్ ఒక చోట కారు ఆపి, తనకు తన ‘ లవర్ ‘ గుర్తు వచ్చిందని, ‘ ఆ ‘ క్రియ ( వాక్యాల్లో పెట్టలేను) చేయ ప్రయత్నించడం ఇది కూడా అసందర్భ సన్నివేశమే. ఒక విభిన్న జోనర్ మూవీకి ఇటువంటి సన్నివేశాలు పంటి క్రింద రాళ్ళు వంటివి. అలాగే ‘ కీ ‘ తో కారును పార్కింగ్ లో వదిలే వాళ్ళు ఉంటారా? మందులోకి స్టఫ్ కోసం తన లవర్ వివాహానికి వెళ్లి నాన్ వెజ్ అడగటం దర్శకుని హాస్య చతురతను తెలుపుతుంది.
లేఖ తాను ఎందుకు గర్భం దాల్చిందో ప్రేక్షకుల ఊహకు విభిన్నంగా ఉండటం దర్శకుని నేర్పు. ఆమె ‘ సరోగసి ‘ విధానం ద్వారా డబ్బు అవసరం కోసం గర్భం ధరించిందని, తన పని పూర్తి కాగానే, తన ప్రియ మిత్రులను వదలి వెళ్ళడం నిజంగా హార్ట్ టచింగ్ సన్నివేశమే! మళయాళ భాషలోని డైలాగ్స్ ను తెలుగు సబ్ టైటిల్స్ వేస్తే బాగుండేది.
హీరో సత్యగా శివకుమార్, మరో ప్రముఖ పాత్రలో నితిన్ ప్రసన్న (ఇతను విభిన్నత కలిగిన పాత్రలు ధరించే సత్యదేవ్ లా ఉన్నాడు. నటన కూడా అలాగే ఉంది.). లేఖగా శృతి జయన్.. ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులు సహజ సిద్దంగా ఉన్నారు.
పహాద్ అబ్దుల్ మజీద్ ఫోటోగ్రఫీ అద్భుతం. కేరళ అందాలను రమణీయంగా చిత్రీకరించాడు. కేవలం నిర్మాతలకు అభిరుచి ఉంటేనే ఇటువంటి చిత్రాలు వస్తాయి. అందుకు సుకుమార్, సింధులను ఎంతగా అభినందించినా తక్కువనే!
కమర్షియల్ బాటలో ఈ చిత్రం వెళ్ళకపోయినా, విసుగు కలిగించని ఈ ‘ నరుడి బ్రతుకు నటన ‘ చిత్రాన్ని అందించి తెలుగు భాషలోనూ ఇటువంటి చిత్రాలను నిర్మించే వారున్నారని నిరూపించినందుకు నిర్మాతలకు మరోసారి ‘ హాట్స్ ఆఫ్ ‘. ఈ చిత్రాన్ని చూడటం ‘ మిస్స్ ‘ అయితే ఒక అనుభూతిని కోల్పోయినట్లే!!
(ప్రస్తుతం ప్రైమ్, ఆహా రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్… రొటీన్ తెలుగు సినిమాల్లాగా చూడకండి, ఎందుకంటే, ఇది భిన్నమైన సినిమా కాబట్టి…)
Share this Article